Buying House: ఇల్లు కొనుగోలు చేసే ముందు ఈ ఖర్చులను అంచనా వేశారా?

ఇంటిని కొనుగోలు చేసినప్పుడు పైకి కనిపించని అనేక భారీ ఖర్చులుంటాయి, ఆ ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకోండి.

Updated : 29 Aug 2023 17:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటారు. ఇల్లు అనేది ఎవరికైనా వారి జీవితంలోనే అతి పెద్ద ఖర్చుతో కూడిన విలువైన ఆస్తి. ఇంటిని కొనుగోలు చేయడం పెద్ద నిర్ణయం. కాబట్టి తగినన్ని నిధులు సమకూర్చుకోవడానికి తగినంత సమయం కూడా తీసుకోవాలి. ఇంటిని కొనుగోలు చేసినప్పుడు పరిగణించాల్సిన అనేక ఖర్చులుంటాయి. పైకి కనిపించని ఖర్చుల గురించి క్షుణంగా తెలుసుకోవాలి. అవేంటో ఇక్కడ చూడండి..

డౌన్‌ పేమెంట్‌

పూర్తి ఇంటి ధరను బ్యాంకులు రుణంగా ఇవ్వవు. మొత్తం రుణంపై కొనుగోలుదారులు 15-20% డౌన్‌ పేమెంట్‌ చెల్లించాలి. కాబట్టి రూ.50 లక్షల ఖరీదు ఉన్న ఇంటికి, మీ డౌన్‌ పేమెంట్‌ దాదాపు రూ.7.50- 10 లక్షల వరకు ఉంటుంది. అంతేకాకుండా ఇంటి రుణాన్ని తీసుకున్నప్పుడు తప్పనిసరిగా టైటిల్‌ డీడ్‌ మెమోరాండం డిపాజిట్‌ (MOTD) చెల్లించాలి. ఈ ఛార్జీలు ఇంటి రుణం మొత్తంపై 0.10% నుంచి 0.50% వరకు ఉంటాయి.

ఈఎంఐ, కాలవ్యవధి

రుణాన్ని తిరిగి చెల్లించే కాలవ్యవధిని బట్టి ఈఎంఐ మొత్తం మారుతుంది. రుణ కాలవ్యవధి 30 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. సుదీర్ఘ కాలవ్యవధి కారణంగా ఈఎంఐపై తగ్గుతుంది. కానీ, దీర్ఘకాల ఈఎంఐల సౌకర్యాన్ని ఎంచుకోవడం వల్ల చెల్లించవలసిన వడ్డీ పెరిగిపోతుంది. ఇది అదనపు ఖర్చే అని చెప్పవచ్చు.

ప్రాసెసింగ్‌, డాక్యుమెంటేషన్‌ ఫీజు

బ్యాంకులు రుణ దరఖాస్తు ప్రాసెసింగ్‌ కోసం రుసుములను వసూలు చేస్తాయి. ఇవి లోన్‌ మొత్తంపై 0.50-1% వరకు ఉండొచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, లీగల్‌ ఫీజు లాంటి ఛార్జీలుంటాయి. 

స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

స్టాంఫ్‌ డ్యూటీ అనేది ఆస్తి లావాదేవీలపై ప్రభుత్వం విధించే పన్ను. ఇది విక్రయ ఒప్పందాన్ని ధ్రువీకరిస్తుంది. ఆస్తి అమ్మకం/కొనుగోలుకు సాక్ష్యంగా పనిచేస్తుంది. రాష్టాన్ని బట్టి వీటి ఛార్జీలు 5-7% మధ్య మారుతూ ఉంటాయి. ఉదాహరణకు మీరు కొనుగోలు చేస్తున్న ఇంటి విలువ రూ.60 లక్షలయితే, స్టాంప్‌ డ్యూటీగా రూ.3-4.20 లక్షల వరకు చెల్లించాల్సి రావచ్చు. రిజిస్ట్రేషన్‌ ఖర్చు ఇంటి విలువలో 1% వరకు ఉండొచ్చు. కాబట్టి, రూ.60 లక్షల విలువ చేసే ఇంటికి రూ.60 వేలు ఛార్జీగా చెల్లించవలసి రావచ్చు.

జీఎస్‌టీ

నిర్మాణం కొనసాగుతున్న ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లయితే దానిపై జీఎస్‌టీ చెల్లించాలి. మెట్రో నగర పరిధిలో రూ.45 లక్షల కన్నా తక్కువ విలువ గల ఆస్తిని కొనుగోలు చేస్తే ఆస్తి విలువపై 1% జీఎస్‌టీ వర్తిస్తుంది. ఆస్తి విలువ రూ.45 లక్షలు దాటితే ఆస్తి విలువపై 5% జీఎస్‌టీ చెల్లించాలి. నిర్మాణం పూర్తయిన కొత్త/పాత ఇంటిని కొనుగోలు చేస్తే జీఎస్‌టీ ఉండదు.

ఒక ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు, మొత్తం ఎంత ఖర్చువుతుందో తెలిపే పట్టిక..

అడ్వాన్స్‌ మెయింటెనెన్స్‌ ఛార్జీలు

ఆస్తి నిర్వహణ ఛార్జీలు ఇంటి ధరను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఆస్తి, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌కు సంబంధించిన పరిమాణం, స్థానాన్ని బట్టి ఈ మొత్తం ఉంటుంది. సాధారణంగా నిర్వహణ ఛార్జీలలో భవనానికి సంబంధించిన భద్రత, లిఫ్ట్‌ ఛార్జీలు, ఆస్తి నిర్వహణకు రుసుములు, నీరు, విద్యుత్‌ ఛార్జీలుంటాయి. గేటేట్‌ కమ్యూనిటీలు.. పార్కులు, జిమ్‌లు, ఆట స్థలాలు వంటి వివిధ సౌకర్యాలను అందిస్తాయి. ఈ సౌకర్యాల నిర్వహణ ఖర్చులను ఇంటి యజమానులు ఎంత మంది ఉంటే అంతమందికి విభజిస్తారు.

పార్కింగ్‌ ఛార్జీలు

బిల్డర్లు, హౌసింగ్‌ సొసైటీలు వాహనాల పార్కింగ్‌ స్థలం కోసం పార్కింగ్‌ ఛార్జీలు వసూలు చేస్తారు. ఇంటి యజమాని ఒకటి కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉన్నట్లయితే అదనపు పార్కింగ్‌ స్థలాన్ని కొనుగోలు చేయడానికి మరింత డబ్బు చెల్లించాలి. సొసైటీని బట్టి, మీకు వన్‌-టైమ్‌ లేదా వార్షిక పార్కింగ్‌ ఛార్జీలు విధిస్తారు. ఇది కొన్ని వేల నుంచి లక్షల వరకు ఉండొచ్చు.

ఇంటి పన్ను

ఆస్తి పన్ను లెక్కించడానికి వివిధ పద్ధతులుంటాయి. ఈ పన్ను రాష్టాన్ని బట్టి మాత్రమే కాకుండా, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను బట్టి కూడా మారుతుంది. ఇంటిని అద్దెకిచ్చినా సరే పన్ను చెల్లించే బాధ్యత ఇంటి యాజమానిదే.

ఊహించని ఖర్చులు..

ఒక ఇంటికి మరమ్మతులు, నష్టాలు, పునర్నిర్మాణాలు వంటి ఊహించని ఖర్చులను కచ్చితంగా ఎంతవుతాయనేది అంచనా వేయలేం. కాబట్టి ప్రతి ఏడాది నిర్వహణ కోసం ఇంటి విలువలో కనీసం 1-2% వరకు కేటాయించడం మంచిది. 

చివరిగా: ఈ అదనపు ఖర్చులన్నీ మీ ఇంటి ఖర్చును గణనీయంగా పెంచుతాయి. రుణ మొత్తాన్ని ఖరారు చేసేటప్పుడు ఈ ఖర్చులన్నింటినీ బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవు. మంజూరు చేసే రుణ మొత్తం, ఆస్తి విలువపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. పైన పేర్కొన్న ఛార్జీలన్నీ సొంతంగానే భరించాలి. కాబట్టి, మీరు ఇంటి కొనుగోలు ప్లాన్‌ చేసినప్పుడు ఈ అదనపు ఖర్చులన్నింటినీ లెక్కించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని