గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి

గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్‌ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది.

Updated : 04 May 2024 08:34 IST

విజయవాడ కోర్టులో వ్యాజ్యం దాఖలు
జగన్‌, సజ్జల తదితరులకు నోటీసులు

ఈనాడు, అమరావతి: గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్‌ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. విజయవాడకు చెందిన మట్టా అరుణ్‌బాబు దీనిని దాఖలు చేశారు. విచారణ జరిపిన ఐదో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు.. ప్రతివాదులుగా ఉన్న సీఎం జగన్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని, కొడాలి నానిలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 28వ తేదీకి వాయిదా వేసింది. 2019 ఎన్నికల సందర్భంగా కోడికత్తి కేసును జగన్‌ వాడుకుని భారీగా లబ్ధి పొందారని, ఈ ఎన్నికల్లోనూ తిరిగి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెదేపా, ఇతర పార్టీల నేతలకు ఈ ఘటనలో పాత్ర ఉందని వైకాపా నాయకులు విస్తృతంగా ఎన్నికల సభలు, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారనీ.. దీనిని అడ్డుకోవాలని కోరారు. తొలుత ఈ వ్యాజ్యాన్ని విజయవాడలోని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో దాఖలు చేశారు. విచారణకు అర్హత ఉందా? లేదా? అనే దానిపై వాదనల అనంతరం ఐదో అదనపు సివిల్‌ జడ్జి కం ఐదో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు విచారణ నిమిత్తం బదిలీ చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని