పరిహారం డబ్బుల కోసం ఘోరం

పెద్ద కుమార్తె విద్యుదాఘాతంతో మృతి చెందగా వచ్చిన పరిహారం డబ్బుల కోసం కన్నబిడ్డ, కట్టుకున్న భార్యను అంతమొందించబోయాడో ప్రబుద్ధుడు.. వరంగల్‌ జిల్లా సంగెం మండలం తిమ్మాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఆదివారం

Updated : 26 Sep 2022 05:48 IST

 కుమార్తెతో ఎలుకల మందు తాగించిన తండ్రి

సంగెం, న్యూస్‌టుడే: పెద్ద కుమార్తె విద్యుదాఘాతంతో మృతి చెందగా వచ్చిన పరిహారం డబ్బుల కోసం కన్నబిడ్డ, కట్టుకున్న భార్యను అంతమొందించబోయాడో ప్రబుద్ధుడు.. వరంగల్‌ జిల్లా సంగెం మండలం తిమ్మాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఆదివారం సంగెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై దేవేందర్‌ కథనం ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన అనూష-సంతోష్‌లకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఆరోతరగతి చదువుతున్న పెద్ద కుమార్తె రాజేశ్వరి(11) రెండు నెలల కిందట పాఠశాల వద్ద విద్యుదాఘాతంతో చనిపోయింది. విద్యుత్తుశాఖ బాధిత కుటుంబానికి రూ.4,50,000 నష్టపరిహారాన్ని భార్య అనూష పేరుమీద అందించింది. ఈ డబ్బులపై భర్త సంతోష్‌ కన్నేశాడు. 15 రోజుల నుంచి ఆ సొమ్ము కోసం గొడవ పడుతున్నాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో భార్యను, కుమార్తెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 22న కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి భార్యకు తాగించడానికి ప్రయత్నించగా ఆమె తాగలేదు. ఆరేళ్ల వయసున్న కుమార్తె అక్షయ తాగి కొద్దిసేపటికి అస్వస్థతకు గురైంది. దీంతో అనూష కుమార్తెను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించి గ్రామంలోని తన తండ్రి కంకణాల స్వామికి విషయం చెప్పింది. అక్కడికి వచ్చిన మామ స్వామిని సంతోష్‌ కర్రతో తలపై బాది గాయపరిచాడు. అనూష ఫిర్యాదు మేరకు సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దేవేందర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని