logo

ఇన్నాళ్లూ.. కాలయాపన

పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు  ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది.

Published : 19 Apr 2024 04:46 IST

పేరుకే నందిగామ వంద పడకల ఆసుపత్రి
వసతుల్లేక అందని వైద్య సేవలు
నందిగామ, న్యూస్‌టుడే

పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు  ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. భవన నిర్మాణానికి నిధులు తీసుకురాలేకపోయారు. ఎన్నికల వేళ.. ఓటర్లను ఆకట్టుకునేందుకు శంకుస్థాపన అంటూ హడావుడి చేశారు. మాటలు చెప్పి... చేతలు మరిచిపోవడం సీఎం జగన్‌ నైజం.. అదే మాదిరిగా సోదరులు వ్యవహరించారని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

విజయవాడే దిక్కు

తొలుత 50 పడకలుగా ఉన్న వైద్యశాలను వంద పడకలు చేసిన ప్రభుత్వం ఆ మేరకు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందిని నియమించింది. టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది కొరత ఉంది. వైద్య పరికరాలు, శస్త్రచికిత్స గదులు, ఇతర వసతులు లేవు. అత్యవసర వైద్యానికి రోగులు విజయవాడ వెళ్లాల్సిందే. స్థానికంగా మెరుగైన  వైద్యం అందక... అంత దూరం వెళ్లి పేద, మధ్య తరగతి ప్రజలు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. స్థాయి మారినా.. వైద్యం ఆ మేరకు అందడం లేదని రోగులు పెదవి విరుస్తున్నారు.


కోడ్‌ వస్తోందని హడావుడిగా...

సుపత్రి స్థాయి పెంచుతూ ప్రభుత్వం గత ఏప్రిల్‌ 6న జీవో 46 జారీ చేసింది. అందుకు రూ. 38.48 కోట్లు మంజూరు చేసింది. ఆ మొత్తంలో క్యాపిటల్‌ కాస్ట్‌గా రూ.28.50 కోట్లు, రికరింగ్‌ కాస్ట్‌గా రూ.3.38 కోట్లు, ల్యాండ్‌ ఎక్విజేషన్‌కు రూ. 2.50 కోట్లు కేటాయిస్తున్నట్లు జీవోలో పేర్కొంది. అన్ని వసతులతో వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాంటే ప్రస్తుత భవనాలు సరిపోవు. అందుకు నందిగామ డీవీఆర్‌ కాలనీ వద్ద భవన నిర్మాణానికి ఐదు ఎకరాలను రైతుల వద్ద కొన్నారు. భూ సేకరణకు రూ.2.50 కోట్లు మంజూరు చేసినా నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఎన్నికల కోడ్‌ వస్తోందని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ గత నెల ఏడున భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు రైతులకు డబ్బులు చెల్లించలేదు. రిజిస్ట్రేషన్‌ చేయలేదు. శంకుస్థాపన చేసిన చోట ఒక్క ఇటుక కూడా పెట్టలేదు.


పరీక్షలకు బయటకే వెళ్లాల్సిందే...

రోజూ 250 ఓపీ ఉంటుంది. వారికి సాధారణ వైద్యం మాత్రమే అందిస్తున్నారు. స్కానింగ్‌, ఎక్స్‌రే యంత్రాలున్నా రోగులను బయటకే పంపిస్తున్నారు. రేడియాలజిస్ట్‌, సోనాలజిస్ట్‌లు లేరు. గర్భిణులకు స్కానింగ్‌ చేయాలంటే ప్రైవేటు ల్యాబ్‌ల్లో రూ. వెయ్యి వరకు తీసుకుంటున్నారు. ఎక్స్‌రే యంత్రం 100 కె.వి.ఉంది. కనీసం 300 కె.వి. యంత్రం ఉంటేనే పూర్తి స్థాయిలో ఎక్స్‌రేలు తీయడానికి వీలుంటుంది. కొన్ని పరీక్షలకు ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తోంది. ఇటీవల గుడిమెట్లకు చెందిన గర్భిణి వైద్యశాలకు రాగా.. ఉమ్మ నీరు తక్కువగా ఉందని అంబులెన్స్‌లో విజయవాడ పంపించారు.


ప్రసూతి శస్త్రచికిత్సలతో సరి..

కేవలం ప్రసవ సమయంలో అవసరమైతే గర్భిణులకు శస్త్రచికిత్స చేస్తున్నారు. అత్యవసరమైతే విజయవాడకే పంపిస్తున్నారు. వైద్యులున్నా వసతులు లేక చిన్నపాటి శస్త్రచికిత్సలకే పరిమితం అవుతున్నారు. ఆర్థోపెడిక్‌ వైద్యుడు ఉన్నప్పటికి శస్త్రచికిత్సలు చేసేందుకు సౌకర్యాలతో కూడిన థియేటర్‌ లేదు. చిన్న ఎముక విరిగినా విజయవాడ వెళ్లాల్సిందే. జాతీయ రహదారి ఉన్నందున రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి ఇక్కడికి తీసుకువస్తే సాధారణ చికిత్స చేసి విజయవాడ పంపిస్తున్నారు. సకాలంలో 108 అంబులెన్స్‌లు రాక, ప్రైవేట్‌ అంబులెన్స్‌లకు నగదు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. కొందరు స్థానిక ప్రైవేట్‌ వైద్యశాలకు వెళ్తున్నారు. ఖర్చు చేసినా సకాలంలో వైద్యం అందక క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని