logo

జగన్‌ సిద్ధం.. ప్రయాణాలు నిషిద్ధం

ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించినా ఒక్క బస్సు వస్తే ఒట్టు.. మరోవైపు సిద్ధం సభకు గ్రామాలకు పెద్దసంఖ్యలో బస్సులు కేటాయించినా కొన్ని ఖాళీగా.. మరికొన్ని ముగ్గురు, నలుగురు ప్రయాణికులతో వెళ్లాయి.

Published : 20 Apr 2024 02:54 IST

రాజమహేంద్రవరం ప్రధాన బస్టాండ్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు

న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్‌, కాకినాడ కలెక్టరేట్‌, మసీదుసెంటర్‌: ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించినా ఒక్క బస్సు వస్తే ఒట్టు.. మరోవైపు సిద్ధం సభకు గ్రామాలకు పెద్దసంఖ్యలో బస్సులు కేటాయించినా కొన్ని ఖాళీగా.. మరికొన్ని ముగ్గురు, నలుగురు ప్రయాణికులతో వెళ్లాయి. ఇదీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం పరిస్థితి. కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో సిద్ధం సభకు కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల పరిధి ఆయా డిపోల నుంచే మొత్తం 314 ఆర్టీసీ బస్సులను సభకు మళ్లించి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశారు.

సీఎం యాత్ర నేపథ్యంలో ఏడీబీ రహదారిలో బస్సులను నిలిపివేయటంతో కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్లేందుకు ప్రయాణికులు బస్టాండు వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య నడిచే నాన్‌స్టాప్‌ సర్వీసులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం సుమారు 2 గంటల వరకు లేకపోవడంతో లైన్‌లో నిల్చున్న ప్రయాణికులు అసహనానికి గురై ఆర్టీసీ అధికారులను నిలదీశారు. సీఎం సభ అయితే మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడం ఏంటని పలువురు ప్రశ్నించారు.

జనం లేకుండా బస్సులు

సిద్ధం సభకు జనాన్ని తరలించడం కోసం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలవ్యాప్తంగా అన్ని గ్రామాలకు సుమారు 30 వరకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం ఉదయం వచ్చాయి. పల్లం, చిర్రయానాం, బలుసుతిప్ప తదితర గ్రామాలకు బస్సులు రాగా సభకు తక్కువ మందే వెళ్లారు. కొన్ని బస్సులు ఖాళీగానే తిరిగివెళ్లగా.. మరికొన్ని బస్సుల్లో ముగ్గురు నలుగురు చొప్పున మాత్రమే ఉన్నారు.


తరలించడం అలవాటుగా మారింది..

అత్యవసరంగా రాజమహేంద్రవరం వెళ్లాల్సి ఉంది. గంటకుపైగా నిరీక్షిస్తున్నా ఒక్క బస్సు రాలేదు. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలకు ఆర్టీసీ బస్సులను తరలించడం పరిపాటిగా మారింది. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలి. లేదంటే భవిష్యత్తులో ప్రయాణికులకు మరిన్ని ఇక్కట్లు తప్పవు.

బాషా, ప్రయాణికుడు, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని