logo

కూటమి జోరుతో వైకాపా నేతల్లో భయం

వైకాపాకు వెన్నులో వణుకుపుట్టేలా తెదేపా కార్యకర్తలు పనిచేయాలని తెదేపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు కోరారు.

Published : 23 Apr 2024 02:43 IST

సీఎం రమేశ్‌ నామినేషన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాక!

మాట్లాడుతున్న ప్రగడ నాగేశ్వరరావు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: వైకాపాకు వెన్నులో వణుకుపుట్టేలా తెదేపా కార్యకర్తలు పనిచేయాలని తెదేపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు కోరారు. ఈనెల 24న అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ నామినేషన్‌ కార్యక్రమానికి తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులను తరలించడానికి అచ్యుతాపురంలో సోమవారం సాయంత్రం సమావేశం జరిగింది. సీఎం రమేశ్‌ నామినేషన్‌ కార్యక్రమం వైకాపా నాయకులు భయపడేటట్లు ఉండాలన్నారు. రాష్ట్రంలో కూటమి విజయం తథ్యమని తెలిసిపోవడంతో వైకాపా నాయకుల్లో భయం పట్టుకుందన్నారు. వారి భయాన్ని రెట్టింపు చేయడానికి నామినేషన్‌ కార్యక్రమం వేదిక కావాలన్నారు. సీఎం రమేశ్‌ నామినేషన్‌ కార్యక్రమానికి భాజపా  నేత, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరవుతున్నారన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి దూలి రంగనాయకులు, నాయకులు రాజు, నానాజీ, కొలుకులూరి విజయ్‌బాబు, డ్రీమ్స్‌ నాయుడు, భీమరశెట్టి శ్రీనివాసరావు, దాడి ములిసినాయుడు, ఆడారి మంజు, మేరుగు బాపునాయుడు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బుద్ధ నాగజగదీశ్వరరావు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బీసీలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బానిసల్లా చూస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగజగదీశ్వరరావు, జిల్లా భాజపా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, భాజాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈర్లె శ్రీరామ్మూర్తి అన్నారు. భాజపా ఎన్నికల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ పేరుకే జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప, పెత్తనం అంతా తనతో పాటు నలుగురి వద్ద ఉంచుకున్నారన్నారు. జిల్లాలో బీసీ నాయకుడు బూడి ముత్యాలనాయుడుకి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినా, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పదవికి అప్పగించినా సీఎం తన వద్దే అధికారాలు ఉంచుకున్నారని విమర్శించారు. రెండు రోజుల కిత్రం కశింకోట మండలం గొబ్బూరు వద్ద సిద్ధం సభలో బూడి ముత్యాలనాయుడికి మాట్లాడానికి మైకు ఇవ్వలేదంటే బీసీలపై ఉన్న ప్రేమ అర్థం అవుతుందన్నారు. భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌ను గెలిపించి అభివృద్ధికి ఓటర్లు సహకరించాలని కోరారు. దేశంలో మోదీ  ప్రధానమంత్రి, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.


బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనరుగా రామశాస్త్రి

కె.కోటపాడు, న్యూస్‌టుడే: తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి అనకాపల్లి జిల్లా కన్వీనర్‌గా కె.కోటపాడు మండలం మేడిచర్లకు చెందిన దుర్వాసుల రామశాస్త్రి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని