logo

ఆలస్యమైనా.. అమృత ఫలమే!

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అభ్యర్థులు, మంత్రి పదవుల జాబితాపై సుదీర్ఘ కసరత్తు చేసినా చివరకు పూర్తిస్థాయి మంత్రివర్గమే రూపొందింది. అనుభవజ్ఞులైన సిద్ధరామయ్య దార్శనికత, నాయకత్వ పటిమ కలిగిన డీకే శివకుమార్‌ నేతృత్వంలో ఎట్టకేలకు సమతూకమైన మంత్రివర్గం పాలనకు సిద్ధమైంది.

Published : 28 May 2023 02:02 IST

పూర్తిస్థాయిలో సిద్ధు దర్బార్‌

మంత్రుల ప్రమాణస్వీకార వేళ.. అభివాదం చేస్తున్న గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌, స్పీకర్‌ యు.టి.ఖాదర్‌, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌

ఈనాడు, బెంగళూరు : ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అభ్యర్థులు, మంత్రి పదవుల జాబితాపై సుదీర్ఘ కసరత్తు చేసినా చివరకు పూర్తిస్థాయి మంత్రివర్గమే రూపొందింది. అనుభవజ్ఞులైన సిద్ధరామయ్య దార్శనికత, నాయకత్వ పటిమ కలిగిన డీకే శివకుమార్‌ నేతృత్వంలో ఎట్టకేలకు సమతూకమైన మంత్రివర్గం పాలనకు సిద్ధమైంది. తొలిసారి గెలిచిన వారికి మంత్రి పట్టం ఇవ్వరాదన్న నిబంధన, మరీ వయసు మళ్లిన వారిని దూరంగా ఉంచాలన్న ప్రతిపాదన, లోక్‌సభ ఎన్నికల్లో మరింత సమర్థతతో పని చేయాలన్న లక్ష్యాలను ప్రతిబింబించే స్థాయిలో మంత్రివర్గాన్ని తయారు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ఎంపీ రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలాల మార్గదర్శకత్వంలో కాంగ్రెస్‌ సర్కారు పటిష్టంగా తయారైనట్లే. ఎన్నికల పూర్వం కంటే ఫలితాల తర్వాత అధిష్ఠానం అందించిన సహకారంతో సిద్ధరామయ్య, డీకే శివకకుమార్‌ల మధ్య ఆధిపత్య పోరు నామమాత్రంగానే మిగిలింది. మంత్రివర్గ రచనలోనూ వీరిద్దరి ప్రతిపాదనలను సమన్వపరచిన అధిష్ఠానం పార్టీలో అసమ్మతిని సమర్థమంతంగానే అణచివేసింది.

సమన్యాయమే!

సీనియర్లు, జూనియర్లు, సముదాయాలు, ప్రాంతాల వారీగా మంత్రివర్గంలో సమన్యాయం అందించే ప్రయత్నం చేశారు. మంత్రి పదవులు దక్కని వారు అక్కడక్కడా ఆక్రోశం వ్యక్తం చేసినా చేపట్టిన విస్తరణలో అందరినీ పరిగణించినట్లే. మంత్రులకు శాఖ కేటాయింపు చేపట్టకపోయినా వారి నేపథ్యాలు, అనుభవం, ప్రతిభకు పట్టం కట్టేందుకు సిద్ధరామయ్య సర్కారు ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్లే. ప్రస్తుతం ఏర్పాటు చేసిన పూర్తిస్థాయి మంత్రివర్గంలో 9మంది మినహా మిగిలినవారంతా గతంలో మంత్రులుగా పని చేసిన వారే. మొత్తం 34మంది కేబినెట్‌ హోదాలో మంత్రివర్గంలో పని చేస్తారు.

ప్రాంతాల వారీగా..

అన్ని ప్రాంతాల్లోనూ ఓట్లను దండుకున్న కాంగ్రెస్‌ మంత్రివర్గంలోనూ అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చింది. కిత్తూరు, కళ్యాణ కర్ణాటకల్లో ఐదేసి మంది చోటు దక్కించుకున్నారు. మలెనాడు, కరావళి, మైసూరు, మధ్య కర్ణాటకలోనూ ముగ్గురు చొప్పున మంత్రి పదవులు దక్కించుకున్నారు. కానీ తొలిసారి గెలిచిన వారు ఎక్కువగా ఉన్న కొడగు, చిక్కమగళూరు, హావేరి జిల్లాలకు మంత్రిపదవులు దక్కలేదు. మంత్రివర్గంలో తప్పకుండా చోటు దొరుకుతుందని భావించిన ఆర్‌.వి.దేశ్‌పాండే, గత ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పని చేసి కాంగ్రెస్‌లో ఇటీవలే చేరిన లక్ష్మణ సవది, సీనియర్‌ మంత్రి టి.బి.జయచంద్ర, విధానపరిషత్తు విపక్ష నేత బి.కె.హరిప్రసాద్‌, జేడీఎస్‌ నుంచి వచ్చిన శివలింగేగౌడ, ధార్వాడలో నెగ్గిన వినయ్‌ కులకర్ణి మంత్రి పదవులతో గంపెడాశెలు పెట్టుకుని నిరాశకు గురయ్యారు. బెంగళూరులో ప్రాతినిధ్యం పెరిగిన కారణంగా ఎం.కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియా కృష్ణప్పలకు చోటు దక్కలేదు. ఇక లింగాయత్‌లో అత్యధికులకు అవకాశం ఇచ్చిన కారణంగా విజయానంద కాశెప్పనవర్‌ కూడా అర్హత ఉండీ అవకాశం దక్కనివారిలో ఒకరు. ఇక ముస్లిం కోటాలోనూ ఎన్‌.ఎ.హ్యారిస్‌, తన్వీర్‌ శేఠ్‌ మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు.

మంత్రివర్గం ఇదిగో

* సిద్ధరామయ్య : ముఖ్యమంత్రి

* డీకే శివకుమార్‌ : ఉపముఖ్యమంత్రి

* కొత్త మంత్రులు: డాక్టర్‌ జి.పరమేశ్వర్‌, రామలింగారెడ్డి, ఎం.బి.పాటిల్‌, సతీశ్‌ జార్ఖిహొళి, ప్రియాంక్‌ ఖర్గే, జమీర్‌ అహ్మద్‌,  కేహెచ్‌ మునియప్ప, కేజే జార్జ్‌, ఈశ్వర ఖండ్రే, హెచ్‌.కె.పాటిల్‌, డాక్టర్‌ హెచ్‌.సి.మహదేవప్ప, కృష్ణభైరేగౌడ, శరణబసప్ప దర్శనాపూర్‌, ఎస్‌.ఎస్‌.మల్లికార్జున, శివరాజ్‌ తంగడిగి, డాక్టర్‌ శరణప్రకాశ్‌ పాటిల్‌, దినేశ్‌ గుండూరావు, శివానందపాటిల్‌, చలువరాయస్వామి, డి.సుధాకర్‌, రహీం ఖాన్‌, ఆర్‌.బి.తిమ్మాపూర్‌, సంతోశ్‌ లాడ్‌

* తొలిసారి మంత్రులు:  లక్ష్మీ హెబ్బాళ్కర్‌, భైరతి సురేశ్‌, మధు బంగారప్ప, కేఎన్‌.రాజణ్ణ, బి.నాగేంద్ర, మంకాళ్‌ వైద్య, డా.ఎం.సి.సుధాకర్‌, ఎన్‌.ఎస్‌.బోసురాజు, వెంకటేశ్‌

* సామాజిక న్యాయం : ఈ మంత్రివర్గంలో సముదాయాల వారీగా గెలిచిన సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో లింగాయత్‌లు 8, ఎస్‌సీ 6, ఎస్‌టీ 3, ఒక్కలిగలకు 6, ఓబీసీ 6, ముస్లిం 2, జైన్‌, బ్రాహ్మణ, క్రైస్తవుల్లో ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటిచ్చారు. ఇక మహిళల్లో లక్ష్మీ హెబ్బాళ్కర్‌ ఒక్కరే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

‘భాజపా తప్పు ప్రచారం’

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : గత ప్రభుత్వం చేపట్టిన నియామకాలను తాము రద్దు చేస్తున్నట్లు భాజపా తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ప్రవీణ్‌ నెట్టారు భార్యతో పాటు, ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్న 150 మందిని విధుల నుంచి విడుదల చేశామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. వారి ఒప్పంద గడువు పూర్తి కావడం, కొత్తగా ఒప్పంద వ్యవధిని పొడగించకపోవడంతో వారి ఉద్యోగాలు, వాటంతట అవే రద్దయ్యాయని ట్వీట్లో తెలిపారు.

అశ్వత్థ వ్యాఖ్యలపై దర్యాప్తు

రామనగర, న్యూస్‌టుడే : టిప్పును అంతం చేసినట్లే, సిద్ధరామయ్య పని పట్టాలంటూ ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి అశ్వత్థనారాయణ ఫిబ్రవరి 14న చేసిన వ్యాఖ్యలపై పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. మైసూరు దేవరాజ ఠాణా పోలీసులు రామనగర జిల్లా సాతనూరు కంబ నరసింహ స్వామి దేవాలయం వద్ద శనివారం మహజరు చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి కె.లక్ష్మణ్‌ చేసిన ఫిర్యాదు, ఇచ్చిన వీడియో సాక్ష్యం ఆధారంగా రామనగర, మండ్య గ్రామీణ ఠాణా పోలీసులతో కలిసి దర్యాప్తు కొనసాగించారు.

కొత్త మంత్రులతో గవర్నర్‌, సీఎం తదితరుల బృందచిత్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని