logo

ఇసుక తోడేళ్లు..

కట్టడాలకు వినియోగించే ఇసుక కోసం గుంతలు తీసి పచ్చటి బతుకులు కూల్చేశారు. యంత్రాలతో తవ్వకాలు వద్దన్నా వినరు. ప్రశాంత గోదారమ్మ గుండెల్లో  పొక్లెయినర్లతో తవ్వి ఇసుక తోడేస్తారు. ఎన్జీటీ హెచ్చరించినా పట్టదు.. కోర్టులు మొట్టికాయలు వేసినా లెక్కలేనితనం.

Updated : 02 May 2024 05:59 IST

అయిదేళ్లలో అందినకాడికి దోచిన అధికార పార్టీ నేతలు
ఈనాడు, రాజమహేంద్రవరం

కట్టడాలకు వినియోగించే ఇసుక కోసం గుంతలు తీసి పచ్చటి బతుకులు కూల్చేశారు. యంత్రాలతో తవ్వకాలు వద్దన్నా వినరు. ప్రశాంత గోదారమ్మ గుండెల్లో  పొక్లెయినర్లతో తవ్వి ఇసుక తోడేస్తారు. ఎన్జీటీ హెచ్చరించినా పట్టదు.. కోర్టులు మొట్టికాయలు వేసినా లెక్కలేనితనం. అధికార పార్టీ నాయకులే అంతా నడిపిస్తున్నా.. తవ్వకాలు అందరికీ కనిపిస్తున్నా అధికార యంత్రాంగం కళ్లకు కనబడదు. సామాన్యుడు పొరపాటున ప్రశ్నిస్తే.. ప్రైవేటు సైన్యం రెచ్చిపోతుంది. ఇదీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ అయిదేళ్లలో నడుస్తున్న దందా.

‘గోదావరి తీరం ఉన్న ఉమ్మడి  జిల్లాలో ఇసుకకు కొదవలేదు. ఇదే వైకాపాకు వరమైంది. ఎక్కడికక్కడ పాగా వేసి నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగిపోతున్నాయి. ఓపెన్‌ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు లేకున్నా అధికారం ఉందని అయిదేళ్లు రెచ్చిపోయారు. రాయలసీమకు చెందిన ఓ మంత్రి కనుసన్నల్లో ఈ దందా జరుగుతోంది. ప్రశ్నించిన న్యాయస్థానాలకు సైతం ఎక్కడా తవ్వకాలు జరగడం లేదని అధికారులు గంతలు కడుతున్నారు.

గామన్‌ వంతెన సమీపంలో యథేచ్ఛగా తవ్వకాలు


రోజుకు సుమారు రూ.17 కోట్ల వ్యాపారం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ఇసుక  ఓపెన్‌ రీచ్‌ల నుంచి రోజుకు సుమారు వెయ్యి లారీల్లో ఇసుక తరలుతుండగా.. రూ.17 కోట్ల మేర నగదు చేతులు మారుతున్నట్లు అంచనా. ప్రతి రీచ్‌ వద్ద ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాత్రయితే వారంతా చేతుల్లో కర్రలు పట్టుకుని కాపలా ఉంటారు. పగటిపూట రీచ్‌ల్లోకి వెళ్లి ఎవరైనా ఫొటోలు తీస్తే ఆ వ్యక్తుల వాహనాల నంబర్లు నమోదు చేసి ఆరా తీయిస్తారు.


ప్రాణాలు పోతున్నా పట్టదే

గోదావరిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన గుంతల్లో పడి ఈ అయిదేళ్లలో పది మంది మృత్యువాత పడ్డారు. అమలాపురం మండలం భట్నవిల్లికి చెందిన ముగ్గురు యువకులు ముమ్మిడివరం మండలం గేదల్లంకలోకి ఉత్తరవాహిని పుష్కరాల రేవు వద్ద స్నానానికి దిగి ఇసుక గుంతల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు.

  • కోనసీమ జిల్లా జొన్నాడ ఇసుక ర్యాంపు ప్రాంతంలో గత ఏడాది మే 21న కొందరు స్నేహితులు సరదాగా స్నానానికి వెళ్లారు. అక్కడ సుమారు 40 అడుగుల మేర ఉన్న భారీ గుంతలను అంచనా వేయలేక ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.  
  • కోరుకొండ మండలం దోసకాలయపల్లికి చెందిన ముగ్గురు విద్యార్థులు సెలవులు రావడంతో సరదాగా పట్టిసీమ వెళ్లారు. బేకరీ నిర్వాహకుడు ఓలేటి ఆనంద్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థి లుక్మాన్‌, ఐటీఐ విద్యార్థి పెద్దిరెడ్డి రామ్‌ప్రసాద్‌ గోదాట్లో స్నానానికి దిగి లోతు అంచనా వేయలేక ప్రాణాలు విడిచారు.
  • ఇవిగాక పగ్గాలు లేని పరుగులతో అయిదేళ్లలో ఇసుక లారీలు మరికొందరి ప్రాణాలు తీశాయి.

రావులపాలెం వద్ద తవ్వకాలు


  • సీతానగరం మండలం మునికూడలిలో మూడు నెలలుగా తవ్వకాలు జరుగుతుండగా, ముగ్గళ్లలో బాటలు వేసి మరీ తవ్వేశారు. మునికూడలి నుంచి రోజుకు సగటున 300 లారీల ఇసుక తరలుతోంది.

  • తాళ్లపూడి మండలంలోని బల్లిపాడులో  రేయింబవళ్లు ఇసుక అక్రమ తవ్వకాలు జరగుతున్నాయి. నదిలో బాటలు వేసి వందల  లారీల్లో తరలిస్తున్నారు. ప్రతిపక్షాల ఆందోళన , అధికారులు పర్యటనలకు వచ్చినప్పుడు మినహా నిరంతరం తవ్వకాలు జరుగుతున్నాయి.

  • కొవ్వూరు మండలం కుమారదేవంలో రెండు నెలలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గోదావరిలో బాటలు నిర్మించి నిత్యం సగటున 100 లారీల్లో ఇసుక తరలిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు.

  • కడియం మండలం బుర్రిలంకలో ఏడు నెలలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అడ్డగోలు తవ్వకాల వల్ల సమీపంలోని లంకల్లో సాగు చేస్తున్న  భూములు కోతకు గురవుతున్నాయని దళితులు ఆవేదన చెందుతున్నారు.

  • నిడదవోలు, పెరవలి మండలాల పరిధిలోని పందలపర్రు, పెండ్యాల ఇసుక రీచ్‌ల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. రెండుచోట్ల నుంచీ రోజుకు సుమారు 80 లారీల్లో తరలిస్తున్నారు.

  • బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో కొద్ది నెలలుగా రోజుకు సుమారు 200 లారీల్లో ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ఊబలంకలో గత ఏడాది నవంబరు నుంచి తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు 150 లారీల్లో ఇసుక తరలుతోంది.

  • ఆలమూరు మండలం జొన్నాడలో ఆరు నెలలుగా తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు 300 లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నిబంధనలకు నీళ్లు

  • నది ఉపరితలానికి మీటరకు మించి తవ్వకూడదన్న నిబంధన.ఉంది. భారీ యంత్రాలతో దాదాపు 8 మీటర్ల మేర తవ్వకాలు చేస్తున్నారు.
  • ఏటిగట్లపై భారీ వాహనాలు తిప్పకూడదన్నది స్పష్టం. గట్లను ధ్వంసం చేసి 35 నుంచి 45 టన్నుల వాహనాలు నడుపుతున్నారు.

గట్లు తొలిచేస్తే వరదల సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికుల ఆందోళన.


ఉమ్మడి జిల్లాలో

యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్న రీచ్‌లు 14
నిత్యం ఇసుక తవ్వకాలు(సుమారుగా) 25 వేల టన్నులు    
నిత్యం ఇసుక తరలిస్తున్న లారీలు(సుమారు) 1000
ఈ అయిదేళ్లలో పోయిన ప్రాణాలు10
తెదేపా హయాంలో రీచ్‌ నుంచి రాజమండ్రికి రవాణా ఛార్జీ(3 యూనిట్లకు) రూ.1,500  ప్రస్తుతం రూ.6,300

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని