logo

మూడు మతాలకు ఒకే చోట మరుభూమి

మానవత్వం పరిమళించేలా...అన్ని మతాల సారం ఒక్కటే అని చాటిచెప్పేలా తొలిసారి మూడు మతాలకు ఒకే ప్రాంతంలో ఆధునిక వసతులతో నిర్మిస్తున్న శ్మశానవాటిక ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

Published : 17 Jul 2022 03:35 IST

ఆధునిక వసతులతో.. ఆరెకరాల్లో..
రూ.11.7కోట్ల వ్యయంతో సిద్ధమైన ముక్తిఘాట్‌


ఫతుల్లాగూడలోని శ్మశానవాటికలో చేపట్టిన నిర్మాణం

ఈనాడు, హైదరాబాద్‌: మానవత్వం పరిమళించేలా...అన్ని మతాల సారం ఒక్కటే అని చాటిచెప్పేలా తొలిసారి మూడు మతాలకు ఒకే ప్రాంతంలో ఆధునిక వసతులతో నిర్మిస్తున్న శ్మశానవాటిక ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.  హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని ఉప్పల్‌ మండలంలోని ఫతుల్లాగూడలో దీనిని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.11.77 కోట్లతో ఈ ముక్తి ఘాట్‌ను 6 ఎకరాల్లో తీర్చిదిద్దారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు సంబంధించి ఒకే ప్రాంతంలో వేర్వేరుగా రెండేసి ఎకరాల వంతున కేటాయించారు. త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

ఇవీ విశేషాలు.

* ముక్తి ఘాట్‌లో 20శాతం మాత్రమే నిర్మాణాలుంటాయి. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాల ప్రకారం పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చారు.

* వేర్వేరుగా హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల్లో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు. హిందూ సంప్రదాయంలో మృతదేహాల దహనానికి విద్యుత్తు వినియోగించనున్నారు.

* మృతుల అస్థికలు పుణ్య నదుల్లో కలిపే దాకా ఇక్కడే భద్రపర్చుకునే సౌకర్యం కల్పించారు. మృతదేహాలను తరలించడానికి ప్రత్యేక వాహనాలతో పాటు అంతిమ సంస్కారాల్లో జాప్యం జరిగితే అంతవరకు భద్రపరిచేందుకు ఆరు ఫ్రీజర్లు అందుబాటులోకి తేనున్నారు.

* వివిధ కారణాలతో అంత్యక్రియలకు రాలేని కుటుంబ సభ్యులు, బంధువులు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేలా వైఫైతో సౌకర్యం అందుబాటులోకి తేనున్నారు. సెల్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌లో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

* పూర్తిగా సౌర విద్యుత్తును వినియోగించనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ప్లాంటు ఏర్పాటు చేశారు. స్నానపు, విశ్రాంతి గదుల్లో నీరు పునర్వినియోగమయ్యేలా  మురుగు  శుద్ధి కేంద్రం నిర్మించనున్నారు. మానసిక ప్రశాంత కలిగేలా పచ్చిక బయళ్లు, పూల మొక్కలు.. ఇలా అన్ని వసతులను తీర్చిదిద్దనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని