logo

పని భారం పెంచేశారు.. పోస్టులు భర్తీ చేయరు..

జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం: ఇక్కడ ఐదు పోస్టులే ఉన్నాయి. అందులో ఒక సూపరింటెండెంట్, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, సబార్డినేట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌.

Published : 23 Apr 2024 06:07 IST

 ఒత్తిడితో ఉద్యోగులు సతమతం  

కలెక్టరేట్‌ (గుంటూరు), జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం: ఇక్కడ ఐదు పోస్టులే ఉన్నాయి. అందులో ఒక సూపరింటెండెంట్, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, సబార్డినేట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌. ఇందులో సూపరింటెండెంట్‌ సీఎంవోలో పని చేస్తున్నారు. మిగిలిన నలుగురితో కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. 2022లో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత సింహభాగం సిబ్బందిని పల్నాడు, బాపట్ల జిల్లాలకు కేటాయించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఆర్థిక అంశాలతో పాటు ఉద్యోగుల సర్వీస్‌ వివరాలు, పరిపాలన అంశాలకు సంబంధించి గుంటూరు జిల్లాకు చెందిన అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుంది. కొత్తగా ఉద్యోగ నియామకాలు ప్రభుత్వం చేయడం లేదు. డిప్యుటేషన్‌ విధానానికి అవకాశం లేదు. దీంతో ఉన్న కొద్దిమంది పైనే మోయలేని పనిభారం ఉంటుంది.

సాంఘిక సంక్షేమ శాఖ: జిల్లాల పునర్విభజన తర్వాత పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఉన్న సిబ్బందిలో ఎక్కువ మందిని సర్దుబాటు చేశారు. కానీ ఇప్పటికీ ఆ రెండు జిల్లాలకు సంబంధించిన వ్యవహారాలు గుంటూరు జిల్లా నుంచే చక్కబెట్టాల్సి వస్తుంది. అధికారికంగా పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన విధి, విధానాలు ఇక్కడ నుంచి సూచించాల్సిన పరిస్థితి.

జిల్లా పంచాయతీ కార్యాలయం: ఈ శాఖలో విభజన ముందు నుంచి కొన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. విభజన సమయంలో పల్నాడు, బాపట్ల జిల్లాలకు కొంతమందిని సర్దుబాటు చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారు కొద్ది మంది మాత్రమే. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలే కదా అనుకుంటే పొరపాటే. పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ ఇలా చాలా శాఖల్లో ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలు, ఆర్థిక అంశాలను ఉమ్మడి జిల్లా నుంచే కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది. రిటైర్‌ అయిన ఉద్యోగి స్థానంలో కొత్త వారిని నియమించుకునే పరిస్థితి లేక ఉన్నవారిపై పని ఒత్తిడి పెంచేశారు. దీనికి తోడు విశ్రాంత ఉద్యోగులతో పాటు సిబ్బంది హైకోర్టులో సర్వీస్‌కు సంబంధించి కేసులు వేస్తుండటంతో అఫిడవిట్ల దాఖలుకు, వాయిదాలకు హాజరయ్యేందుకు వెళ్లాల్సి వస్తుండటంతో సమయం పోతుంది.

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తాం. ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గిస్తాం.. అంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ చెప్పిన మాటలు నేటికీ నీటి మూటలుగానే మిగిలాయి. ఖాళీలు భర్తీ చేయకపోగా పని ఒత్తిడి పెంచేయడంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే ఠంచనుగా 5 గంటలకు ఇంటికి వచ్చేసారనేది ఒకప్పటి నానుడి. ప్రస్తుతం ఏ కోశాన అలాంటి పరిస్థితి కనిపించడం లేదు కదా. ఎవరూ ఆ విషయాన్ని చెప్పుకుంటున్న సందర్భాలు లేవు. ఉద్యోగ విరమణ చేసినవారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో పని ఒత్తిడి పెరిగిపోయింది.


ఆరోగ్య పరంగా ఇబ్బందులు

పని భారం, ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఒత్తిడితో ఉద్యోగులు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వయో పరిమితి పెంపుతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ఆయా శాఖల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో కొత్తవారిని నియమించుకోలేకపోతున్నారు. కనీసం డిప్యుటేషన్‌పై పని చేయించుకునేందుకు వీల్లేదు. దీంతో ఇద్దరు ముగ్గురు చేయాల్సిన పనులను కూడా ఒక్కరే నిర్వర్తిస్తున్న శాఖలు చాలానే ఉన్నాయి. 

ఓ ఉద్యోగ సంఘ నాయకుడు


విభజించినా ఇక్కడ నుంచే వ్యవహారాలు

జిల్లాల పునర్విభజన తర్వాత గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కువ మంది సిబ్బందిని పల్నాడు, బాపట్ల జిల్లాలకు సర్దుబాటు చేశారు. ఇక్కడున్న సిబ్బందికి ఒక్కొక్కరికి వారు చూసే విభాగాలకు అదనంగా విభాగాలు చేర్చారు. దీంతో ఒక ఉద్యోగి ఇద్దరు మనుషుల పనులు చేయాల్సి వస్తుంది. ప్రస్తుత సాంకేతిక విధానాలో టీసీ, వీసీలు అదనంగా తోడయ్యాయి. వారంలో రెండ్రోజులు వీటికే సరిపోతుంది. ఇంతటి తీవ్ర పని ఒత్తిడిని ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు.

 ఉద్యోగి


ఖాళీలు భర్తీ చేస్తే భారం తగ్గుతుంది

ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందితే ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందని.. ప్రభుత్వం 62 సంవత్సరాలకు వయో పరిమితి పెంచింది. దీంతో అప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయక పనిభారంతో పాటు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లు ఉంటుంది. ఉదయం 10 గంటలకు విధుల్లో చేరిన ఉద్యోగులు తిరిగి సాయంత్రం ఏ సమయానికి ఇంటికి వెళతారంటే సమయం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

 ఉద్యోగి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు