logo

సూత్రదారితెన్నూ లేని దర్యాప్తు

తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఇంకా వైకాపా నేతలకు వంత పాడుతూనే ఉన్నారు.

Updated : 17 May 2024 06:25 IST

పులివర్తి నానిపై దాడి ఘటనలో తీవ్ర తాత్సారం
వైకాపాకు వంతపాడుతున్న పోలీసులు
ఎన్నికల సంఘం ఆక్షేపిస్తున్నా మారని తీరు

ఈనాడు-తిరుపతి: తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఇంకా వైకాపా నేతలకు వంత పాడుతూనే ఉన్నారు. అత్యంత కట్టుదిట్ట భద్రత ఉండాల్సిన స్ట్రాంగ్‌ రూమ్‌ల సమీపంలోనే వైకాపా నేతలు మారణాయుధాలతో దాడికి తెగబడ్డా అధికార పార్టీ నేతలపై మమకారం కురిపిస్తూనే ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని కుమారుడు మోహిత్‌రెడ్డిలు కుట్ర పన్ని అనుచరులతో తనపై దాడి చేయించినట్లు పులివర్తి నాని ఫిర్యాదులో స్పష్టం చేసినా ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయడం లేదు. వారి గురించి ఆలోచించడమే పాపమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ఘటన ఒక్కటే కాదు గతంలోనూ తెదేపాపై కేసులు బనాయించడంలో పోలీసులు అత్యుత్సాహం కనబరిచారు. అదే సమయంలో వైకాపా నేతలపై ఆధారాలున్నా సూత్రధారులను విస్మరించడమే తమ ఎజెండా అన్నట్లు దర్యాప్తును ముగిస్తున్నారు. గతంలో అనేక ఘటనలను పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతోంది.

సీసీ టీవీ ఫుటేజీ లేకుంటే అంతే..

నానిపై దాడి ఘటనను తీసుకుంటే ఎప్పటికైనా వైకాపా మూకలు తనపై దాడి చేపట్టవచ్చని ముందుగానే పసిగట్టి తన వాహనాలకు సీసీ కెమెరాలు అమర్చుకున్నారు. ఆ మూడో కన్నే నిందితులను పట్టించింది. అదీ లేకుంటే దర్యాప్తు పేరుతో పోలీసులు తాత్సారం చేసి కేసును నీరుగార్చేవారన్న ఆరోపణలున్నాయి. సీసీ టీవీలో భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డిలతోపాటు దాడికి పాల్పడిన అనేకమంది స్పష్టంగా కనిపించారు. దాడి ఘటనలతో పాటు నిందితులకు సంబంధించిన ఫొటోలు మీడియాలో రావడంతోపాటు అటు ఎన్నికల కమిషన్‌ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. హింసాత్మక ఘటనలు జరుగుతుంటే పోలీసులు ఎందుకు సక్రమంగా స్పందించట్లేదంటూ ప్రశ్నించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే వీరిని అరెస్టు చేసినట్లు సమాచారం.


విజయసాయిరెడ్డి చెప్పారని వదిలేసి..

పెళ్లకూరు పరిధిలో ఎన్‌డీసీసీబీ ఛైర్మన్‌ సత్యనారాయణరెడ్డి అదే పార్టీకి చెందిన వ్యక్తిని స్తంభానికి కట్టి కొట్టించినా పోలీసులు కనీసం స్పందించలేదు. వైకాపా నేత విజయసాయిరెడ్డి నుంచి ఫోన్‌ వచ్చిందని కేసు లేకుండా చేశారు. బాధితుడిని బలవంతంగా ఇంటికి పంపించేశారు. వైకాపా శ్రేణులకు కొందరు పోలీసు అధికారులు కొమ్ము కాస్తున్నారనడానికి అనేక ఘటనలున్నాయి.


మూడు రహదారులపై నిరసనలోనూ..

స్వీ విశ్వవిద్యాలయం పరిధిలో మూడు రహదారులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతలపై వైకాపా మూకలు దాడి చేసినా పోలీసులు నామమాత్రంగానే చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో తమకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని పేర్కొంటూ ఏకంగా పలు పార్టీల నేతలు, వ్యక్తుల ఫొటోలను పాడెపై పెట్టి వైకాపా నేతలు దహన సంస్కారాలు చేసినా పట్టించుకోలేదు. వైకాపా నేతలకు కాపలా కాసి మరీ పోలీసులు ఆ తతంగాన్ని పూర్తి చేయించడం గమనార్హం.


చెవిరెడ్డే అంగీకరించినా..

రేణిగుంట మండలం గాజులమండ్యం ప్రాంతంలోని ఓ గోదాములో వైకాపాకు చెందిన సామగ్రి పెద్ద ఎత్తున పట్టుబడింది. ఇందులో అనేక తాయిలాలు పట్టుబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ సామగ్రిని ఇక్కడి నుంచే సరఫరా చేసినట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వస్తువులు పట్టుకున్నందున నలుగురు  అనామకులపై పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. గోదామును లీజుకు తీసుకున్న, సామగ్రి తానే సరఫరా చేస్తున్నట్లు ప్రకటించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వదిలిపెట్టడంతో జిల్లా యంత్రాంగం, పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చింది.


తెదేపా వారైతే ఆధారాలు అనవసరం

  • తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెదేపాకు చెందిన కొందరు నేతలు సెప్టెంబరు 12న వికృతమాల వద్ద ధర్నా చేసి.. రాకపోకలను నిలిపి.. స్థానికులను దుర్భాషలాడారని ఆరుగురు తెదేపా కార్యకర్తలపై డిసెంబరు 29న ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆ రోజు తెదేపా నాయకులు అక్కడ ఆందోళన చేయకపోవడం గమనార్హం.
  • తిరుపతి నగరంలో తెదేపా నేతలు దిష్టిబొమ్మ దహనం చేయడంతో వారిపై ఏకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. మంత్రి రోజాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని  తిరుపతి ప్రెస్‌క్లబ్‌లోకి పోలీసులు ప్రవేశించి వారిని అరెస్టు చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని