అంతా.. ఆ ఏడు చేపలకే!

వడ్డించే వాడు జగన్‌ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్‌ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. 

Updated : 03 May 2024 06:17 IST

అస్మదీయ సంస్థలకు అందినంతా ఇచ్చేశారు
ఐదేళ్లలో కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ రూ. 2.63 లక్షల కోట్లు
వారు వదిలేస్తేనే ఇతర కంపెనీలకు దక్కేది
కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌కు జగన్‌ సర్కారు చెల్లుచీటీ
ఈనాడు, అమరావతి


వడ్డించే వాడు జగన్‌ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి.
తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్‌ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన...
తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు.
గత ఐదేళ్లలో తనకు నచ్చిన... తనవారు మెచ్చిన ఏడు కంపెనీలకు రూ.వేల కోట్ల ప్రాజెక్టులను కట్టబెట్టేశారు...
ఈ క్రమంలో సంప్రదాయ బిడ్డింగ్‌ విధానాలను తుంగలో తొక్కేశారు.


మేఘా.. షిర్డిసాయి.. ఇండోసోల్‌.. జిందాల్‌.. అరబిందో.. అదానీ.. గ్రీన్‌కో... ఇవన్నీ మా కంపెనీలు. వీటి విషయంలో నిబంధనలు పట్టించుకోం. ఆరోపణలు వినిపించుకోం. జగన్‌ సర్కారు అనుసరించిన విధానమిది. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే ఈ కంపెనీలకు రాష్ట్రంలో రూ.వేల కోట్లతో చేపట్టనున్న భారీ ప్రాజెక్టులను కట్టబెట్టింది. ఐదేళ్లలో అస్మదీయ కంపెనీల జాబితా పెరిగి, వాటితో జగన్‌ బంధం అన్నివిధాలుగా పెనవేసుకుంది. ఆ కంపెనీలు వదలిపెట్టిన చిన్నాచితకా పనులు మాత్రమే ఇతర కంపెనీలకు దక్కాలి... అనేంతగా పరిస్థితి తయారైంది. సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులను    కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానంలో కేటాయించాల్సి ఉండగా... జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. నామినేషన్‌ విధానంలో ‘నీకిది-నాకిది’ అంటూ అస్మదీయులకు అప్పగించింది. ఇలా ఐదేళ్లలో జగన్‌ అస్మదీయులకు కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ అక్షరాలా రూ.2,63,250.13 కోట్లు!


షిర్డిసాయి.. ఏమా ప్రేమ ?!

షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌.. సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న ప్రకారం సూట్‌కేస్‌ కంపెనీలను సృష్టించడంలో ఆరితేరిన జగన్‌ బాటలోనే ఈ సంస్థ నడిచింది. వై.ఎస్‌.ఆర్‌. జిల్లాకు చెందిన ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరాతోపాటు వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల బిగింపు... సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టుల (పీఎస్పీ)ను అప్పగించింది. ఆఖరుకు ఎలాంటి అనుభవం లేకున్నా ఫర్వాలేదంటూ విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టులనూ కట్టబెట్టింది. ఐదేళ్లలో రూ.17,866.03 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఆ సంస్థకు ఇచ్చేసింది.

దక్కిన ప్రాజెక్టులు

  • రాష్ట్రంలోనిని 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు రూ.6,888.03 కోట్ల వ్యయంతో స్మార్ట్‌ మీటర్ల బిగింపు.
  • దిగువ సీలేరు జల విద్యుత్తు ప్రాజెక్టులో ఒక్కొక్కటి 115 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి   సామర్థ్యంతో రూ.478 కోట్లతో రెండు అదనపు యూనిట్ల నిర్మాణం.
  • వై.ఎస్‌.ఆర్‌. జిల్లా సోమశిల దగ్గర 900 మెగావాట్లు, ఎర్రవరం దగ్గర 1,200 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టు(పీఎస్‌పీ)లను ప్రభుత్వం కట్టబెట్టింది. ప్రస్తుత లెక్కల ప్రకారం వీటి అంచనా వ్యయం రూ.8,855 కోట్లు.

జిందాల్‌... ఏమాయ చేసిందోగానీ..!

కడపలో స్టీలు ప్లాంటు నిర్మాణం ఒక మిస్టరీ. ఆ ప్రాజెక్టును జిందాల్‌ సంస్థ ఇప్పటికీ చేపట్టనే లేదు. కానీ, విలువైన పలు   ప్రాజెక్టులను మాత్రం దక్కించుకుంది. ఇనుప ఖనిజం గనుల నుంచి.. పోర్టులో బెర్తుల నిర్మాణం వరకు ఆ సంస్థకు జగన్‌ ప్రభుత్వం కట్టబెట్టింది. తక్కువ ధరకే వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు... మైనింగ్‌ లీజులు... పోర్టులో బెర్తులు.. విద్యుత్తు ప్రాజెక్టులను కేటాయించింది. ఐదేళ్లలో సుమారు రూ.42,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఇచ్చింది.

  • కడపలో స్టీలు ప్లాంటును రూ.8,800 కోట్ల పెట్టుబడితో నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుని శంకుస్థాపన చేసి ఏడాది దాటినా పనులు మొదలేకాలేదు.
  • తమ్మినపట్నం దగ్గర ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం 2021 జులైలో ఎకరా రూ. 6 లక్షల చొప్పున 860 ఎకరాల భూములు ఈ సంస్థకు అప్పగించారు. ఇదే ప్రాంతంలో సాగరమాల, భారతమాల ప్రాజెక్టు కోసం ఎకరా రూ.21.75 లక్షల చొప్పున పరిహారాన్ని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ చెల్లించింది. ఈ లెక్కన జిందాల్‌కు రూ.135.45 కోట్ల లబ్ధి జరిగింది.
  • ప్రకాశం జిల్లా టంగుటూరులో 1,300 హెక్టార్లలో ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌  లీజులతోపాటు ఓబుళాపురంలో మరో 1,300 హెక్టార్లలో ఇనుప ఖనిజం అన్వేషణకు అనుమతి లభించింది.  నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్‌ బెర్తుల నిర్మాణానికి అనుమతిచ్చారు. వై.ఎస్‌.ర్‌, అనంతపురం, నంద్యాల ప్రాంతాల్లో 2500 మెగావాట్ల సౌర విద్యుత్తు, 1021.60 మెగావాట్ల పవన విద్యుత్తు, 1500 మెగావాట్ల పీఎస్పీ ప్రాజెక్టులను జిందాల్‌కు కేటాయించారు.

‘జగనెరిగిన’ మేఘా బంధం!

సాగునీటి ప్రాజెక్టులు.. జల విద్యుత్తు ప్రాజెక్టులు.. తాగునీటి పథకాలు.. పోర్టులు.. రహదారులు.. ఎక్కడ చూసినా  ‘మేఘా’ పేరు వినిపిస్తుంది. ఈ కృత్రిమ ‘మేఘ’ం జగన్‌ సొంత ఖజానా పంట పండించింది. ‘సమ ప్రయోజనం’ సూత్రం అమలుకు పేటెంటు హక్కులు పొందిన జగన్‌.. ఐదేళ్ల వ్యవధిలో మేఘా ఇంజినీరింగ్‌  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌(ఎంఈఐఎల్‌)కు రూ.30,445 కోట్ల విలువైన ప్రాజెక్టులను కట్టబెట్టారు. ఉడతా భక్తిగా రూ.37 కోట్లను ఎన్నికల బాండ్ల రూపేణా సమర్పించుకుందా కంపెనీ.

అన్నీ అంకితం...

  • ఎన్నికలకు కొద్ది నెలల ముందు రూ.12,264.36 కోట్లతో ప్రతిపాదించిన ఎగువ సీలేరు పీఎస్‌పీ ప్రాజెక్టును ప్రతిపాదించింది. అందులో రూ.6,717 కోట్లతో చేపట్టే పనులకు గత ఏడాది జూన్‌లో జెన్‌కో టెండర్లు పిలిచి.. టెండరు ధరపై 9.87 శాతం అధిక మొత్తంతో   రూ.7,380 కోట్లకు బిడ్‌ వేసిన మేఘా సంస్థకు కట్టబెట్టింది. దీనివల్ల మేఘాకు రూ.663 కోట్ల అదనపు ప్రయోజనం దక్కనుంది.
  • రూ.3,670.67 కోట్లతో చేపట్టిన మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులు మేఘా దక్కించుకుంది.  
  • వైకాపా ‘రివర్స్‌’ పాలన ద్వారా పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌లో మిగిలిన రూ.1,771.44 కోట్ల పనులు, రూ.3,216.11 కోట్లతో చేపట్టిన 960 మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రం పనులు కలిపి రూ.4,359.11 కోట్లకు దక్కించుకుంది.
  • పోలవరం ప్రాజెక్టులో భాగంగా రూ.766.94 కోట్లతో ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకం పనులు, ప్రధాన డ్యామ్‌లో రూ.1,626.48 కోట్ల విలువైన పనులు సంస్థకు దక్కాయి. కొత్తగా      రూ.683 కోట్లతో కటాఫ్‌ డయాఫ్రం వాల్‌ నిర్మాణం కూడా మేఘానే చేపట్టనుంది.  
  • రూ.3,825 కోట్లతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులూ ఈ సంస్థకే అప్పజెప్పారు.
  • రూ.491.37 కోట్లతో వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ నిర్మాణం... నంద్యాల జిల్లా డోన్‌లో రూ.350 కోట్ల విలువైన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పనులు మేఘాకే అప్పగించారు.

సముద్ర తీరం.. అదానీ పరం!

అదానీ సంస్థకు జగన్‌ ప్రభుత్వం పోర్టుల నుంచి బొగ్గు సరఫరా కాంట్రాక్టుల వరకు..సెజ్‌ల నుంచి డేటా కేంద్రాల వరకు అన్నీ అప్పగించింది.  ఆ సంస్థ కోసం   పారిశ్రామిక పాలసీలోని భూముల కేటాయింపు నిబంధనలనే సవరించింది. మొత్తంమీద రూ.66,096.10 కోట్ల ప్రాజెక్టులు, కాంట్రాక్టులను ఆ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది.

  • విశాఖలో మధురవాడ, కాపులుప్పాడ దగ్గర కలిపి మొత్తం 300 మెగావాట్ల డేటా సెంటర్‌, ఇంటిగ్రేటెడ్‌ బిజినెస్‌ పార్కు ఏర్పాటుకు రూ.29,054 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టుల కోసం మధురవాడలో 130 ఎకరాలు, కాపులుప్పాడలో  60 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించింది.  
  • అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు 5,500 మెగావాట్ల పీఎస్‌పీ ప్రాజెక్టులు కట్టబెట్టింది. వాటి ద్వారా రూ.22,825 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.
  • రాష్ట్ర ప్రభుత్వానికి గంగవరం పోర్టులో ఉన్న    10.4% వాటాను రూ.645.10 కోట్లకు విక్రయించింది. కృష్ణపట్నం పోర్టులో 75% వాటా రూ.13,572 కోట్లకు అదానీ సంస్థకు బదిలీ చేయడానికి అనుమతించింది.
  • 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుకు పిలిచిన రూ.900 కోట్ల విలువైన టెండరును, మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి బొగ్గు రవాణా కాంట్రాక్టును దక్కించుకుంది.

ఇండోసోల్‌ ఉరుకులు... పరుగులు!

షిర్డిసాయి తరహాలో పుట్టిన మరో కంపెనీ ఇండోసోల్‌ సోలార్‌ ప్రై. లిమిటెడ్‌. ఆ సంస్థ పుట్టీ పుట్టగానే బుడిబుడి అడుగులు కాదు.... ఏకంగా  పరుగులే పెట్టింది.కంపెనీ అనుభవం.. ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా రూ.76,176 కోట్ల ప్రాజెక్టులను జగన్‌ సర్కారు ధారాదత్తం చేసింది.

  • ఇండోసోల్‌కు రూ.33,033 కోట్ల పెట్టుబడులతో.. 7,200 మెగావాట్ల పీఎస్పీ, సోలార్‌, విండ్‌ ప్రాజెక్టులను కొద్ది నెలల్లోనే జగన్‌ ప్రభుత్వం కేటాయించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ఒక రోజు ముందు సౌర విద్యుత్తు ప్రాజెక్టుల కోసం 17,633 ఎకరాల భూములను కేటాయించింది. ఆ సంస్థ కోసం అప్పటివరకు ఉన్న మెగావాట్‌కు 3 ఎకరాల పరిమితిని 6 ఎకరాలకు పెంచుతూ నిబంధనలను సవరించింది.
  • నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర పీవీ మాడ్యూల్స్‌ తయారీ పార్కు ఏర్పాటుకు గతంలో ప్రతిపాదించిన 5,148 ఎకరాల భూములకు అదనంగా మరో 3,200 ఎకరాలను వాస్తవ ధర ప్రకారం సేకరించడానికి అనుమతించింది. దీనికి ఆ సంస్థ పెట్టుబడి రూ.43,143 కోట్లు. ఈ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసినా... అన్ని విధాలా సహకరిస్తూ జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రూ.47,809 కోట్ల ప్రయోజనాన్ని కలిగించేలా ప్రత్యేక విద్యుత్‌ టారిఫ్‌ అమలుకు ఆదేశాలు జారీ చేసింది.

అరబిందోపై అలవిమాలిన ప్రేమ

  • అవుకు దగ్గర 800 మెగావాట్లు, శింగనమల దగ్గర 800 మెగావాట్ల పీఎస్‌పీ ప్రాజెక్టులను విజయసాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన అరబిందో సంస్థకు ప్రభుత్వం  కేటాయించింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.6,315 కోట్ల పెట్టుబడి అవుతుంది.  
  • రూ.3,736 కోట్లతో చేపట్టిన రామాయపట్నం పోర్టు మొదటి దశ నిర్మాణ పనులు ఈ సంస్థకే దక్కాయి.
  • వైద్యశాఖలో 108 అంబులెన్స్‌ల నిర్వహణకు ఏటా రూ.130 కోట్లు, 104 వాహనాల నిర్వహణకు రూ.120 కోట్లు, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల నిర్వహణకు ఏటా రూ.18 కోట్ల చొప్పున.. ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం రూ.1,340 కోట్లు చెల్లించింది.

గ్రీన్‌కోతో.. రాజకీయ బంధం

కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చలమలశెట్టి సునీల్‌ బంధువులకు చెందిన గ్రీన్‌కో సంస్థకు ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు 1,985 ఎకరాలను.. ఎకరా రూ.5 లక్షల చొప్పున ఔట్‌ రైట్‌ సేల్స్‌ (ఓఆర్‌ఎస్‌) విధానంలో కేటాయించింది.

ఆ సంస్థకు గత ప్రభుత్వం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1,680 మెగావాట్ల పీఎస్‌పీ, 2,300 మెగావాట్ల సోలార్‌, 250 మెగావాట్ల విండ్‌ ప్రాజెక్టులను కేటాయించింది. వాటికోసం 7,466 ఎకరాల భూములు కేటాయించింది. వాటి ద్వారా రూ.19,600 కోట్లు ఆ సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. ఆ ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగించడానికి జగన్‌ ప్రభుత్వం అనుమతించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని