logo

మేలు సంగతి తర్వాత.. ముందు నీళ్లివ్వండి

‘మేం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సకల సౌకర్యాలు కల్పించి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ ఇవీ  వైకాపా నేతలు సమయం చిక్కినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు.‘

Published : 23 Apr 2024 05:53 IST

తుళ్లూరు, మేడికొండూరు, ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే 

నెక్కల్లులో వీధి కుళాయి నుంచి బిందెలతో నీరు మోసుకు వెళుతున్న గ్రామస్తులు

‘మేం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సకల సౌకర్యాలు కల్పించి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ ఇవీ  వైకాపా నేతలు సమయం చిక్కినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు.‘

మీకు మేలు జరిగి ఉంటేనే ఓటు వేయండని వైకాపా అధినేత జగన్‌ ఊదరగొడుతున్నారు. కానీ తాడికొండ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా.. మేలు సంగతి దేవుడెరుగు ముందు తాగేందుకు నీళ్లు ఇవ్వండి’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వైకాపా ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గంలో తాగు నీటి వెతలు తప్పడం లేదు. చెరువులకు ఆలస్యంగా నీరు వదలడంలో మూడు నెలలుగా ఇంటింటికీ నీటి సరఫరా సక్రమంగా జరగలేదు. వీధి కుళాయిలు ద్వారా నీరు సరఫరా చేయలేని చోట్ల అధికారులు బోర్లు ద్వారా అందిస్తున్నా అవి నీరు సరిపోవడం లేదు. మేడికొండూరులో ప్రజలు డ్రమ్ములో నిల్వ చేసుకొని వాడుకుంటున్నారు. ఎలాంటి సౌకర్యం లేని వాళ్లు ఒక్కో ట్రాక్టర్‌ ట్యాంకర్‌ రూ.1200లు చొప్పున కొనుగోలు చేసుకుంటున్నారు.

చందాలు వేసుకొని బిల్లులు కడుతున్నాం

తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలోని మిక్చర్‌ కాలనీలో ప్రభుత్వం ఇంటింటికీ కుళాయిలు లేకపోవడంతో గత ప్రభుత్వంలో కాలనీలో బోర్లు వేసి మోటార్లు బిగించారు. అప్పటి నుంచి కాలనీ వాసులు చందాలు వేసుకొని విద్యుత్తు ఛార్జీలు కట్టి మోటారు ద్వారా వీధుల్లో కుళాయి ఏర్పాటు చేసుకున్నారు. విద్యుత్తు ఛార్జీలు చెల్లించడం లేదని కొద్ది రోజుల కిందట మోటారుకు ఉన్న మీటరు ఆ శాఖ అధికారులు తొలగించారు. కాలనీలో సుమారు 300 మంది జనాభా నివసిస్తున్నారు. అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే. పగలంతా కూలీ పనులకు వెళ్లి వచ్చి దూర ప్రాంతాల నుంచి బిందెలతో నీళ్లు మోసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తమ గోడు పట్టించుకోవడం లేదని ఏ మోహం పెట్టుకొని ఓట్లు అడగటానికి వస్తారో చూస్తామని హెచ్చరిస్తున్నారు.

పాడైన పైప్‌లైన్‌.. చెరువుకు చేరని నీరు

ఉప్పలపాడు (పెదనందిపాడు), న్యూస్‌టుడే: నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఉప్పలపాడు చెరువుకు కారసాల సమగ్ర తాగు నీటి పథకం నుంచి నీరు రావడం లేదు. నీటి ఇబ్బందులపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పథకం పైప్‌లైన్‌ ఉప్పలపాడు ఓగేరు వాగు సమీపంలో పాడైపోయింది. దీంతో గత రెండు రోజుల నుంచి చెరువుకు నీరు సరఫరా కావడం లేదు. చెరువుకు పది శాతం మాత్రమే నీరు వచ్చినట్లు పంచాయితీ అధికారులు తెలిపారు. పైప్‌లైన్‌ వెంటనే బాగు చేయించి చెరువును నింపేందుకు చర్యలు చేపడతామని గ్రామీణ నీటి సరఫరా విభాగ ఏఈ రాజేష్‌ తెలిపారు.


చేతి పంపు మరమ్మతుకు గురైంది

మిక్చర్‌ కాలనీలో నివాసం ఉంటున్న నాకు 70 ఏళ్లు. మా వీధిలో ఉన్న చేతి పంపు మరమ్మతుకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యుత్తు అధికారులు మీటరు తొలగించారు. తాగు నీటి కోసం దూర ప్రాంతానికి వెళ్లి నీరు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నా.

- సామ్రాజ్యం, గృహిణి, నెక్కల్లు గ్రామం.


ఇంటింటికి కుళాయిలు లేవు

తమ వద్ద పంచాయతీ అధికారులు బెదిరిస్తూ పన్నులు కట్టించుకుంటున్నారు. మేం ఉండే కాలనీకి ట్యాంకు నుంచి ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయలేదు.  

 పార్వతి, రైతుకూలీ, మిక్చర్‌ కాలనీ, నెక్కల్లు గ్రామం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు