logo

సత్తా చాటిన పేదింటి బిడ్డలు

జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది.

Updated : 25 Apr 2024 05:08 IST

సామాన్య కుటుంబం.. టాపర్‌తో ఆనందం

సైదాబాద్‌, న్యూస్‌టుడే: జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. కారు డ్రైవర్‌గా స్థిరపడిన కడెం లింగయ్య, సుధారాణి దంపతుల కుమార్తె శ్రావణి ఇంటర్మీడియట్‌లో అగ్రగామిగా నిలిచింది. మలక్‌పేట ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఆంగ్ల మాధ్యమం ద్వారా ఎంపీసీ చదివిన ఈమె 986 మార్కులు సాధించింది. మూసారాంబాగ్‌లోని వీరముష్ఠి బస్తీలో నివసిస్తూ.. మలక్‌పేట ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో చదువుతోంది. ఎంసెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంతో ముందుకు సాగుతానని శ్రావణి పేర్కొంది.

పరిస్థితులు అనుకూలించకున్నా..  

కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఒక దశలో చదువు మధ్యలోనే ఆపేద్దామని అనుకుంది. అనంతరం తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఎంపీసీలో 463 సాధించింది.. ఆమె నల్గొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన నర్సింహ, నాగమణి దంపతులు కుమార్తె గుర్రం సుష్మిత. 15 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు.  తీవ్ర అనారోగ్యం కారణంగా నర్సింహ ఎలాంటి పనులు చేయడం లేదు. నాగమణి మలక్‌పేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. రెండో కుమార్తె సుష్మిత మలక్‌పేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆంగ్ల మాధ్యమం ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతూ 463 మార్కులు సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని