logo

ఉద్యమనేత శ్రీరామరెడ్డి కన్నుమూత

చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే: కమ్యూనిస్టు నేత, ప్రజా సంఘర్ష సమితి చిక్కబళ్లాపుర జిల్లాశాఖ సంచాలకుడు, మాజీ శాసనసభ్యుడు జి.వి.శ్రీరామరెడ్డి (73) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో తమ నివాసం నుంచి వెంటనే బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు. చికిత్స

Published : 16 Apr 2022 01:55 IST



జి.వి.శ్రీరామరెడ్డి (పాతచిత్రం)

 

బెంగళూరు(ఎలక్ట్రానిక్‌ సిటీ), చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే: కమ్యూనిస్టు నేత, ప్రజా సంఘర్ష సమితి చిక్కబళ్లాపుర జిల్లాశాఖ సంచాలకుడు, మాజీ శాసనసభ్యుడు జి.వి.శ్రీరామరెడ్డి (73) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో తమ నివాసం నుంచి వెంటనే బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక 7.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలి కాలంలో రాజకీయాలకు దాదాపు దూరమయ్యారు. ఆయన అవివాహితుడు. తమ జీవిత కాలాన్ని పార్టీ కోసమే వినియోగించారు. తమ పదవీ కాలంలో నిత్యం రైతుల సమస్యల పరిష్కారానికే కృషి చేశారు. అనేక సామాజిక పోరాటాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సీపీఎంకు బాగేపల్లి నియోజకవర్గంలో మంచి పట్టుండేది. ఇందుకు శ్రీరామరెడ్డి వ్యక్తిత్వమే కారణమని భావిస్తారు. ఆయన ఏకంగా ఎనిమిదిసార్లు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండుసార్లు విధానసభకు ఎన్నికయ్యారు. బాగేపల్లి అనగానే జి.వి.శ్రీరామరెడ్డి అనే పేరు ప్రముఖంగా వచ్చేదంటే ఆయన ఏస్థాయిలో ప్రాచుర్యాన్ని సొంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్ఛు చివరి రోజుల్లో పార్టీకి దూరంగా కొనసాగి ప్రజా సంఘర్ష సమితిని ఏర్పాటు చేసుకుని తమ సామాజిక పోరాటాన్ని కొనసాగించారు. అనేక ఆరోపణలు రావడంతో ఆయన పార్టీకి దూరం కావడానికి కారణంగా చెబుతారు. నియోజకవర్గానికి చెందిన అపార సంఖ్యలో అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ప్రముఖుల సంతాపం

బెంగళూరు(యశ్వంతపుర): గొప్ప సామాజిక కార్యకర్తను రాష్ట్రం కోల్పోయిందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. పేదల సమస్యలపై నిరంతర పోరాటాలతో శ్రీరామరెడ్డి జీవితాన్ని త్యాగం చేశారని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ట్వీట్‌ చేశారు. గొప్ప పోరాట యోధుడిని కోల్పోయామని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన తనకు మంచి స్నేహితుడు. మూఢనమ్మకాలు, పేదరికం, అసమానతలు, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచి పోరాటాలు చేసిన ఆయన విధానసభలో పేదల ధ్వనిగా నిలిచారని కేపీసీసీ అధ్యక్షుడు డీకేశివకుమార్‌ వ్యాఖ్యానించారు. మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్‌ పరమేశ్వర్‌, మాజీ మంత్రులు ఎం.ఆర్‌.సీతారాం, ఎంబీపాటిల్‌, హెచ్‌.కె.పాటిల్‌, కృష్ణభైరేగౌడ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

విషణ్ణవదనంతో భౌతిక కాయాన్ని తరలిస్తున్న అభిమానులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని