RuPay: రూపే కార్డుదారులకు మరో సదుపాయం.. CVV లేకుండానే పేమెంట్స్‌!

RuPay cards: రూపే కార్డు హోల్డర్లకు ఎన్‌పీసీఐ మరో సదుపాయం తీసుకొచ్చింది. సీవీవీ లేకుండానే పేమెంట్స్‌ చేసే సౌలభ్యాన్ని ప్రారంభించింది.

Published : 16 May 2023 01:28 IST

దిల్లీ: రూపే (Rupay) క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు యూజర్లకు మరో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇకపై సీవీవీ (కార్డు వెరిఫికేషన్‌ వాల్యూ-CVV)తో పని లేకుండానే లావాదేవీలు చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ఓ ప్రకటనలో తెలిపింది. టోకనైజ్‌ చేసిన క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, ప్రీపెయిడ్‌ కార్డు హోల్డర్లు మర్చంట్‌ యాప్స్‌లో గానీ, వెబ్‌పేజీలో గానీ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. దీనివల్ల కొనుగోళ్ల సమయంలో కార్డు వివరాలు గుర్తుంచుకోవడం గానీ, వ్యాలెట్‌ను ఆశ్రయించాల్సిన అవసరం గానీ ఉండదని తెలిపింది.

సాధారణంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్‌/ వెబ్‌సైట్లు వాడుతూ ఉంటాం. వీటిలో లావాదేవీ పూర్తికి మన క్రెడిట్‌ కార్డు/ డెబిట్‌ కార్డు వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. కొత్తగా కొనుగోలు చేసే వారు కార్డుకు సంబంధించిన అన్ని వివరాలూ (కార్డు నంబర్‌, ఎక్స్‌పైరీ డేట్‌, సీవీవీ) ఇచ్చి, తర్వాత ఓటీపీ ఎంటర్‌ చేయడం ద్వారా లావాదేవీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ వివరాలు ఒకప్పుడు ఆయా సంస్థల వద్ద నిక్షిప్తమై ఉండేవి. ఏదైనా సైబర్‌ దాడి జరిగినప్పుడు ఈ వివరాలు బయటకు వచ్చే ప్రమాదం ఉండడంతో ఆర్‌బీఐ టోకనైజేషన్‌ను తీసుకొచ్చింది.

ఈ విధానం కింద ఒకసారి టోకనైజ్‌ చేస్తే కేవలం సీవీవీ, ఓటీపీ ఎంటర్‌ చేసి లావాదేవీని పూర్తి చేయొచ్చు. ఒకవేళ టోకనైజ్‌ చేసేందుకు సదరు సంస్థకు అనుమతి ఇవ్వకుంటే మీరు లావాదేవీ జరిపే ప్రతిసారీ కార్డు వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే టోకనైజ్‌ చేసిన వారు ప్రస్తుతం లావాదేవీ పూర్తి చేయడానికి సీవీవీ, ఓటీపీ వంటివి ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అదే రూపే కార్డు వినియోగదారులు మాత్రం సీవీవీ ఎంటర్‌ చేయాల్సిన పనిలేదని ఎన్‌సీపీఐ తెలిపింది. రూపే అనేది ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసిన దేశీయ కార్డు నెట్‌వర్క్‌. దీని వినియోగం పెంచేందుకు ఎన్‌పీసీఐ పలు చర్యలు చేపడుతోంది. రూపే క్రెడిట్‌ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయం తెచ్చిన ఎన్‌పీసీఐ.. తాజాగా సీవీవీ లేకుండా లావాదేవీలు చేసుకునే వెసులుబాటును తెచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని