logo

తినలేకపోతున్నాం..!

జిల్లాలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినేందుకు పిల్లలు ఇష్టపడటం లేదు. సన్నాలకు బదులు వేరే బియ్యం సరఫరా అవుతున్నాయి. దీంతో అన్నం బాగా ముద్దవ్వటం, లావుగా ఉంటోంది. అది తింటే కడుపులో నొప్పి వస్తోందని కొందరు

Updated : 07 Dec 2021 06:20 IST

ఈనాడు-అమరావతి

సాంబారు

జిల్లాలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినేందుకు పిల్లలు ఇష్టపడటం లేదు. సన్నాలకు బదులు వేరే బియ్యం సరఫరా అవుతున్నాయి. దీంతో అన్నం బాగా ముద్దవ్వటం, లావుగా ఉంటోంది. అది తింటే కడుపులో నొప్పి వస్తోందని కొందరు విద్యార్థులు దాని జోలికే వెళ్లటం లేదు. గతంలో తెనాలిలో పాఠశాలల సందర్శనకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు అందరు వెళ్లినప్పుడు వారి దృష్టికి అన్నం బాగోటం లేదని లావుగా ఉంటోందనే ఫిర్యాదులు వెళ్లాయి. ఇటీవల జిల్లా పాలనాధికారి వివేక్‌ యాదవ్‌ కూడా ఎంతమంది పిల్లలు భోజనం చేస్తున్నారు, ఎంతమంది తినటం లేదు అందుకు కారణాలతో కూడిన వివరాలు అందజేయాలని జిల్లా మధ్యాహ్న భోజన పథకం అధికారులను ఆదేశించారు. 3530 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. అయితే తొలుత జగనన్న గోరుముద్ద పథకం వినూత్నంగా ఉండటంతో చాలామంది పిల్లలు అప్పట్లో తిన్నారు. నూరుశాతం పిల్లలు దీన్ని తినేలా చేయాలని, పోషకాహారలోపం లేకుండా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకు ఈ పథకానికి పెద్దఎత్తున వ్యయం చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఆశించిన రీతిలో పిల్లలు భోజనం చేయటం లేదని తెలుసుకుని యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

50 కేజీల సాధారణ బియ్యంలో పోర్టుఫైడ్‌ బియ్యం కిలో పరిమాణంలో కలుపుతారు. దీంతో ఆ అన్నం అంతా న్యూట్రీషన్‌ ఫుడ్‌గా మారిపోతుందని అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 3530 పాఠశాలల్లో 3,89,514 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో సగటున రోజుకు 2.30 లక్షలమంది హాజరవుతున్నారు. భోజనం చేసేవారి సంఖ్య సుమారు 1.85 లక్షల నుంచి 2 లక్షల లోపే ఉంటారని అధికారవర్గాల సమాచారం. పోర్టుఫైడ్‌ రైస్‌ నిమిషం లోపే మెత్తగా ఉడికిపోతుందని, కానీ పౌరసరఫరాల నుంచి వస్తున్న బియ్యం గంటకు పైగా ఉడుకుతాయని వంట ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల బియ్యంలో దుమ్ము, దువ్వ బాగా కలిసి ఉంటోందని వాటిని వేరు చేయటానికి చాలా సమయం పడుతోందని చెబుతున్నారు. కోడిగుడ్లు కూడా సన్నగా ఉండటంతో పాటు పాడైపోతున్న గుడ్ల శాతం ఎక్కువుగా ఉంటోంది. దీంతో చాలా మంది విద్యార్థులు వాటిని తినటం లేదు.

పాడైపోయిన గుడ్లు

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

ఇప్పటికే జిల్లాలో చాలా పాఠశాలల్లో పిల్లలు మధ్యాహ్న భోజనం తినటం లేదని, కడుపు నొప్పి సమస్యలతో బాధపడుతున్నారని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు తెలిపారు.

ముద్దయిన అన్నం


త్వరలోనే సన్న బియ్యం వస్తాయి

సమస్యలను ఇప్పటికే గుర్తించాం. జిల్లాలో దీనిపై కలెక్టర్‌ నివేదిక కోరారు. ఇటీవల శాఖ సంచాలకులు పెదకాకానికి రాగా ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అధికారులను సంప్రదించాం. ప్రస్తుతం ఉన్న నిల్వలు త్వరలోనే అయిపోతాయని, ఆ తర్వాత నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తామని హామీనిచ్చారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. కోడిగుడ్లు పాడవటానికి కారణాలు తెలుసుకుని గుత్తేదారుణ్ని అప్రమత్తం చేస్తాం.

-వి.శ్రీనివాసరావు, ఏడీ, మధ్యాహ్న భోజన పథకం, గుంటూరు


* నాలుగు రోజుల క్రితం పెదకాకాని జడ్పీ ఉన్నత పాఠశాలకు మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర సంచాలకులు దివాన్‌ మైదీన్‌ వచ్చారు. కొందరు విద్యార్థులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ఆయన్ని కలిసి అన్నం తినలేకపోతున్నట్లు ఫిర్యాదు చేశారు. కడుపులో నొప్పి వస్తోందని, బియ్యాన్ని మార్చాలని కోరారు.

మేడికొండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో అన్నం లావుగా ఉంటోందని చాలా మంది ఇళ్ల నుంచే అన్నం తెచ్చుకుంటున్నారు.

* పొన్నూరు నేతాజీనగర్‌ పాఠశాలలో కొందరు విద్యార్థులు గుడ్డు తినటం లేదు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని