Digital Payments: ఆ మాటలు నమ్మితే ఖాతా ఖాళీ చేస్తారు

నేటి డిజిటల్‌ యుగంలో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎంతో పురోగతిని చూస్తున్నాం. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్ల వ్యూహాలూ మారిపోతున్నాయి. రోజుకో కొత్త విధానంతో ఖాతాదారులను మోసం చేస్తున్నారు.

Updated : 24 May 2024 09:30 IST

నేటి డిజిటల్‌ యుగంలో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎంతో పురోగతిని చూస్తున్నాం. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్ల వ్యూహాలూ మారిపోతున్నాయి. రోజుకో కొత్త విధానంతో ఖాతాదారులను మోసం చేస్తున్నారు. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం అంటూనే మన ద్వారానే అన్ని వివరాలూ తెలుసుకొని, ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. పెరిగిపోతున్న బ్యాంకింగ్‌ మోసాలపై బ్యాంకులూ ఆందోళన చెందుతున్నాయి. పలు రకాలుగా వస్తున్న స్కాములను అర్థం చేసుకోవాలంటూ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, డిజిటల్‌ చెల్లింపుల్లో ఎదురవుతున్న కొన్ని మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

బ్యాంకులు ఎప్పుడూ మీకు నేరుగా ఫోన్‌ చేయవు... ఈ ఒక్క విషయాన్ని గుర్తించండి అంటూ.. ఒక వైపు బ్యాంకులు, మరోవైపు సైబర్‌ నిపుణులూ చెబుతున్నా చాలామంది బ్యాంకు నుంచి ఫోను అనగానే ఆందోళన చెందుతారు. వాళ్లు అడిగిన వివరాలు వెంటవెంటనే చెప్పేస్తారు. ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు అని అంటున్నా ఆ సందర్భంలో అది గుర్తుకు రాదు. దీంతోపాటు మోసగాళ్లు సందేశాలనూ పంపించి, లింకులపై క్లిక్‌ చేయాల్సిందిగా చెబుతున్నారు.

‘ఏపీకే’ను పంపిస్తూ..

ఫోన్లను తమ గుప్పిట్లోకి తీసుకోవడం ద్వారా మొత్తం సమాచారాన్ని తస్కరించడంతో పాటు, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇందుకోసం ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ (ఏపీకే)లను పంపిస్తున్నారు. వీటిని క్లిక్‌ చేయగానే ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అవుతాయి. ఇక అక్కడి నుంచి ఇక మన ఫోన్‌ హ్యాకర్ల చేతికి వెళ్లినట్లే. ఈ ఏపీకే మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు తమ ఖాతాదారులకు సూచనలు జారీ చేశాయి. ముఖ్యంగా కేవైసీ అప్‌డేట్, రివార్డు పాయింట్లను తీసుకోవడం లాంటి వాటి పేరుతో ఇవి వస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాయి. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ లింకులు సందేశాల్లో పంపించమని చెబుతున్నాయి.

ఎలా గుర్తించాలి?: మొబైల్‌ ఫోన్‌కు సందేశం రూపంలో వచ్చిన ఏపీకేను ఇన్‌స్టాల్‌ చేయడం ఎప్పుడూ మంచిది కాదు. ఇది కేవలం కొన్ని కేబీల్లోనే ఉంటుంది. ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయగానే ఫోన్‌ నంబర్లు, యాప్‌లు, కెమేరాలాంటివన్నీ ఉపయోగించుకోవడానికి అనుమతులు అడుగుతుంటుంది. వీటిని బట్టి, అది మోసం అని అర్థం చేసుకోవచ్చు.

 కేవలం గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి అధీకృత యాప్‌లను మాత్రమే ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ఎప్పుడూ మంచిది.

సందేశాలతో..

బ్యాంకు నుంచి వివిధ పథకాలు, బీమా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారంతో సందేశాలు వస్తుంటాయి. నిజమేననుకొని, ఆ లింకులను క్లిక్‌ చేస్తే.. మన వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాల్సిందిగా కోరుతుంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తమ ఖాతాదారులకు సూచించింది. బీమా పాలసీలను విక్రయించడం కోసం ప్రత్యేకంగా ఎవరినీ నియమించుకోలేదని స్పష్టం చేసింది. అవసరమైతే బ్యాంకు శాఖను సంప్రదించాలని తెలిపింది.

ఓటీపీలతో జాగ్రత్త

బ్యాంకు నుంచి వచ్చిన ఓటీపీల విషయంలో జాగ్రత్త పాటించాలని యాక్సిస్‌ బ్యాంకు, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు సూచించాయి. ఖాతాదారులు ఏదైనా లావాదేవీ చేసినప్పుడే ఓటీపీలు వస్తాయని, దాన్ని నమోదు చేయడం ద్వారా ఆ లావాదేవీ పూర్తవుతుందని పేర్కొన్నాయి. ఎలాంటి ఆన్‌లైన్‌ లావాదేవీలు చేయకుండా ఓటీపీ వచ్చిందంటే అనుమానించాల్సిందేనని, వెంటనే బ్యాంకు సేవా కేంద్రానికి ఫోన్‌ చేయాలని బ్యాంకులు చెబుతున్నాయి.

క్విషింగ్‌ బారిన పడొద్దు..

ఇదో కొత్త రకం మోసం. ఖాతాదారుల ఫోన్‌కు ఏదో ఒక క్యూఆర్‌ కోడ్‌ వస్తుంది. ఇందులో మోసపూరిత వెబ్‌సైటు లింకులు ఉంటాయి. క్యూఆర్‌ కోడ్‌లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయగానే ఆ వెబ్‌సైటు తెరుచుకొని, మన సమాచారాన్ని ఆరా తీయడం మొదలుపెడతాయి. చూడ్డానికి ఇవి బ్యాంకు వెబ్‌సైట్ల మాదిరిగానే ఉంటాయి. కొన్నిసార్లు క్యూఆర్‌ కోడ్‌ను ఓపెన్‌ చేయగానే డబ్బులు పంపించేందుకు పిన్‌ను నమోదు చేయాలని అడుగుతాయి. ఏమరుపాటులో పిన్‌ నమోదు చేశామా.. అంతే సంగతులు.

మన కష్టార్జితం అంతా బ్యాంకు ఖాతాలోనే ఉంటుంది. కాబట్టి, ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండక తప్పదు. మోసపోయినట్లు అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత బ్యాంకు సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. వీలైనంత వేగంగా సైబర్‌ క్రైం స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని