Credit Card Loan: క్రెడిట్‌ కార్డు రుణం ఎప్పుడు తీసుకోవడం మేలు?

అత్యవసర పరిస్థితిల్లో క్రెడిట్‌ కార్డు మెరుగైన ఆర్థిక రక్షణ ఇస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు క్రెడిట్‌ కార్డు ఉపయోగించి తాత్కాలికంగా ఆర్థిక రక్షణ పొందొచ్చో ఇక్కడ చూద్దాం.

Updated : 29 Apr 2024 17:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలామందికి తమ దైనందిన జీవితంలో ఖర్చులు చెప్పిరావు. అకస్మాత్తుగా అనేక ఖర్చులు ఏ సమయంలోనైనా వస్తుంటాయి. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో వారి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. ఖర్చులను తప్పించుకోలేనప్పుడు.. క్రెడిట్‌ కార్డులు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు నిత్యావసరంగా మారాయి. ఈ రోజుల్లో చెల్లింపులు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. వీటిపై అనేక సంస్థలు రుణం కూడా అందిస్తున్నాయి. ప్రతి కార్డుపై బిల్లు చెల్లించడానికి కొంత సమయం ఉంటుంది. ఈ లోపు బిల్లు చెల్లించలేకపోతే ఈ మొత్తాన్ని రుణంగా మార్చమని మీ క్రెడిట్ కార్డు సంస్థను కోరవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డు రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటే మేలు అనేది ఇక్కడ చూద్దాం.

ఆరోగ్య అత్యవసర పరిస్థితి

కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యాలు అకస్మాత్తుగా వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో వెంటనే చేరవలసి ఉంటుంది. ఇలాంటప్పుడు ఖర్చు అవసరాన్ని అంచనా వేయడం చాలా అవసరం. కొంత మందికి ఆరోగ్య బీమా ఉండకపోవచ్చు. ఉన్నా సరిపోకపోవచ్చు. ఇలాంటి సరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డుపై ఆధారపడడం తప్పదు. అయినా కూడా, మెడికల్‌ ఎమర్జెన్సీస్‌ విషయంలో ఆసుపత్రి బిల్లులు, మందుల కోసం క్రెడిట్‌ కార్డు ఉపయోగించడం అనివార్యం. 

ప్రయాణాలు

ఒక్కోసారి అత్యవసర ప్రయాణాలు అకస్మాత్తుగా వస్తుంటాయి. ముఖ్యంగా మనకు కావలసినవారు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం లేదా మరణించడం జరగొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ మొత్తం వెంటనే అక్కడకు చేరుకోవాలంటే విమాన ప్రయాణాలు లాంటివి తప్పనిసరి. కుటుంబమంతటికి రోడ్డు, రైలు ప్రయాణం అంటే పర్వాలేదు గానీ, విమాన ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. చేతిలో ప్రయాణానికి నగదు లేకపోయినా ఇటువంటి సందర్భాల్లో క్రెడిట్‌ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. 

వాహన రిపేర్లు

మీ వాహనం అకస్మాత్తుగా బ్రేక్‌డౌన్‌ అయ్యి, పెద్ద మరమ్మత్తులకు గురికావచ్చు. వాహనానికి మరమ్మత్తులు ఉన్నప్పుడు వెంటనే రిపేర్‌ చేయించకపోతే దానికి మరింత పెద్ద మరమ్మతులు, ఆపై ఖర్చులు పెరగొచ్చు. ఇలాంటి పరిస్థితిలో చేతిలో తగినంత నగదు లేకపోయినా సరే వాహనాన్ని రన్నింగ్‌ స్థితికి తీసుకురావడానికి క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఆ ఖర్చులను భర్తీ చేయొచ్చు. దీంతో వాహన స్థితిని సాధారణ స్థితికి తీసుకొని వచ్చి విలువైన వాహనాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి, కార్డుదారులు ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి వీటిని ఉపయోగించవచ్చు. 

ఇంటి పునరుద్ధరణ/మరమ్మతు

ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాల కారణంగా, అనుకోని సంఘటనల వల్ల ఇంటికి పెద్ద మరమ్మతులే అవసరం రావచ్చు. ఈ పనిని వెంటనే చేయించకపోతే ఇల్లు మరింత పాడవుతుంది. ఇంకా, ఇంటిని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో తక్కువ వడ్డీ రేట్లకు లభించే టాపప్‌ ఇంటి రుణానికి ప్రయత్నించవచ్చు. సాధ్యంకాని పరిస్థితిలో క్రెడిట్‌ కార్డు ద్వారా ఇంటి మరమ్మతు ఖర్చులను భర్తీ చేయొచ్చు.

ఉద్యోగం కోల్పోవడం

కొవిడ్‌ పరిణామం తర్వాత ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగ కోతలు ఎక్కువయ్యాయని అందరికి తెలిసిందే. ఉద్యోగం కోల్పోవడం తాత్కాలిక ఒత్తిడికి దారి తీయచ్చు.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎవరికైనా కనీసం 6 నెలలకు సరిపడా అత్యవసర నిధి ఉంటే ఎంతో ఉపయోగం. కానీ, తగిన ప్లానింగ్‌ లేని వారికి ఇది ఉండకపోవచ్చు. అలాంటి వారికి తక్కువ నెలల పాటు తమ కుటుంబ ఖర్చులకు క్రెడిట్‌ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఈ రుణం తీసుకునేవారు తగిన రీపేమెంట్‌ ప్లాన్‌ కలిగి ఉండాలి. ముందు జాగ్రత్తగా రుణం అతిగా తీసుకోపోవడమే ఉత్తమం.

విద్యా ఖర్చులు

ప్రతి సంవత్సరం జూన్‌ నెలలో విద్యా సంవత్సరం మొదలవుతుందని అందరికీ తెలిసిందే. ఈ నెలలో ప్రతి కుటుంబానికి విద్యా ఖర్చులు చాలా భారంగా ఉంటాయి. ఇద్దరు పిల్లలు ఉన్నవారికి పాఠశాల/కాలేజీలో టర్మ్‌ ఫీజులు, పుస్తకాల ఖర్చులు వేలల్లో/లక్షల్లో అవ్వచ్చు. ఒక్కోసారి పిల్లల ఉన్నత చదువు విషయమై ఏదైనా పెద్ద విశ్వవిద్యాలయంలో సీట్ రావచ్చు. ఇలాంటప్పుడు క్రెడిట్ కార్డు పరిమితిని వినియోగించుకుని ఆపై రుణంగా మార్చుకోవచ్చు. ఏ ఖర్చు అయినా తప్పించుకోవచ్చు. కానీ, పిల్లల విద్యా ఖర్చులను అసలు తప్పించలేం. ఇలాంటి పరిస్థితిలో తగిన నగదు చేతిలో లేనప్పుడు క్రెడిట్‌ కార్డు ఒక మంచి ఆప్షన్‌.

చివరిగా: క్రెడిట్‌ కార్డు కలిగి ఉండడం వల్ల ఆర్థికపరమైన క్లిష్ట పరిస్థితులను కొంతకాలం పాటు తట్టుకోవచ్చు. అలాగే, క్రెడిట్‌ కార్డు రుణంపై వడ్డీ రేట్లు కూడా అధికంగా ఉంటాయనేది గమనించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని