logo

మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..

ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్‌-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు..

Updated : 19 Apr 2024 05:49 IST

వెలుగులన్నీ పుంగనూరుకే
మిగిలిన నియోజకవర్గాలకు చీకట్లు
సబ్‌స్టేషన్ల ఏర్పాటులో అధికారుల అత్యుత్సాహం
నంబర్‌-2ను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు

అందరికీ నాణ్యమైన విద్యుత్తు అందిస్తాం. సాగుకు పగటిపూటే తొమ్మిది గంటలు సరఫరా చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.

ఇవీ సీఎం జగన్‌ ఆర్భాటపు ప్రకటనలు


వ్యవసాయానికి రెండు గంటల సరఫరా ఏకబిగిన కుదించేశారు. మిగిలిన ఏడు గంటలు కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

ఇదీ క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితి


ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్‌-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి నేరుగా విద్యుత్తుశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.. మంత్రి చేతిలో ఉన్న విద్యుత్తు శాఖకు సంబంధించిన ఉప కేంద్రాలు ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో ఏకంగా 36 మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసి దాదాపు అన్నీ ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.. ఒకే నియోజకవర్గానికి ఇన్ని ఉప కేంద్రాలు మంజూరు చేయడం విద్యుత్తు శాఖ చరిత్రలోనే లేదని.. ఆ శాఖ అధికారులే పేర్కొనడం గమనార్హం. ఎవరేం అనుకుంటే మనకేంటి.. భవిష్యత్తులో ఆయన ‘ఆశీస్సులు’ ఉంటేచాలు.. ‘ఎక్కడైనా’ మనుగడ కొనసాగించ వచ్చనే అత్యుత్సాహంతో ఉన్నతాధికారులు అడుగులేస్తుండటం విశేషం.

చిత్తూరు (మిట్టూరు): మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరుకే రెండేళ్లలో 36 ఉప కేంద్రాలు మంజూరు చేశారు. వీటన్నిటినీ దాదాపు ప్రారంభించినట్లు సమాచారం. కొత్తగా ఉప కేంద్రం ఏర్పాటు చేయాలంటే 300యాంప్స్‌ అవసరం. ఇక్క 50 యాంప్స్‌కే ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే నిబంధనలు పూర్తిగా విస్మరించారు. అవన్నీ తుంగలో తొక్కి ‘పెద్ద’ మంత్రి ఆశీస్సుల కోసం అడ్డగోలుగా వ్యవహరించారు.

..ఇలా పెద్దఎత్తున ఉపకేంద్రాల నిర్మాణం అదీనూ ఒక్క పుôగనూరులోనే ఏర్పాటు చేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. విద్యుత్తు శాఖ చర్రితలోనే ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదంటూ ఆ శాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం.

పోస్టులకు బేరం..

ఒక్కో ఉప కేంద్రం నిర్మాణానికి రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలకు ఏమాత్రం అవసరం లేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం గమనార్హం. తద్వారా వినియోగదారులపై ఆర్థిక భారాన్ని మోపారు. ఈ క్రమంలోనే ఒక్కో ఉప కేంద్రానికి నలుగురు చొప్పున షిప్ట్‌ ఆపరేటర్ల పోస్టులు విక్రయించి దర్జాగా సొమ్ము చేసుకున్నారనే బహిరంగ ఆరోపణలు ఉన్నాయి.

రైతుల ఇబ్బందులు..

తిరుపుతి సర్కిల్‌లోని పలు ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ సమస్యలతో రైతుల ఇబ్బందులు వర్ణణాతీతం. రెండేళ్లుగా వ్యవసాయ, గృహ, పరిశ్రమల సర్వీసులు పెరిగాయి. వాటికి అనుగుణంగా విద్యుత్తు లైన్ల ఏర్పాటు, నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు నూతన ఉప కేంద్రాల ఏర్పాటు చేయాలి. కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో చిత్తూరు రూరల్‌, అర్బన్‌, పీలేరు, పుత్తూరు, పలమనేరు డివిజన్లలోని పలు మండలాల్లో లో ఓల్టేజీ, సరఫరాలో తీవ్ర అంతరాయం, విద్యుత్తు లాస్‌(నష్టం) పెరుగుతోంది. తద్వారా వ్యవసాయ మోటారు, నియంత్రికలు కాలిపోవడంతో సంస్థ, రైతులు ఆర్థికంగా నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తోంది.

మిగిలినచోట్ల ప్రతిపాదనల్లోనే..

తిరుపతి, పుంగనూరు, తంబళ్లపల్లె మినహా మిగిలిన నియోజకవర్గాల్లో రెండు చొప్పున 22 ఉప కేంద్రాలు నిర్మించాలని తలచారు. వీటి నిర్మాణాలన్నీ ప్రతిపాదనల్లోనే ఉన్నాయి. వీటికి సంబంధించిన దస్త్రం అడుగు ముందుకు పడలేదు. నెలలు గడిచినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అసలు ఎప్పుడు నిర్మిస్తారో చెప్పేవారు లేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని