logo

హోరెత్తించి.. దాఖలు చేసి

రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

Updated : 25 Apr 2024 04:59 IST

ప్యాట్నీ సెంటర్‌లో ప్రసంగిస్తున్న రేవంత్‌రెడ్డి, చిత్రంలో దానం, రోహిణ్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, అజారుద్దీన్‌, ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌, రెజిమెంటల్‌బజార్‌, బేగంబజార్‌, న్యూస్‌టుడే: రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నాంపల్లిలోని హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా భాజపా నేత మాధవీలత, మరో 15 మంది నామపత్రం సమర్పించినట్లు ఆర్వో అనుదీప్‌ దురిశెట్టి  తెలిపారు. ఇందులో భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ రెండోసెట్‌ నామినేషన్‌ సమర్పించారు. బల్దియా సికింద్రాబాద్‌ జోనల్‌ ఆఫీసులో సికింద్రాబాద్‌ ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మరో తొమ్మిది మంది నామినేషన్‌ దాఖలు చేసినట్లు ఆర్వో హేమంత్‌ పాటిల్‌ వెల్లడించారు. చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రెండోసెట్‌ నామినేషన్‌ వేశారని, మొత్తం 18 నామపత్రాలు దాఖలైనట్లు ఆర్వో కె.శశాంక వెల్లడించారు. ఇందులో సినీనటి దాసరి సాహితి స్వతంత్ర అభ్యర్థిగా సమర్పించారు. మల్కాజిగిరి స్థానానికి 38 నామపత్రాలు దాఖలైనట్లు ఆర్వో గౌతమ్‌ వివరించారు.

దానం నామినేషన్‌కు రేవంత్‌రెడ్డి

నామినేషన్‌ ర్యాలీకి తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు

ఈనాడు,హైదరాబాద్‌,రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ జెండాలు... కార్యకర్తల కేరింతలతో లష్కర్‌ ప్రాంతం కోలాహలంగా మారింది. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌  అభ్యర్థిగా దానం నాగేందర్‌ బుధవారం నామినేషన్‌ వేశారు. ఆయనకు మద్దతుగా వేలమంది కార్యకర్తలు రావడంతో ఎంజీరోడ్‌, సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌ సర్కిల్‌, రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాలు నినాదాలతో హోరెత్తాయి.

ప్రత్యేక పూజలు... హాజరైన సీఎం.. తొలుత సికింద్రాబాద్‌ మహాకాళి ఆలయంలో రేవంత్‌రెడ్డి, దానం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోనాలు, పోతరాజులు, డప్పుచప్పుళ్లతో ప్రచార రథంపై ఊరేగింపుగా ప్యాట్నీ సెంటర్‌ చౌరస్తాకు బయలుదేరారు. కొందరు కార్యకర్తలు సీఎం రేవంత్‌రెడ్డికి గద, వీణ బహూకరించారు.   స్తంభించిన ట్రాఫిక్‌..  మహాకాళి దేవాలయం నుంచి ప్యాట్నీ సెంటర్‌ వరకు కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించడంతో ప్యాట్నీ, ప్యారడైజ్‌, రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. సీఎం ప్రసంగిస్తున్నప్పుడు మూడు వైపులా వాహనాల రాకపోకలు నిలిపేయడంతో రైల్వేస్టేషన్‌కు రాకపోకలు సాగించేవారు, ఉప్పల్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, బేగంపేట ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చిపోయే వారు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో పోలీసులు అతికష్టమ్మీద వాటిని ఆసుపత్రులకు పంపించారు.

హైదరాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ లక్డీకాపూల్‌లోని కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. గౌలిగూడ నుంచి మోజాంజాహి మార్కెట్‌, నాంపల్లి మీదుగా ర్యాలీగా చేరుకున్నారు.

హైదరాబాద్‌ పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలత శ్రేణులతో ర్యాలీగా వెళ్లి ఆర్వో అనుదీప్‌ దురిశెట్టికి నామినేషన్‌ సమర్పించారు. అంతకుముందు చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని