logo

ధూప, దీప నైవేద్యం.. జగనాధీనం

దేవాలయాలపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తీసుకోవడమేకానీ.. ఇవ్వడం తెలియదన్నట్లుగా.. ఆలయాల నుంచి వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాలో జమ చేసుకున్నారుగాని.. తిరిగి పైసా విదిల్చ లేదు.

Updated : 23 Apr 2024 05:41 IST

నిధులు తీసుకోవడమేగానీ..ఇచ్చే ప్రసక్తే లేదు
ఆలయాల ప్రగతిని గాలికొదిలేసిన వైకాపా ప్రభుత్వం

అనంత సాంస్కృతికం, న్యూస్‌టుడే: దేవాలయాలపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తీసుకోవడమేకానీ.. ఇవ్వడం తెలియదన్నట్లుగా.. ఆలయాల నుంచి వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాలో జమ చేసుకున్నారుగాని.. తిరిగి పైసా విదిల్చ లేదు. అధికారం రాక ముందు మా మ్యానిఫెస్టో భగవద్గీత లాంటిందని.. దేవాలయాలకు కొత్త జవసత్వాలు, దేవుళ్లకు పూజలు చేస్తున్న అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపుతామంటూ ఊదరకొట్టిన ముఖ్యమంత్రి ఐదేళ్ల పాలనలో అసలు రూపం చూపించారు. వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తాజాగా దేవాలయాల పరిస్థితి ఎలా ఉందంటే ‘దేవుడే సంపాదించుకోవాలి.. దేవుడే ఖర్చు పెట్టుకోవాలి’ అనే పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న దేవాలయాలైతే ధూప, దీప, నైవేద్యాలకు భక్తులిచ్చే సొమ్ము మీదే ఆధారపడాల్సి వస్తోంది. దేవదాయశాఖ సర్వశ్రేయో నిధి (సీజీఎఫ్‌)కి ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల కావడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై భక్తుల్లో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

అనుయాయులకు అవకాశం ఇవ్వడంతో..

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల ఛైర్మన్లను మార్చారు. సొంత పార్టీకి చెందినవారికి ఛైర్మన్‌గా ఎంపిక చేసి పాలన సాగించారు. దీంతో గతంలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న దాతలు ముందుకు రావడం మానేశారు. కొత్తగా వచ్చిన దాతలు సైతం పూర్తిస్థాయిలో ఆలయ అభివృద్ధికి తోడ్పలేకపోయారు. ఫలితంగా ఆలయాల గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యారు.

భక్తులిచ్చే కానుకలతోనే మనుగడ

  • దేవాలయం : శ్రీలక్ష్మీ నరసింహస్వామి, పెన్నహోబిలం
  • ఏటా దర్శించుకునే భక్తుల సంఖ్య: దాదాపు 1.20 లక్షల మంది
  • గతేడాది ఆదాయం: రూ.కోటి
  • ప్రభుత్వం ఇచ్చిన నిధులు: ఏమీ ఇవ్వ లేదు

ఉరవకొండ: నిధుల కొరత కారణంగా అభివృద్ధి అంతంతగానే ఉంది. ఆలయానికి వచ్చే ఆదాయంతోనే అభివృద్ధి పనులతో పాటు, వేతనాలకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో అభివృద్ధి వేగంగా సాగడం లేదు. ఆలయ పరిసరాల్లో పచ్చదనం ఉన్నా, భక్తులు సేద తీరడానికి సరైన సదుపాయాలు కల్పించిన దాఖలాలు లేవు. తరచూ నీటి సమస్య నెలకొంటోంది. పైగా ఆలయ పరిసరాలను పర్యాటక ప్రదేశంగా మారుస్తామన్న హామీ ప్రతిపాదనలను దాటడం లేదు. ఈ ఆలయ పరిసరాల్లో ప్రధానంగా గదుల కొరత ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న గదులన్నీ దాతలు నిర్మించినవే. వారు ఆలయానికి వస్తే, వారికే ఆ గదులు ఇస్తారు. దీంతో వాటి సమస్య తీవ్రంగా ఉంది. బ్రహ్మోత్సవాలు, పండగల సమయాల్లో, శని, ఆది వారాల్లో ఆ సమస్య మరింత అధికంగా ఉంటుంది.

అంజన్న ఆలయం.. ప్రగతికి ఆమడదూరం

  • మురడి ఆంజనేయస్వామి
  • 5 లక్షలు
  • రూ.32 లక్షలు
  • ఏమీ ఇవ్వలేదు

డి.హీరేహాళ్‌: శ్రావణమాసం, కార్తికమాసం, ఉగాది పండగ పూట స్వామిని భక్తులు ఎక్కువ దర్శించుకుంటారు. భక్తులు కనీసం ఉండటానికి గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2009లో 20 అదనపు గదులు, కల్యాణ మండపం నిర్మాణానికి రూ.1.20 కోట్లు కేటాయించారు. దాదాపు 40 శాతం పనులు పూర్తి అయినప్పటికీ, గ్రామంలో వివిధ రాజకీయ పరిణామాల మధ్య కల్యాణ మండపాన్ని 15 ఏళ్లుగా అలాగే వదిలేశారు.

భక్తుల విడిదికి కష్టాలు

  • నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం
  • 2.50 లక్షలు
  • రూ. 13 కోట్లు
  • ఇవ్వలేదు

గుంతకల్లు: ఆలయానికి వచ్చే భక్తులు విడిది చేయడానికి అవసరమైనన్ని వసతి గదులు లేవు. కాలం చెల్లాయంటూ 25 గదులను కూలగొట్టారు. కానీ, తిరిగి నిర్మించలేదు. ఇక్కడ ఇప్పుడు 60 గదులున్నాయి. భక్తుల రద్దీకి తగ్గట్లు 150 గదుల అవసరముంది. ఆలయ పరిసరాల్లో భక్తులు కొద్దిసేపు సేదదీరడానికి సౌకర్యం లేదు. గతంలో ఏర్పాటు చేసిన రెండు పార్కుల్లో ఇప్పుడు మట్టి తప్ప ఇంకేమీలేదు. భక్తులు మట్టిలో కూర్చోవాల్సి వస్తోంది. స్నానాలు చేయడానికి పుష్కరిణి లేదు. దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయానికి భక్తులకు సౌకర్యాలు కలుగజేయడానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా ఆలయానికి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఇరుకైన క్యూలైన్లతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అవసరానికి మించి ఇక్కడ ఒప్పంద కార్మికులను నాయకుల ఒత్తిడి వల్ల నియమిస్తుండటంతో ఆలయ నిధులు వృథా అవుతున్నాయి.

రాజకీయ నాయకుల పెత్తనం

  • పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి
  • లక్షకు పైగా
  • రూ.90 లక్షలు
  • ఏమీ లేవు

ఆత్మకూరు: ఆలయ నిర్వహణ అధికారులు స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు ఇబ్బంది సిబ్బంది పడుతున్నారు. ప్రధాన ఆలయం కావడంతో మండల నాయకులతో పాటు, గ్రామ నాయకులు పెత్తనం సాగించాలని ప్రయత్నాలు చేస్తుంటారు. దేవదాయశాఖ నుంచి ఆలయంలోని దేవుళ్ల విగ్రహాలకు కనీసం పూలు, పండ్లు, అలంకరణ సామగ్రిని అందించడం లేదు. ఫలితంగా పూజారులు అలంకరణ చేసేందుకు ఇబ్బంది పడుతూ ఉన్నవాటితోనే సర్దుకుంటున్నారు. ఆలయంలో శుభ్రత పాటించేందుకు సరైన సిబ్బంది లేరు. వర్షాకాలంలో పలు ప్రాంతాలు ఎక్కువగా బురదమయంగా మారుతుంటాయి. నాలుగేళ్ల నుంచి ఆలయాన్ని పూర్తిస్థాయిలో శుభ్రం చేసి మొక్కలు నాటిన దాఖలాలు లేవు. ప్రధాన సమస్యగా మారిన మరుగుదొడ్ల నిర్మాణం వైకాపా హయాంలో పూర్తిగా కుంటుపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు