logo

బరిలో ఇద్దరు వారసులు

స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల వారసులు బరిలో నిలుస్తుంటారు.

Published : 29 Apr 2024 02:21 IST

వంశీకృష్ణ , రాజేందర్‌రావు

స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల వారసులు బరిలో నిలుస్తుంటారు. ఇందులో కొందరు ప్రజాదరణ పొందుతుండగా మరికొందరు వెనుకబడిపోతున్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో కోరుట్లలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనయుడు డాక్టర్‌ సంజయ్‌ పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టారు. తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి కొన్ని విడతలుగా శాసనసభ్యులుగా ఎన్నికవుతున్న కేటీఆర్‌, శ్రీధర్‌బాబులు మరోసారి విజయం సాధించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు వారసులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెద్దపల్లిలో మాజీ ఎంపీ, ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తనయుడు వంశీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ రాజేందర్‌రావు హస్తం పార్టీ నుంచే బరిలో దిగారు. ఈ ఇద్దరి భవిష్యత్తు జూన్‌ 4న వెల్లడవుతుంది.

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం


ఎల్లారెడ్డి చేతిలో పీవీ ఓటమి

1952లో దేశంలో మొదటిసారి లోక్‌సభ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థిగా బద్దం ఎల్లారెడ్డి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పీవీ నరసింహారావుపై ఆయన విజయం సాధించారు. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో 1906లో జన్మించిన ఎల్లారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన కీలక భూమిక పోషించారు.

న్యూస్‌టుడే, మానకొండూర్‌


ప్రజాస్వామ్యానికి జీవనాడి

ఓటుహక్కు కలిగిన వారందరూ తప్పకుండా ఓటు వేయాలంటూ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఎన్నికల సమయంలో విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ‘ఓటు వేయకుంటే బతికి ఉన్నా చనిపోయినట్టే’ అని నిరక్షరాస్యులు సైతం భావిస్తారు. ఇక నెటిజన్లు మాత్రం ప్రాణుల మనుగడకు ఆక్సిజన్‌ ఎలాగో ప్రజాస్వామ్య మనుగడకు ఓటు కూడా అంతేనంటూ ప్రాధాన్యం చాటుతున్నారు. ఇందుకు సూచికగా ‘ఓటు = ్న2 ’తో పోస్టరును సామాజిక మాధ్యమాల్లో పంపుతున్నారు. ఇది చూసిన పలువురు ‘ఇది నిజమే కదా మరి’ అంటూ పంచుతున్నారు.

న్యూస్‌టుడే, ఫెర్టిలైజర్‌ సిటీ


బాలలకు భవితోపదేశం

ఎన్నికల నిర్వహణ తీరుపై విద్యార్థి దశలోనే పూర్తి స్థాయి అవగాహన ఉంటే.. ఓటరుగా మారాక సమర్థవంతమైన పాలకులను ఎన్నుకొనే అవకాశం ఉంటుంది. ఇదే ఉద్దేశంతో పదో తరగతి సాంఘికశాస్త్రంలో ప్రచురించిన ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశం భావిపౌరులకు ఎన్నో కొత్త విషయాలు నేర్పిస్తోంది. రాజ్యాంగ నిర్మాణం, ఎన్నికల నిర్వహణ తీరుపై పిల్లలకు అవగాహన కలిగించడంతో పాటు తమ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలింగ్‌లో పాల్గొనేలా వారి నుంచి హామీ పత్రాలు తీసుకోవడం బాధ్యత పెంచుతోంది. ఎన్నికల సంఘం బాధ్యతలు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నియామకం, పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను పాఠ్యాంశాల్లో సమగ్రంగా చర్చించారు. విద్యార్థులకే కాకుండా ఎన్నికలకు సంబంధించిన అంశాలు తెలుసుకోవాలనుకునే వారికి ఈ పాఠ్యాంశం ఉపయుక్తంగా ఉంటుంది.

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు