Emergency Info on Phone: అపాయంలో మీ స్మార్ట్‌ఫోనే సంజీవని.. ఎమర్జెన్సీ ఇన్ఫో అప్‌డేట్‌ చేశారా?

Eenadu icon
By Business News Team Updated : 06 Oct 2025 15:49 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అనురాధ అనే మహిళ రోజూ మాదిరిగానే ఆఫీస్‌కు వెళ్లొస్తోంది. బస్టాప్‌లో ఉండగా అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయింది. చుట్టుపక్కన ఉన్న వాళ్లు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకో, బంధువులకో సమాచారం ఇద్దామంటే.. ఆమె ఫోన్‌ లాక్‌ వేసి ఉంది. ఇలాగే రోడ్డుమీద వెళుతుంటే అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య వస్తే? అనుకోనిది ఏదైనా జరిగితే? మన ఆత్మీయులకు ఎలా తెలుస్తుంది? దీనికి పరిష్కారమే ఎమర్జెన్సీ ఇన్ఫో!

రోడ్డుమీద ఎవరైనా స్పృహ తప్పిపడిపోతే వారి కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు అటుగా వెళ్లేవారు ప్రయత్నిస్తుంటారు. స్టూడెంట్సో, ఉద్యోగులో అయితే ఐడీ కార్డును బట్టి వారి సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుందనే కొందరు పేరు, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌, బ్లడ్‌ గ్రూప్‌ వంటి వివరాలను చిన్న పేపర్‌పై రాసి పర్సులో పెట్టుకుంటారు. ఫోన్‌ వాడేవారు బ్యాక్‌ కవర్‌లో ఉంచుతుంటారు. ఒకవేళ మీరు స్మార్ట్‌ఫోన్‌ వాడేవారైతే మొబైల్‌లోనే ఈ వివరాలు అప్‌డేట్‌ చేసి పెట్టుకోవడం మంచిది. అనుకోనిది ఏదైనా జరిగిన సందర్భాల్లో బయటి వ్యక్తులు ఆ సమాచారాన్ని యాక్సెస్‌ చేసేలా సెట్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను మీ ఫోన్‌లో ఎలా సెట్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడే వారైతే

  • ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎమర్జెన్సీ అని సెర్చ్‌ చేయండి
  • అక్కడ Emergency Information లేదా My Info అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • అక్కడ మీ పేరు, చిరునామా, బ్లడ్‌ గ్రూప్‌, మందులు, అలర్జీలు వంటి వివరాలు ఫిల్‌ చేయొచ్చు.
  • అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లను కూడా అక్కడ్ సేవ్‌ చేయొచ్చు.

ఇన్ఫో చూడడం ఎలా?

  • ఫోన్‌ లాక్‌ వేసి ఉన్నప్పుడు లాక్‌స్క్రీన్‌ నుంచి Swipe Up చేస్తే Emergency ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • పవర్‌ బటన్‌ను రెండుసార్లు నొక్కినా ఈ ఆప్షన్‌ దర్శనమిస్తుంది.
  • అందులో ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్‌ను ఎంచుకోండి.
  • అక్కడ ఉన్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు నేరుగా కాల్‌ చేయొచ్చు.
  • లోకల్‌ ఎమర్జెన్సీ నంబర్‌కి కూడా డయల్‌ చేసే అవకాశం ఉంటుంది.

ఐఫోన్‌లో ఇలా..

  • ఐఫోన్‌లో హెల్త్‌ యాప్‌ను ఓపెన్‌ చేయండి.
  • అందులో మెడికల్‌ ఐడీలోకి ఆరోగ్య సమస్యలు, అలర్జీలు ఉంటే ఎంటర్‌ చేయండి.
  • ఆ దిగువనే ఎమర్జెన్సీ కాంటాక్టుల వివరాలను అప్‌డేట్‌ చేయండి.
  • వీలైతే మీ ఫొటో కూడా అప్‌లోడ్‌ చేయండి.
  • లాక్‌స్క్రీన్‌పై ఈ సమాచారం కనిపించేలా ఆప్షన్‌ ఎనేబుల్‌ చేయండి.

ఐఫోన్‌లో ఇన్ఫో ఎలా చూడాలి?

లాక్‌స్క్రీన్‌లో పాస్‌కోడ్‌ అడిగినప్పుడు Emergency ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయండి.
అక్కడ Medical ID ట్యాప్‌ చేస్తే ఎమర్జెన్సీ ఇన్ఫో, కాంటాక్ట్స్‌ డిస్‌ప్లే అవుతాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :
Published : 06 Oct 2025 15:06 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని