Adani Hindenburg Row: అదానీ హిండెన్‌బర్గ్‌ వివాదంలో కొత్త మలుపు.. మధ్యలో కోటక్ బ్యాంకు ప్రస్తావన!

Eenadu icon
By Business News Team Updated : 20 Dec 2024 12:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

Adani Hindenburg Row | దిల్లీ: అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌, భారత వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌ల మధ్య వివాదం (Adani Hindenburg Row) మంగళవారం మరో కొత్త మలుపు తిరిగింది. భారత క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ (SEBI) నుంచి తమకు షోకాజ్ నోటీసులు అందినట్లు హిండెన్‌బర్గ్‌ వెల్లడించింది. అదానీ (Adani Group) స్టాక్స్‌పై పెట్టుబడుల్లో తాము నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అందులో పేర్కొన్నట్లు తెలిపింది. తాజా పరిణామాల్లో భాగంగా కోటక్ బ్యాంకును కూడా ఈ వ్యవహారంలోకి లాగడం గమనార్హం.

అర్థం లేని నోటీసులు..

సెబీ షోకాజ్‌ నోటీసులను హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ‘అర్థం లేనివి’గా కొట్టిపారేసింది. ఉద్దేశపూర్వకంగా జారీ చేసిందని ఆరోపించింది. ‘భారత్‌లోని శక్తిమంతమైన వ్యాపారవేత్తల లోపాలను ఎత్తిచూపే వారిని బెదిరించే చర్య’గా అభివర్ణించింది. అదానీ గ్రూప్‌ (Adani Group) అవకతవకలను బయటపెట్టిన సమయంలోనే తాము ఆయా కంపెనీల స్టాక్స్‌పై షార్ట్‌ చేసినట్లు స్పష్టంగా వెల్లడించామని పేర్కొంది. అంటే అదానీ షేర్ల పతనాన్ని ముందే అంచనా వేసి వాటిపై ట్రేడ్‌ చేసినట్లు బహిర్గతం చేశామంది.

కోటక్‌ బ్యాంకు ప్రస్తావన..

కోటక్‌ బ్యాంకు విదేశీగడ్డపై ఓ ఫండ్‌ను ఏర్పాటుచేసినట్లు హిండెన్‌బర్గ్‌ వెల్లడించింది. దాన్ని ఉపయోగించుకొని ఓ పెట్టుబడి భాగస్వామి ద్వారా అదానీ స్టాక్స్‌ను షార్ట్‌ చేసినట్లు ఆరోపించింది. దీనివల్ల కోటక్‌ బ్యాంకు పెద్దగా లాభాలు మాత్రం ఆర్జించలేకపోయిందని తెలిపింది. ఆ పెట్టుబడి భాగస్వామి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. సెబీ (SEBI) అందించిన షోకాజ్‌ నోటీసుల్లో ఎక్కడా కోటక్‌ పేరు గానీ, ఆ సంస్థ బోర్డు సభ్యుల ప్రస్తావన గానీ లేదని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది. దీన్నిబట్టి సెబీ మరో శక్తిమంతమైన భారత వ్యాపారవేత్తను రక్షించే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించింది.

ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్‌

మేం పొందిందేం లేదు..

మరోవైపు సదరు ఇన్వెస్టర్‌తో ఉన్న సంబంధాలతోనే తామూ అదానీ షేర్ల షార్టింగ్‌ చేశామని.. తద్వారా 4.1 మిలియన్‌ డాలర్ల స్థూల ఆదాయం పొందినట్లు తెలిపింది. అదానీ అమెరికా బాండ్ల షార్ట్‌ ద్వారా 31 వేల డాలర్లు లభించినట్లు వెల్లడించింది. ఖర్చులు, ఇతర వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే తమకు లభించింది ఏమీ లేదని తెలిపింది. పైగా తాము కేవలం ఒకేఒక్క పెట్టుబడి భాగస్వామితో కలిసి షార్టింగ్‌ చేశామని తెలిపింది. దీన్నిబట్టి లాభాల కోసం తాము వివిధ సంస్థలతో కలిసి కుమ్మక్కై అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకున్నామని వస్తున్న ఆరోపణల్లో పస లేదని పేర్కొంది.

ఇవీ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు..

అదానీ గ్రూప్‌ (Adani Group) తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన నివేదికలో హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలు పొందిందని ఆరోపించింది. అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు పేర్కొంది. పన్నుల విషయంలో స్నేహపూరితంగా ఉండే కరేబియన్‌, మారిషస్‌ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని తెలిపింది. వీటిద్వారానే అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్‌ అప్పట్లోనే తీవ్రంగా ఖండించింది. ఇన్వెస్టర్లు, రుణదాతల్లో విశ్వాసం నింపడం కోసం పలు చర్యలు చేపట్టింది. దీంతో భారీగా కుంగిన షేర్లు తిరిగి గాడినపడ్డాయి.

ఆరోపణలు అవాస్తవం: కోటక్‌

హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై కోటక్‌ బ్యాంక్‌ స్పందించింది. కోటక్‌ మహీంద్రా ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌కు గానీ, బ్యాంక్‌ ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్‌ కింగ్డన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌కు హిండన్‌బర్గ్‌ అసలే క్లయింటే కాదని పేర్కొంది. తమ ఫండ్‌లో ఇన్వెస్టర్‌ కూడా కాదని స్పష్టంచేసింది.

Tags :
Published : 02 Jul 2024 11:24 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు