logo

సీవోడీ అదుపులో ఫయాజ్‌

హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్‌ ఫయాజ్‌ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు.

Published : 25 Apr 2024 01:40 IST

 

విచారణ కోసం ప్రత్యేక వాహనంలో కారాగారం నుంచి ఫయాజ్‌ను తరలించే ఏర్పాట్లు

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్‌ ఫయాజ్‌ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం హత్య జరిగిన చోటుకు బుధవారం తీసుకువెళ్లి మహజరు చేశారు. హంతకుడ్ని ఉరి కంబం ఎక్కించండి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కళాశాల వరకు మాస్కు వేసి తీసుకు వచ్చిన దర్యాప్తు బృందం, మహజరు సమయంలో నిందితుడి మాస్కు తొలగించారు.

కుటుంబానికి  పరామర్శ

నేహను హత్య చేసిన మహ్మద్‌ ఫయాజ్‌కు ఉరి శిక్ష విధించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తామని కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా తెలిపారు. మంత్రి హెచ్‌కే పాటిల్‌తో కలిసి హుబ్బళ్లిలో నేహా తల్లిదండ్రులను బుధవారం కలిసి సాంత్వన వచనాలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కాంగ్రెస్‌ నేతలంతా మీకు మద్దతుగా ఉంటామని నిరంజన్‌ హిరేమఠ్‌కు భరోసా ఇచ్చారు. నేహా తల్లిదండ్రులను నటి హర్షిక పుణచ్ఛ తన భర్తతో కలిసి వెళ్లి పరామర్శించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి బుధవారం ఉదయం వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ హత్య విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొసలి కన్నీరు కార్చారని జోషి దుయ్యబట్టారు.

సమస్య తెలుసా?

చిక్కమగళూరు: నేహా హత్య కేసును ప్రభుత్వం తేలికగా పరిగణించిందని మాజీ మంత్రి సీటీ రవి దుయ్యబట్టారు. మృతురాలి తల్లిదండ్రుల బాధ సీఎం సిద్ధరామయ్యకు అర్థం కావడం లేదన్నారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ నిందితుడు ధైర్యంగా కళాశాలకు వచ్చి నేహాపై దాడి చేసి అందరి ముందు కత్తితో పొడిచి హత్య చేశాడంటే అతనికి మరికొందరి మద్దతు ఉందని అర్థమవుతుందన్నారు. లవ్‌ జిహాద్‌ మళ్లీ కర్ణాటకలో వేళ్లూనుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు