logo

సుద్దగా అన్నం.. అందుకే తినం

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.

Updated : 19 Apr 2024 05:42 IST

తోట్లవల్లూరులో సగం మందికే..
న్యూస్‌టుడే, కౌతవరం (గుడ్లవల్లేరు), తోట్లవల్లూరు, పమిడిముక్కల

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో పెట్టిందే మెనూ చందంగా తయారైంది. బడిలో మధ్యాహ్న భోజనం తింటే కడుపులో నొప్పి వస్తోందని..అందుకే ఇంటికి వెళ్లి భోజనాలు చేస్తున్నామని ఎక్కువ మంది విద్యార్థులు చెబుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా సరైన చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.

గుడ్లవల్లేరు మండలంలో 600 మంది తినడం లేదు

గుడ్లవల్లేరు మండలంలోని కౌతవరం జడ్పీ హైస్కూల్‌లో గురువారం పరిశీలించగా మొత్తం 348 మంది విద్యార్థులకు 146 మందే భోజనం చేశారు. మండలంలో మొత్తం 65 పాఠశాలల్లో 2,946 మంది విద్యార్థులుండగా వారిలో గురువారం 2,334 మంది భోజనం చేశారు. మిగిలినవారంతా ఇళ్లకు వెళ్లి తిన్నారు. ప్రధానంగా భోజనం రుచించకపోవడం, కొత్త బియ్యం కావడంతో అన్నం సుద్దగా ఉంటోందని అంటున్నారు. దీనిపై ఎంఈవో జగన్మోహన్‌రావు మాట్లాడుతూ ఎండలు, పరీక్షలు, ఒంటిపూట తరగతులతో ఇళ్లకు వెళ్లి తింటున్నారని తెలిపారు.


తోట్లవల్లూరులో సగం మందికే..

తోట్లవల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం  పులిహోర, పచ్చడి, గుడ్డు పెట్టారు. గురువారంతో పరీక్షలు ముగియడంతో ప్రతేక్యంగా కేసరి చేశారు. 309 మంది విద్యార్థులు హాజరవ్వగా 307 మంది భోంచేస్తున్నారని హెచ్‌ఎం ఫణీంద్రకుమార్‌ తెలిపారు. వారిని పరిశీలించగా 100 మంది వరకే ఉన్నారు. మిగిలిన వారు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. వాస్తవానికి సగం మందికి కూడా మెను తయారు చేయలేదు. వారిలో అత్యధిక మంది తినకపోవడంతో పచ్చడి, పులిహార, గుడ్లు మిగిలిపోయాయి. కొంతమంది విద్యార్థులు రాత పుస్తకాల్లో కాగితాల్ని చింపి వాటిలో కేసరి పెట్టించుకొని తిన్నారు. ప్లేట్లు అయితే కాడగాల్సి వస్తోందని..పేపర్స్‌లో తింటున్నారని ఉపాధ్యాయులు చెప్పడం గమనార్హం.


పమిడిముక్కలలో ఇలా..

  • పమిడిముక్కల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గురువారం 210 మంది హాజరుకాగా 204 మంది భోజనం చేస్తున్నారు. మిగిలినివారిలో కొందరు ఆరోగ్యరీత్యా వైద్యులు బయట భోజనం వద్దన్నారని.. తాము క్యారేజీ తెచ్చుకుంటున్నామన్నారు.
  • హనుమంతపురం పాఠశాలలో 89 మంది విద్యార్థులకు 81మంది హాజరయ్యారు. మెనూ ప్రకారం నిమ్మకాయ పులిహోర చేయాల్సి ఉండగా చింతపండుతో చేశారు. 80 మందికి సరిపడా పులిహోర, గుడ్లు, టమాటా చట్నీ సిద్ధం చేశామని వంట ఏజెన్సీవారు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ నిమ్మకాయలు దొరకనందున చింతపండుతో పులిహోర చేయించామన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని