logo

వీరూ.. వీర విధేయులే!.. వైకాపా సైన్యంలా పలువురు అధికారులు

ఏఈఆర్వో.. ఆయన ఎన్నికల నియమావళి పాటించాలి. కానీ నకిలీ పట్టాలు పప్పుబెల్లాల్లా పంచుతుంటే.. మౌనంగా ఉన్నారు.

Updated : 05 Apr 2024 07:54 IST

 నిష్పక్షపాత ఎన్నికలు సాధ్యమేనా?
 సర్వత్రా ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు 

బందరు 

ఏఈఆర్వో.. ఆయన ఎన్నికల నియమావళి పాటించాలి. కానీ నకిలీ పట్టాలు పప్పుబెల్లాల్లా పంచుతుంటే.. మౌనంగా ఉన్నారు. స్వయంగా జేసీ గీతాంజలి శర్మ కార్యాలయానికి వచ్చి పరిశీలించే వరకు ఉన్నతాధికారులకు చెప్పలేదు. ఆయన ప్రస్తుతం బందరు తహసీల్దారు. ఇలాంటి వ్యక్తి ఎన్నికల వేళ నిష్పక్షపాతంగా ఉంటారని ఎలా నమ్మగలమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. యువనేతతో ఆయన సంబంధాలు సరేసరి..!

జగ్గయ్యపేట

అక్కడి మున్సిపల్‌ కమిషనరే.. ఏఈఆర్వో. కానీ.. కోడ్‌ వేళనే మున్సిపల్‌ కల్యాణమండపం వైకాపా నేతలకు ఉచితంగా కట్టబెట్టేశారని ఆర్వోకు ఫిర్యాదు అందింది. ఏడాదిన్నరగా కమిషనర్‌గా ఉన్న ఆయన వైకాపా నాయకులతో, ముఖ్య ప్రజాప్రతినిధితో సంబంధాలు నెరిపి వారికి అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనపైనా ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి.

విజయవాడ సెంట్రల్‌

వైకాపా అభ్యర్థి... మాజీ మంత్రి వెలంపల్లి.ఇక్కడ ఎన్నికల అధికారి కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌. వైకాపా కార్పొరేటర్లతో సమీక్ష పెడితే.. కమిషనర్‌ సభ్యుడిగా హాజరయ్యారు. వెలంపల్లి ఆదేశాలను శిరసావహించారనేది తెదేపా కార్పొరేటర్ల ఫిర్యాదు. ప్రతి భేటీలోనూ ఇదే తీరు. మేయరు భాగ్యలక్ష్మి గ్రీవెన్సులో ఫిర్యాదులు స్వీకరిస్తే.. కమిషనర్‌ ఒక ఉద్యోగిలా పక్కన ఉండేవారు. సెంట్రల్‌లో కోడ్‌కు ముందే వెలంపల్లి ఇష్టారీతిన తాయిలాలు పంచారు. వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి కుక్కర్లు, చీరలు, దుస్తులు పంచారు. పత్రికల్లో చిత్రాలు వచ్చినా కమిషనర్‌ కదల్లేదు. ఇప్పుడు ఆయన రిటర్నింగ్‌ అధికారి.
ఉమ్మడి కృష్ణాలో జిల్లాస్థాయి అధికారులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వైకాపా ప్రజాప్రతినిధులతో అంటకాగిన వీరు ఇప్పుడు ఎన్నికల నిర్వహణ విధుల్లో ఉన్నారు. ఇలాంటి వారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే నమ్మకం ఎలాగని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కృష్ణా కలెక్టర్‌ పి.రాజబాబు వ్యవహారం, కృష్ణా ఎస్పీగా పనిచేసిన జాషువా తీరు వెలుగు చూశాక అధికార గణంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేతల సిఫార్సులతో పోస్టులు తెచ్చుకున్న అధికారులు.. వారు చెప్పినట్లు తలాడిస్తున్నారనేది సుస్పష్టం.

నవ్విపోదురు గాక..

  •  తాడిగడప కమిషనర్‌ ప్రకాష్‌రావు వైకాపా నేతలతో అంటకాగారు. ఒక యూసీపై చర్యలు తీసుకోలేదనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయన బదిలీ అవగా ఆ స్థానంలో వచ్చిన వెంకటేశ్వరరావు మంత్రి జోగి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేశారు. చికెన్‌ భోజనాల బిల్లు మున్సిపాలిటీ నుంచి చెల్లించారు.
  • పెనమలూరు పరిధిలో ఎంపీడీవోలు సైతం పొదుపు మహిళలతో పెట్టిన ప్రచార కార్యక్రమాలకు అధికారికంగా సహకరించారు. వి మంత్రి జోగి సిఫార్సుతో గృహనిర్మాణ సంస్థ జిల్లా అధికారిని బలవంతంగా బదిలీ చేయించారు. ఆమె స్థానంలో మరో అధికారిణి నియమించారు. పోస్టు అనంతపురం. విధులు ఎన్టీఆర్‌ జిల్లా. ఇక పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వి గుడివాడ ఆర్డీవో.. రిటర్నింగ్‌ అధికారి హోదాలో ఉన్నారు. ఇంటి పట్టాలపై ఆ అధికారిణితో ఎమ్మెల్యే నాని ఫోన్‌ సంభాషణ వెలుగు చూసిన ఉదంతం కంటే ఉదాహరణలు ఏం కావాలని పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. వి ఇటీవల ఏఈఆర్వోలుగా ఉన్న వారిని జిల్లాలకు బదిలీ చేశారు. పక్క జిల్లాల నుంచి వచ్చిన తహసీల్దార్లు నేతలను పట్టుకుని సిఫార్సులతో మంచి మండలాలు దక్కించుకున్నారు. మట్టి, ఇసుక ఆదాయం సమకూరే మండలాలకు వచ్చారు. కృష్ణా నదిలో నేతలే ఇసుక తవ్వకాలు, మట్టి దందా చేస్తున్నా చూస్తూ కూర్చున్నారు.
  • జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న మరో నలుగురు అధికారులపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. కానూరు ఏడీఈ, డీసీవో ఉన్నారు.

గత ఎన్నికల ఉదంతం..

2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌లో గెలిచిన వైకాపా, ఓడిన తెదేపా అభ్యర్థి మధ్య తేడా 25 ఓట్లు. ఓట్ల లెక్కింపులో మతలబు విమర్శలు ఉన్నాయి. తెదేపా రీకౌంటింగ్‌ పట్టుబట్టినా.. నాటి కలెక్టర్‌ ఇంతియాజ్‌ అనుమతించలేదు. ఆయన ఇప్పుడు వైకాపా కర్నూలు అభ్యర్థి. ఈ చిదంబర రహస్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.

ఉమ్మడి కృష్ణాలో పలువురు..

కొందరు అధికారులు నేటికీ వైకాపా నేతలతో అంటకాగుతున్నారు. ‘మీకేం ఆందోళన వద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే.. మేం చూసుకుంటామని’ వైకాపా నేతలు అధికారులకు భరోసా ఇస్తున్నారు. కొందరు తప్పని పరిస్థితుల్లో.. మరికొందరు అభిమానంతో, ఇంకొందరు తమకు పోస్టు ఇప్పించారని నేతల కొమ్ముకాస్తున్నారు. ఇప్పటికే ఈసీ రాష్ట్రస్థాయిలో కొరడా ఝళిపించినా.. వీరు మాత్రం నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఏఈఆర్వోలు, స్క్వాడ్‌లు, ఇతర కమిటీలలో సభ్యులు, రూట్‌ అధికారులుగా ఉన్న వీరిలో ఎక్కువ మంది వైకాపా నేతలతో సత్సంబంధాలు ఉన్నవారే.

 ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని