logo

పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు

 అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు.

Published : 20 Apr 2024 05:46 IST

భారీగా విద్యుత్తు ఛార్జీల పెంపు 
 జగన్‌ పాలనలో కుదేలైన రంగం

న్యూస్‌టుడే-ఇంతేరు(కృత్తివెన్ను) : అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ పాలనలో ఆక్వారంగం కుదేలైంది. విద్యుత్తు ఛార్జీలు పెంచడమే ప్రధాన కారణం.  ఆదాయం పెంచుకునేందుకు ఏటా వారిపై భారం మోపుతుండడంతో సామాన్య,పెద్ద రైతులు సైతం సాగుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

గత తెదేపా ప్రభుత్వ హయాంలో యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే ఇచ్చి ఆక్వా రైతులను ప్రోత్సహించగా వైకాపా పాలకులు ట్రూఅప్‌ ఛార్జీలంటూ మోత మోగించడంతో భారం భరించలేక 50శాతం మంది రైతులు ఆక్వాసాగు వదిలేశారు. ప్రస్తుతం  యూనిట్‌ ధర రూ.5.50కు పెంచి రైతుల నడ్డివిరిచారు. తెదేపా హయాంలో ఆక్వారంగం అభివృద్ధి దిశగా అడుగులు వేయగా ఈ అయిదేళ్లలో పూర్తిగా వెనకపడింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాడు రూ. 10 వేలు విద్యుత్తు బిల్లులు చెల్లించిన రైతులకు నేడు రూ. 60 వేలకుపైగా బిల్లులు వస్తున్నాయి. అంతమొత్తం చెల్లించకలేక అల్లాడుతున్నారు.


నెలకు రూ.70 వేలకుపైగా బిల్లులు కట్టాం

నేను ఆరు ఎకరాలు వనామి రొయ్యలసాగు చేస్తున్నా.గతంలో నెలకు రూ.10వేల నుంచి రూ.12వేలు మాత్రమే విద్యుత్తు బిల్లులు వచ్చేవి. సరఫరా కూడా సక్రమంగా ఉండేది.దీంతో సాగుకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఒక పంటకు కనీసం రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు లాభాలు వచ్చేవి. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. నెలకు రూ.70వేల నుంచి రూ.90వేలు విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. మరోవైపు మేత, రొయ్యపిల్లల ధరలు సైతం అధికంగా ఉండడంతో వనామి సాగు కష్టంగా ఉంది. 

 తమ్ము ఆంజనేయులు, ఇంతేరు


లోవోల్టేజీతో అవస్థలు : తిరుమలశెట్టి అంజి

నేను అయిదెకరాల్లో వనామి సాగు చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఆక్వాసాగు చేపడుతున్నా.  అయిదేళ్ల కిందట వరకు లాభాలు పొందాను. వైకాపా ప్రభుత్వం విద్యుత్తు  ఛార్జీలు భారీగా పెంచింది. విద్యుత్తు సరఫరాలోనూ తరచూ అంతరాయం కలుగుతోంది. లోవోల్టేజీ సమస్య వల్ల మోటార్లు కాలిపోవడంతో అదనపు ఖర్చు అవుతోంది. జనరేటర్‌ వాడాల్సి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు