logo

జగనన్నా.. ఉపాధి ఏదన్నా..?

యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అంశాల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాటలకు, క్షేత్ర స్థాయిలో పని తీరుకు ఏ మాత్రం పొంతన లేదన్న విషయం పారిశ్రామిక శిక్షణ సంస (ఐటీఐ)ల పరిస్థితి చూస్తే అర్థమవుతోంది.

Published : 29 Apr 2024 06:15 IST

తెనాలి ఐటీఐలో మౌలిక సదుపాయాలు కరవు
సర్కారు చర్యలతో దగాపడ్డ యువత

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అంశాల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాటలకు, క్షేత్ర స్థాయిలో పని తీరుకు ఏ మాత్రం పొంతన లేదన్న విషయం పారిశ్రామిక శిక్షణ సంస (ఐటీఐ)ల పరిస్థితి చూస్తే అర్థమవుతోంది.  వైకాపా ప్రభుత్వం ఐటీఐల పని తీరు మదింపు, గతం కంటే మెరుగైన సేవలు ఎలా అందించాలన్న ఆలోచన చేయలేదు. గతం కంటే తీసికట్టుగా మారాయని అవగతమవుతోంది.

అసౌకర్యాల మధ్య విద్యార్థులకు శిక్షణ

తెనాలి ఐటీఐ (ప్రభుత్వ) ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే కీలకమైనది. 1962లో ఏర్పాటైనా ఈ ఐటీఐ వేలాది మందికి నైపుణ్యాభివృద్ధిని కలిగించి ఉపాధి లభించేలా చేసింది. అలాంటిది వైకాపా ప్రభుత్వంలో నామ్‌కే వాస్తే గా మారింది. ఇప్పుడు పది ట్రేడ్లు నడుస్తున్నాయి. వాటిల్లో 276 మంది శిక్షణ పొందుతున్నారు. గతంలో సీటు దొరకటమే గగనమైతే ఇప్పుడు పలుమార్లు నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ట్రేడ్లలో శిక్షణ ఇవ్వటానికి 22 మంది సాంకేతిక నిపుణులు అవసరం కాగా ప్రస్తుతం 9 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వారితోనే శిక్షణ మమ అనిపిస్తున్నారు. శిక్షణ సామగ్రి సైతం పూర్తి స్థాయిలో సకాలంలో అందటం లేదు. ఇరువురు కాపలాదారులకు గాను రెండేళ్లుగా ఎవరూ లేరు. అటెండర్లతోనే పని కానిస్తున్నారు. మొత్తం 57 మంది సిబ్బంది అవసరం కాగా 22 మంది పనిచేస్తున్నారు. 19.75 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఐటీఐలోని 5 ఎకరాలను కొంత కాలం కిందట కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి ఇచ్చారు. అది పోను మిగిలిన 14.75 ఎకరాల విలువైన సువిశాల స్థలాన్ని కాపాడుకునే పరిస్థితి లేదు. చుట్టూ ప్రహారీ లేదు. కనీసం మంచి గేట్లు లేవు. తుదకు అంతర్గత రోడ్లూ కానరావు. వాటిల్లోనూ దీపాల వెలుగు లేదు. ఈ తీరు వల్ల సాయంత్రమైతే చాలు ఆవరణ మందు బాబుల అడ్డాగా మారిపోయింది. ప్రశ్నించిన సిబ్బందిపై దాడులు సైతం జరిగాయి. విద్యార్థుల కోసం మరుగుదొడ్లు కూడా లేవు.

నిర్వహణ లోపం శాపంగా మారింది

ఐటీఐ అంటే గతంలో మంచి పేరు ఉండేది. శిక్షణ విభాగాలను ఆధునిక ఉద్యోగాల స్థాయికి పెంచకపోవడం, ఉన్న వాటి నిర్వహణ గత ఐదు ఐదేళ్లుగా సరిగ్గా లేక పోవటంతో యువతకు శాపంగా మారింది. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన, ప్రణాళిక వైకాపా ప్రభుత్వానికి లేదు. ఈ విషయంలో పూర్తిగా విఫలం అయింది.

పాలడుగు ప్రణీత్‌, యువజన సంఘ నాయకుడు, తెనాలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని