logo

తప్పుడు నివేదికలు ఇస్తే సహించం

తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.

Updated : 19 Apr 2024 06:46 IST

పంచాయతీ కార్యదర్శులపై కలెక్టరు ఆగ్రహం

నారాయణపేట, న్యూస్‌టుడే : తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. అభంగపూర్‌, బండగొండ, లక్ష్మీపూర్‌, ఎక్లాస్‌పూర్‌, శ్యాసన్‌పల్లి, చిన్నజట్రం, కొల్లంపల్లి పంచాయతీ కార్యదర్శులు గురువారం ఆన్‌లైన్‌లో నమోదు చేసిన డైలీ శానిటేషన్‌ రిపోర్టుపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 5.30 నుంచి 7.30వరకు పంచాయతీలకు వెళ్లి పారిశుద్ధ్యాన్ని పరిశీలించామని కార్యదర్శులు నివేదిస్తే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని, పంచాయతీలకు వెళ్లకుండా ఎలా ఎంట్రీ చేశారని నిలదీశారు. ఏం చేసినా ఎవరూ చూడటం లేదని అనుకుంటే పొరపాటేనన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఏయే పనులు పరిశీలించారనేది ఫోటోలు తీసి తనకు పంపించాలన్నారు. కార్యదర్శుల ఇంక్రిమెంట్లలో కోత విధించాలని డీపీవోను ఆదేశించారు. కార్యదర్శుల నిధుల వినియోగానికి సంబంధించి తానే స్వయంగా ఆడిట్‌ను పరిశీలిస్తానని కలెక్టర్‌ తెలిపారు. ఒక గ్రామంలో బోరు మోటారు చెడిపోతే రూ.30వేల ఖర్చు లెక్క చూపారని, ఈ ఖర్చుతో కొత్త మోటారు కొనుగోలు చేయవచ్చన్నారు. గ్రామాలలో కార్యదర్శులు అందుబాటులో ఉండటంలేదని ఫిర్యాదులు వచ్చాయని, ఇకపై పనితీరు సక్రమంగా లేకుంటే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిత్తల్‌, డీఆర్డీవో రాజేశ్వరి, డీఎల్పీవో సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటించాలి

న్నికల సంఘం నిబంధనలు తప్పక పాటించాలని కలెక్టర్‌ రాజకీయ పార్టీలను కోరారు. గురువారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు వాహనాలు ఎక్కువగా తిప్పుతున్నారని, అనుమతి లేని వాహనాలను జప్తు చేస్తామని తెలిపారు. ప్రచారానికి వాడే పాటలను అనుమతి తీసుకుని రికార్టు చేయాలన్నారు. హజ్‌ యాత్రకు వెళ్లే నలుగురైదుగురు ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు..సమావేశంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, రాజకీయపార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని