Two wheeler insurance: బైక్‌ ఇన్సూరెన్స్‌.. ఇవన్నీ తెలుసుకున్నాకే..!

Two wheeler insurance: మీ టూవీలర్‌కు బీమా చేయించాలని చూస్తున్నారా? మంచి పాలసీ తెలుసుకోలేకపోతున్నారా? ఈ కింది విషయాలపై ఓ లుక్కేయండి.

Updated : 26 Feb 2024 12:09 IST

Two wheeler insurance | ఇంటర్నెట్‌డెస్క్‌: ద్విచక్ర వాహనం కొనుగోలు అనేది చాలా మందికి ఒక ఎమోషన్‌. ఎంతో ఇష్టపడి నచ్చిన బైక్‌ను ఇంటికి తెచ్చుకొంటాం. ఆ తర్వాత దాని భద్రతకు బీమా కొనుగోలు విషయంలో మాత్రం సందిగ్ధంలో పడతాం. అనేక రకాల బీమాలు మార్కెట్‌లో అందుబాటులో ఉండటంతో ఏది సరైందో అర్థం కాదు. మీరు కూడా ఇలాంటి స్థితిలోనే ఉన్నారా?

ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల బీమాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది థర్డ్‌ పార్టీ బీమా, రెండోది సమగ్ర బీమా.

* అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహనం, దాన్ని నడిపే వ్యక్తికి కాకుండా ఇతరులకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు పరిహారం ఇచ్చేదే థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌. శారీరక గాయాలు, మరణం, ఆస్తి నష్టం వంటివి దీనిలో కవరవుతాయి. సొంత వాహనానికి జరిగే నష్టం మాత్రం దీనిలోకి రాదు. చట్ట ప్రకారం అందరూ ఈ బీమాను తీసుకోవడం తప్పనిసరి.

* విస్తృత బీమా ప్రయోజనాలు కల్పించేది సమగ్ర ద్విచక్ర వాహన బీమా. ప్రమాదం, దొంగతనం, వరదలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్‌ పార్టీకి వాటిల్లిన నష్టాన్నీ ఇది భర్తీ చేస్తుంది.

ఇవి తెలుసుకున్నాకే..

  • కవరేజీ: బడ్జెట్‌, వినియోగం, బైక్‌ విలువ వంటి అంశాల ఆధారంగా కవరేజీని అంచనా వేయాలి. థర్డ్-పార్టీ చేయించినప్పటికీ.. సమగ్ర బీమా ఉండటమే అదనపు రక్షణ.
  • ఐడీవీ: వాహనం కోల్పోయినా లేదా దొంగతనానికి గురైనా అత్యధికంగా చెల్లించే పరిహారాన్నే ‘ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్‌ వ్యాల్యూ (IDV) అంటారు. మార్కెట్‌లో వాహన ప్రస్తుత ధరను ఇది తెలియజేస్తుంది.
  • యాడ్‌ ఆన్‌: ప్రామాణిక పాలసీకి మరికొన్ని అదనపు భద్రతను జోడించుకోవడం మంచిదే. జీరో తరుగు, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, ఇంజిన్‌ ప్రొటెక్షన్‌, వ్యక్తిగత ప్రమాదం వంటి ఆప్షన్లను ఎంచుకుంటే అదనపు భద్రత తోడైనట్లే. వీటితో ప్రీమియం పెరిగినా.. అత్యవసర సమయంలో విలువైన ప్రయోజనాలను అందిస్తాయి.
  • సీఆర్‌ఎస్‌: క్లెయిం సెటిల్మెంట్‌ రేషియో(CSR) అధికంగా ఉన్న బీమా సంస్థలను ఎంచుకుంటే పాలసీ క్లెయిం సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. పాలసీ నాణ్యతను అంచనా వేయడానికి సీఎస్ఆర్‌ నిష్పత్తి ఒక ప్రమాణం.
  • నగదురహిత సదుపాయం: ప్రమాదాలు జరిగినప్పుడు మరమ్మతులు చేయడానికి నగదు రహిత గ్యారేజీ నెట్‌వర్క్‌ సదుపాయాల్ని అందిస్తున్నాయో లేదో ముందే చూసుకోవాలి.

ఖర్చు తగ్గించుకోవడానికి..

సరిపోల్చండి: బీమా కవరేజీ ప్రయోజనాలు, ప్రీమియం, తగ్గింపులు ఇలా అన్ని విషయాలు తెలుసుకొని మీ అవసరాలకు అనుగుణంగా అత్యంత తక్కువ ధర ఉన్న పాలసీని ఎంచుకోండి. అందుకోసం ఆన్‌లైన్‌లో వివిధ సంస్థలు అందిస్తున్న వాటి వివరాలను సరిపోల్చుకోవడం ఉత్తమం.

నో-క్లెయిం బోనస్ (NCB): బీమా తీసుకున్న తర్వాత ఏడాదిలో ఒక్కసారి కూడా దాన్ని వినియోగించుకోకపోతే.. నో క్లెయిం బోనస్‌ పొందొచ్చు. దీంతో తర్వాతి ఏడాది ప్రీమియంలో రాయితీ లభిస్తుంది.

సకాలంలో చెల్లింపులు: గడువులోగా ప్రీమియం చెల్లించి బీమా పాలసీని పునరుద్ధరించుకోవాలి. లేదంటే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. పైగా నో క్లెయిం బోనస్‌ను కూడా పొందలేం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని