logo

ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే

అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్‌ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్‌, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు.

Updated : 20 Apr 2024 05:13 IST

సమ్మె చేస్తుంటే బెదిరించి విరమింపజేశారు

సమగ్ర శిక్షా సిబ్బంది సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం

సమస్యలు పరిష్కరించాలని సీఎంకు పంపే పోస్టు కార్డులు చూపుతూ..

 కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్‌ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్‌, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. గడిచిన ఐదేళ్లలో సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఏ ఒక్క ఉద్యోగికి సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేయలేదు. దీంతో ఈ ఏడాది జనవరిలో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. 21 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవాలని విన్నవించారు. దానిని విరమింపజేసేందుకు ప్రభుత్వం అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చింది. చివరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగులతో చర్చించారు. అతి త్వరలోనే ఎంటీఎస్‌ అమలు చేస్తామని, సమ్మె కాలానికి జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. వీటి అమలుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఏ ఒక్కటీ అమలు చేయకుండా.. వైకాపా సర్కారు పెద్ద శిక్షే వేసిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

 దశాబ్దాలుగా అదే స్థాయిలో..

సమగ్ర శిక్షాలో జిల్లాలో ఎంఐఎస్‌ సమన్వయకర్తలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్స్‌, క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్స్‌, మెసెంజర్స్‌, ఐఈడీ సమన్వయకర్తలు.. ఇలా వివిధ రకాల పేర్లతో ఈ ప్రాజెక్టులో ఉద్యోగులు సుమారు వెయ్యి మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దాల కాలంగా వీరు ఇదే ప్రాజెక్టు కింద పని చేస్తున్నా వీరి జీవితాల్లో మాత్రం ఎటువంటి వృద్ధి కనిపించని పరిస్థితి. గత ఎన్నికల సమయంలో జగన్‌ ప్రతిపక్ష నేతగా సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న వారిని రెగ్యులర్‌ చేస్తామని, మినిమం టైం స్కేల్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ నమ్మకంతో నాలుగున్నరేళ్లుగా ఎదురుచూసినా సమగ్ర శిక్షా ప్రాజెక్టు ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఏటా ఈ ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులను తొలగించి.. తర్వాత రోజు మళ్లీ ప్రత్యేకంగా బాండ్‌ రాయించుకుని విధుల్లోకి తీసుకుంటారు. గతంలో నెల రోజుల పాటు తొలగించేవారు.. ప్రస్తుతం ఒక్కరోజు మాత్రమే తొలగిస్తున్నారు.


కమిటీ పేరుతో కాలయాపన

మినిమం టైం స్కేల్‌, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని జనవరిలో 21 రోజులు సమ్మె చేశాం. ప్రభుత్వం చర్చల పేరుతో పిలిచి ప్రత్యేకించి కమిటీని ఏర్పాటు చేసి త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. చర్చించి మూడు నెలలు గడిచినా నేటికీ కమిటీ నియమించలేదు. ఐదేళ్లుగా తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తారేమోనని ఎదురుచూస్తున్నా చివరకు నిరాశే మిగిలింది.

- అబ్దుల్‌ రహీం, ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి


  ఇస్తామని చెప్పి.. రూపాయి ఇవ్వలేదు

సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులంతా కలిసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేలా సమ్మె చేపట్టాం. అయితే స్పందించలేదు. చర్చల సమయంలో సమ్మె కాలానికి గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. అసలే తక్కువ వేతనాలు.. అందులోనూ ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఉంది.

- ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం నాయకులు


ఎంటీఎస్‌ అమలు చేయాలి

సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌(ఎంటీఎస్‌)ను అమలు చేయాలి. ఎన్నికల సమయంలో అమలు చేస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చాక కనీసం తమ పరిస్థితిని కన్నెత్తయినా చూడడం లేదు. కనీసం చర్చల్లో సూచించిన విధంగా సమయానికి కమిటీలను కూడా నియమించడం లేదు. ఏళ్లుగా ఇదే ఉద్యోగంలో ఉన్నా తాము ఉద్యోగులుగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది.

- గంగయ్య, ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సంఘం కోశాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు