అక్కడ ఇళ్లు కొంటున్నారు

యూరోపియన్లు, రష్యన్లు, అమెరికన్లు ఇలా వివిధ దేశాలకు చెందిన వారు చాలా వరకు తమ దేశాల్లో మైనస్‌ డిగ్రీ వాతావరణం ఉన్నప్పుడు భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో సేద తీరేందుకు వస్తుంటారు.

Published : 04 May 2024 01:07 IST

బీచ్‌, పర్యాటక ప్రాంతాల్లో వేసవి, సెలవుల విడిదిగా రెండో నివాసం

కొవిడ్‌ అనంతరం ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. జీవితమంటే సంపాదించడమే కాదు.. సంతోషంగా గడపాలనే ఆలోచనలకు వచ్చారు. ఈ క్రమంలోనే ఉన్న ఊరిని, ప్రాంతాన్ని కాదని దూరంగా పచ్చని ప్రకృతిలో సేద తీరేందుకు ఆసక్తి చూపుతున్నారు.  అందుకే తమ రెండో ఇంటిని సముద్ర తీరం, కొండల, గుట్టల, అటవీ ప్రాంతాల్లో ఉండేలా కొనుగోలు చేయడమే కాకుండా అక్కడే కొన్నాళ్లు జీవించేందుకు సైతం ఇష్టపడుతున్నారు. ట్రెక్కింగ్‌, సాహసాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు, ప్రకృతిలో సేద తీరేందుకు ఇలా వివిధ రకాలుగా నగరం నుంచి ఏటా వేలాది మంది దూర ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. వీరిలో ఇప్పుడు చాలా మంది అలాంటి ప్రాంతాలకు వెళ్లడమే కాకుండా అక్కడే నెలలపాటు ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన కొందరు రియల్టర్లు సైతం తమ వెంచర్లను ఇప్పుడు సుదూర ప్రాంతాలకు, ప్రకృతి ఒడికి దగ్గరకు తీసుకెళ్తున్నారు.

న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: యూరోపియన్లు, రష్యన్లు, అమెరికన్లు ఇలా వివిధ దేశాలకు చెందిన వారు చాలా వరకు తమ దేశాల్లో మైనస్‌ డిగ్రీ వాతావరణం ఉన్నప్పుడు భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో సేద తీరేందుకు వస్తుంటారు. వీరు నెలల తరబడి ఇక్కడ గడుపుతుంటారు. పచ్చని ప్రకృతి ఉండే ప్రాంతాలతోపాటు సముద్ర తీర నగరాలకు ఎక్కువగా వెళ్తుంటారు. ఇటీవల ఆలయ ప్రాంతాల చుట్టుపక్కలకు సైతం వచ్చి సేదతీరుతున్నారు. మరికొందరు ఏకంగా ఇక్కడ నివాసాలను కొనుగోలు చేసుకొని ఇక్కడే నివసిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే చాలామంది గోవా, కసోల్‌, పుదిచ్చెరి, గోకర్ణం, హంపి, రుషికేష్‌, యానాం తదితర ప్రాంతాల్లో నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారు.  

టెకీల చూపు అటువైపే

వర్క్‌ ఫ్రం హోం చేసే టెకీలు చాలా మంది ఇప్పుడు సుదూర ప్రాంతాల్లో సొంతింటిని కొనుగోలు చేసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా తమ రెండో ఇంటిని పర్యాటకంగా పేరు గాంచిన ప్రాంతాలకు సమీపంలో ఉండేలా చూసుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా ఉంటున్నారు. తమ పని చేసుకోవడంతోపాటు వారాంతంలో చుట్టుపక్కల ఉండే బీచ్‌ ప్రాంతానికి, లేదా ఆలయాలకు వెళ్లి ఆనందంగా గడుపుతున్నారు. ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే బండ్ల మనోజ్‌రెడ్డి.. తన రెండో ఇంటిని గోకర్ణం ప్రాంతంలో కొనుగోలు చేశారు. ప్రకృతి పచ్చదనంతో నిండిన విల్లాను ఇటీవలే కొన్నట్లు తెలిపారు. ‘29 ఏళ్లకే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయ్యాను. అప్పట్లో నగర శివారులో విల్లా కొనుగోలు చేశాను. ఇప్పుడు అది నగరానికి దగ్గరగా మారింది. అందుకే ప్రశాంత వాతావరణం ఉండే గోకర్ణంలోనూ మరోటి కొన్నా’ అన్నారు. బడ్జెట్‌లో సైతం అందుబాటులో ఉండేలా ఇక్కడ విల్లాలు లభిస్తున్నాయన్నారు.

ఆర్గానిక్‌ జీవితం వైపు

వేసవి వస్తే చాలా మంది చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. ఇందులో భాగంగానే గోవా, ఊటీ వంటి చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. విదేశాల్లో నివసించే పిల్లల తల్లిదండ్రులు సైతం ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లి సేద తీరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ పిల్లలు విదేశాల నుంచి వస్తే.. తమ సొంతూరికి వెళ్తున్నారు. జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు తాను పచ్చని ప్రకృతి ఉండే ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేసినట్లు డాక్టర్‌ చిన్నంరెడ్డి తెలిపారు. తీరిక లేని జీవితంలో ప్రశాంతంగా గడిపేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఆర్గానిక్‌ పంటలు పండిస్తున్నారని, రోజూ ఇంటి ముందుకే తెచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. తాను కొనుగోలు చేసిన విల్లాకు వంద కి.మీ. పరిధిలో  పలు ఆలయాలు, బీచ్‌లు ఉన్నాయని..  ప్రకృతి ఒడిలో ఉన్నట్లుంటుందని తెలిపారు. ఇప్పుడు వివిధ రంగాల్లో స్థిరపడిన చాలా మంది మంగళూరు, గోవా, కూర్గ్‌ తదితర ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు సైతం కొనుగోలు చేస్తున్నారు.

ఉభయతారకంగా..

పర్యాటక ప్రాంతాల్లో కొందరు రియల్టర్లు ఇప్పుడు నివాస, వ్యాపారపరంగా ఉండేలా నిర్మాణాలను తీర్చిదిద్దుతున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే ఉండేందుకు, తాము లేని సమయంలో అద్దెకు ఇచ్చేందుకు అనువుగా సైతం వీటిని చేపడుతున్నారు. రిసార్ట్‌లను నిర్మించడంతోపాటు ఆయా నిర్మాణాల్లో కొంత భాగాన్ని చదరపు అడుగుల లెక్కన విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు అక్కడ నివసించని సమయంలో వాటిని అద్దెకు ఇచ్చి అందులో తగిన వాటాను వారికి చెల్లిస్తారు. ఇదే కాకుండా విల్లాలను సైతం నాలుగు భాగాలుగా చేసి తక్కువ బడ్జెట్‌లో కొనుగోలు చేసే వారికి విక్రయిస్తున్నారు. తాను నగరానికి దాదాపు 660 కి.మీల దూరంలో ఉన్న గోకర్ణంలో ఇలా ఒక వాటా కొనుగోలు చేశానని నగరానికి చెందిన సత్య తుమ్మల తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని