logo

నాడు జోరుమీదొచ్చారు.. నేడు జారుకున్నారు

ఎన్నిక ప్రకటన ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు జోగి రమేష్‌ పోరంకి ద్వారకా రెసిడెన్సీలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు బుట్టదాఖలయ్యాయి. ఆన్‌లైన్‌లో నమోదు చేసి రశీదులు ఇచ్చినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు.

Published : 02 May 2024 04:45 IST

ప్రజాదర్బార్‌ వినతులు బుట్టదాఖలు
ఎన్నికల ముందు మభ్యపెట్టడానికే
స్వీకరించారంటూ అర్జీదారుల ఆగ్రహం

సమస్య తెలుసుకుంటున్న జోగి రమేష్‌


ఇచ్చిన హామీ..

‘మీకు ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి. రాతపూర్వకంగా అర్జీలు ఇవ్వండి. అధికారంలో ఉన్నది మన ప్రభుత్వమే. సంబంధిత అధికారులతో మాట్లాడి అన్నింటినీ పరిష్కరించే బాధ్యత నాది. అధైర్యపడాల్సిన అవసరం లేదు.’ నేను మీ వినతులు తెలుసువడానికి ఇక్కడికి వచ్చా.

మార్చి రెండో తేదీన ప్రజాదర్బార్‌లో మంత్రి జోగి రమేష్‌


వాస్తవ పరిస్థితి

ఎన్నిక ప్రకటన ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు జోగి రమేష్‌ పోరంకి ద్వారకా రెసిడెన్సీలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు బుట్టదాఖలయ్యాయి. ఆన్‌లైన్‌లో నమోదు చేసి రశీదులు ఇచ్చినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. అటువంటప్పుడు ఈ కార్యక్రమం ఎందుకని అర్జీదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ప్రజాదర్బార్‌ జరిగిన తేదీ 02-3-2024
వచ్చిన ప్రజలు : దాదాపు 600
స్వీకరించిన వినతులు   : 200

ఏయే శాఖల నుంచి

పురపాలక, రెవెన్యూ, ఆరోగ్య, విద్యుత్తు, పోలీసు, వ్యవసాయ, మత్య్స, గృహనిర్మాణ, ఇతర శాఖలు


వసతి దీవెన నిధులు ఎక్కడ?

  • విద్యా, వసతి దీవెన పథకాలు అందడం లేదని 30 మందికి పైగా ఫిర్యాదు చేశారు. కానీ వసతి దీవెన ఇంతవరకు ఎవ్వరికి ఖాతాలో జమకాలేదు. విద్యాదీవెన కొంత మందికే వచ్చింది. మిగిలినవారి సంగతేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
  • కాల్వ కట్టలపై నీటి సమస్య ఎక్కువగా ఉందని, తాగునీటికి ఇబ్బందిగా ఉందని కాల్వ కట్టల వాసులు ఫిర్యాదు చేశారు. వేసవి కావడంతో ఎక్కువ చోట్ల నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు.
  • కానూరు, తాడిగడప, పలు ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్యపై వినతులు వచ్చాయి. కానీ వాటి ఊసే పట్టించుకోలేదు.

రూ.6 వేలు చెత్త పన్నా?

నగరంలో కంటే పురపాలిక పరిధిలో వ్యాపార సముదాయాలపై ఎక్కువగా చెత్త పన్ను వేస్తున్నారని 10 మందికి పైగా ఫిర్యాదు చేశారు. విజయవాడ వంటి మహానగరంలో షాపునకు రూ.1000 పన్ను వేస్తుంటే ఇక్కడ రూ.6 వేలు వరకు వసూలు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి జోగి.. కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావును ఆదేశించి హడావుడి చేశారు. కానీ ఆ తరువాత దాని గురించి పట్టించుకోకపోవడంపై వ్యాపార వర్గాలు గుర్రుగా ఉన్నాయి.


అర్హులైనా పింఛన్లు ఇవ్వరేం?

అర్హులైనా కూడా తమ పింఛన్లు ఏడాది కిందట తొలగించారని, ఇది దారుణమని, వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ కొంతమంది వినతులు సమర్పించారు. వాటిపై విచారణ జరిపించి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.


ఎన్నికల కోడ్‌పై నెపం

ప్రజాదర్బార్‌ నిర్వహించిన 14 రోజుల తరువాత మార్చి 16న ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఈ లోగా కొన్ని వినతులైన పరిష్కరించే అవకాశం ఉన్నా అధికారులు కానీ, మంత్రి జోగి రమేష్‌ కానీ పట్టించుకోలేదని అర్జీదారులు వాపోతున్నారు. చిత్తశుద్ధి లేకపోవడం, ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టేందుకే ఆదరాబాదరాగా ఈ కార్యక్రమం నిర్వహించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇంటి స్థలాలు రాలేదని 30 మంది ఫిర్యాదు

ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతూ వచ్చిన జగనన్న ఇంటి స్థలాలకు అర్హులైన తాము దరఖాస్తు చేసినా ఇంతవరకు రాలేదని 30 మంది పైగా ఫిర్యాదు చేశారు. ఇందులో కొంతమంది అర్హులని ఆన్‌లైన్‌లో చూపిస్తున్నా వారికి వణుకూరు లేఔట్లలో ప్లాట్లు కేటాయించలేదు. జోగి రమేష్‌ గృహ నిర్మాణ మంత్రిగా ఉన్నారని, తక్షణమే అధికారులతో మాట్లాడి స్థలాలు ఇస్తారని పలువురు ఆశగా అర్జీలు ఇచ్చారు. కానీ ఇంతవరకు వాటికి అతీగతీ లేకుండాపోయింది.


ప్రవాహంలో ఇల్లు కొట్టుకుపోయింది
- చెన్నుజయరాజు, యనమలకుదురు

కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఐదేళ్ల కిందట ఇల్లు కొట్టుకుపోయింది. ఇంటి స్థలం గురించి ఎంతో ప్రయత్నించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇల్లు లేదు కానీ ఆన్‌లైన్‌ ఇంటి పన్ను కనపడుతోందని అధికారులు కొర్రీలు వేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి జోగి రమేష్‌ దృష్టికి తీసుకెళ్లా. కానీ ఫలితం శూన్యం.


పింఛను ఇస్తారనుకున్నా..
- రంజాన్‌బీ, పోరంకి

నాకు తెదేపా హయాంలో ఒంటరి మహిళ కోటాలో పింఛను వచ్చేది. రేషన్‌కార్డులో భర్త ఫొటో ఉందని వైకాపా ప్రభుత్వం గత ఏడాది పింఛను నిలిపివేసింది. కానీ నా భర్తను విడిచి 14 ఏళ్లుగా జీవిస్తున్నాను. గతంలో అర్హురాలైన నేను ఇప్పుడు ఎలా అనర్హురాలు అయ్యానో వివరించమని అధికారులను అడిగా. సమాధానం చెప్పలేదు. ఇంతవరకు న్యాయం జరగలేదు.

న్యూస్‌టుడే, కానూరు, పోరంకి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని