logo

ఆసుపత్రులకు జగన్‌ జబ్బు

కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా పేదలకు వైద్య సేవలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను రోగులకు అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేసి ఆ మేరకు సేవలు విస్తరిస్తామని సీఎం జగన్‌ ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీ ఇచ్చారు.

Updated : 23 Apr 2024 05:57 IST

నాడు-నేడు ద్వారా అసంపూర్తిగానే పనులు
పత్తాలేని పరికరాలు.. అవస్థల్లో రోగులు
న్యూస్‌టుడే, చిత్తూరు(వైద్యం), పుత్తూరు, పెనుమూరు

పుత్తూరు ఆస్పత్రికి రోగుల తాకిడి అధికం. రోజూ 500-600 మంది రోగులు వచ్చి చికిత్స పొందుతుంటారు. గత ఎన్నికల సందర్భంగా సీఎం జగన్‌ సైతం 100 పడకల స్థాయికి పెంచుతామని ఇచ్చన హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. దీంతో ఏవైనా అత్యవసర కేసులు వస్తే ప్రథమ చికిత్స నిర్వహించి తిరుపతికి రెఫర్‌ చేయాల్సిన పరిస్థితి. అనుభవజ్ఞలైన డాక్టర్లు ఉన్నా మౌలిక వసతులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెఫర్‌ చేస్తున్నారు.


పెనుమూరులో 50 పడకల ఆస్పత్రికి రెండేళ్ల క్రితం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి పెద్దిరెడ్డి భూమిపూజ చేశారు. రెండేళ్లవుతున్నా పునాదుల దశ దాటలేదు. ఉన్న పీహెచ్‌సీ భవనాల్లోనే సామాజిక ఆరోగ్య కేంద్రం నడుస్తోంది. వచ్చే రోగులకు సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కార్వేటినగరంలోనూ పీహెచ్‌సీని అప్‌గ్రేడ్‌ చేస్తూ 50 పడకల స్థాయికి పెంచారు. పనులు ప్రారంభించినా.. అసంపూర్తిగానే ఉన్నాయి.

కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా పేదలకు వైద్య సేవలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను రోగులకు అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేసి ఆ మేరకు సేవలు విస్తరిస్తామని సీఎం జగన్‌ ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీ ఇచ్చారు.. ఇప్పుడా హామీలు అటకెక్కాయి.. నాడు-నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో భవనాలు నిర్మించి,  మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అయినా నేడు వైద్య సేవలు అందడం లేదు. ఫలితంగా రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.

జిల్లాలో నాడు-నేడు ద్వారా పలమనేరు, కుప్పం, నగరి, పుంగనూరు ఏరియా ఆస్పత్రుల్లో పనులు చేపట్టారు. ఇప్పటికీ అవి పూర్తిస్థాయిలో జరగకపోవడం గమనార్హం. పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. బంగారుపాళ్యం ఆస్పత్రిలో నిర్మాణం పూర్తయినా ఇంకా ప్రారంభించలేదు. జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రులలో అక్కడక్కడా డాక్టర్ల కొరత వేధిస్తోంది. పుత్తూరు వైద్య విధాన పరిషత్తు ఆస్పత్రిలో చిన్న పిల్లలు వైద్యుడి పోస్టు ఖాళీగా ఉంది. పుంగనూరు ఏరియా ఆస్పత్రిలోనూ పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చిత్తూరు ప్రజలు ఏ పెద్ద సమస్య వచ్చినా సీఎంసీ ఆస్పత్రి లేదా ఇతర ఆస్పత్రులకు రోగులను తరలిస్తున్నారు.ఆస్పత్రి అభివృద్ధి కమిటీలకు ప్రభుత్వం రూ.9కోట్లు విడుదల చేసింది.  ఈ నిధులతో అత్యవసర మందుల కొనుగోలుకు చేసుకోవచ్చు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు స్థానిక ఎమ్మెల్యేలు ఛైర్మన్లుగా నియమిస్తూ వైకాపా ప్రభుత్వం  ఉత్తర్వులు విడుదల చేసింది. అత్యవసర మందులు కొనుగోలు చేయాలన్నా వారి అనుమతి తప్పనిసరి. కొనుగోలు చేశాక సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లు అప్‌లోడ్‌ చేస్తే నిధులు ఉన్నప్పుడు ఆ బిల్లులు క్లియర్‌ చేస్తున్నారు. ఆ బిల్లుల జాప్యంతో కొందరు డాక్టర్లు ముందుగానే ఖర్చు చేసి బిల్లులు వచ్చాక తీసుకున్న సంఘటనలు ఉన్నాయి.


అమలు కాని 143జీవో..

రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్‌సీకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జీవో నంబరు 143ని జారీ చేసింది. ఈ మేరకు పీహెచ్‌సీలో 14 మంది ఉండాలి. ఇద్దరు డాక్టర్లు, సీహెచ్‌వో, ఎంపీహెచ్‌వో, పీహెచ్‌ఎన్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌, ఫిమేల్‌ సూపర్‌వైజర్‌, హెడ్‌ నర్సు, ఎఫ్‌ఎన్‌వో, అటెండర్‌, స్టాఫ్‌ నర్సులు ముగ్గురు, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్టు పోస్టులు విధిగా ఉండాలి. అయితే ఎక్కడా ఆ మేరకు సిబ్బంది లేరు. దీంతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకు వస్తున్నారు.


పీహెచ్‌సీల్లో ప్రసవాల్లేవు..

న్ని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరగాలని ప్రభుత్వమే స్వయంగా ఆదేశాలు ఇచ్చినా.. జిల్లాలోని కొన్ని పీహెచ్‌సీల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. పుత్తూరు మండలంలోని గొల్లపలి, పరమేశ్వరమంగళం పీహెచ్‌సీల్లో అయితే ప్రసవాలు ఇప్పటివరకు జరగకపోవడం గమనార్హం. పీహెచ్‌సీలకు వచ్చే గర్భిణులను సమీప సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు రెఫర్‌ చేసి చేతులు దులుపుకోవడం గమనార్హం.


ప్రమాదం జరిగితే పరుగులే

జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో అంబులెన్స్‌లు లేవు. మూడు జాతీయ రహదారులున్నా ప్రమాద సమయంలో అత్యవసర సేవలు అందించే ట్రామా సెంటర్ల ఏర్పాటులోనూ నిర్లక్ష్యమే. ప్రథమ చికిత్స నిర్వహించి తిరుపతికి తరలిస్తుంటారు. అక్కడకు వెళ్లేలోగా పలువురు మృత్యువాత పడిన సంఘటనలున్నాయి.


మెరుగైన సేవలు అందడం లేదు

- శివ, గట్టు, పుత్తూరు మండలం

ప్రభుత్వం స్థానిక ఆస్పత్రులలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని గొప్పలు చెబుతోంది.స్థానిక ఆస్పత్రులకు వెళితే తిరుపతికి రెఫర్‌ చేస్తున్నారు. రోగులను రెఫర్‌ చేసిన సమయంలో పుత్తూరు ఆస్పత్రిలో అంబులెన్స్‌ ఉన్నా డ్రైవర్‌ లేకపోవడంతో అది నిరుపయోగంగా ఉంది. దీంతో 108 వచ్చే దాకా ఆగాల్సిందే. 108 అత్యవసర కేసుకు వెళితే ఇక ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని