logo

కొనసాగుతున్న ప్రసాద్‌ పనులు

నిర్మించి ఏడాదైనా కాకుండానే, ఇంకా పనులు కొనసాగుతుండగానే, నిర్మాణాలు పూర్తికాకుండానే ప్రసాద్‌ పథకం భవనంలోని మొదటి అంతస్తులో నిర్మించిన గదులకు పగుళ్ల రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.

Updated : 23 Apr 2024 06:12 IST

ప్రసాద్‌ పథకం భవనం

అలంపూర్‌, న్యూస్‌టుడే: నిర్మించి ఏడాదైనా కాకుండానే, ఇంకా పనులు కొనసాగుతుండగానే, నిర్మాణాలు పూర్తికాకుండానే ప్రసాద్‌ పథకం భవనంలోని మొదటి అంతస్తులో నిర్మించిన గదులకు పగుళ్ల రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. పదికాలాల పాటు భక్తులకు సేవలందించాల్సిన భవనం ఎంతో నాణ్యతతో ఉండాలి కదా అని వారంటున్నారు.

గోడకు పగుళ్లు

రూ.37 కోట్లతో..: అలంపూర్‌ పట్టణ కేంద్రం యోగనరసింహస్వామి ఆలయాల సమీపంలో అయిదు ఎకరాల విస్తీర్ణంలో రూ.37 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ పథకం కింద భవన నిర్మాణం చేపట్టింది. కింది అంతస్తు పనులు కొంత మేరకు పూర్తి కావడంతో నెల రోజుల కిందట వర్చువల్‌ విధానంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. కానీ వినియోగంలోకి తేలేదు. భవనంలో మొదటి అంతస్తులో 25 గదులు, ఒక సూట్‌, కల్యాణ మండపం, వంట గది నిర్మించారు. ఇంకా ఫ్యాన్లు, చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంది. ఇప్పటికే భవనానికి రంగులు వేసి సిద్ధం చేశారు. రూ.11.93 కోట్లతో భక్తుల కోసం ఇతర సముదాయాలు, మల్టీమీడియా ప్రదర్శన హాల్‌, రూ.5.47 కోట్లతో పార్కింగ్‌, లైటింగ్‌, సీసీ కెమెరాలు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. రూ.13.18 కోట్లతో బస్‌ షెల్టర్‌, థియేటర్‌, భోజన గది, అధునాతన ఫుడ్‌ కోర్టు నిర్మిస్తున్నారు. బస్‌ షెల్టర్‌ పనులు పూర్తి కాలేదు. రోడ్లు, డ్రైనేజీలు, డైరెక్షన్‌ బోర్డులు ఇతర అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. తుంగభద్ర నదిలో అధునాతన బోటింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఈ పనులు సైతం పూర్తి కాలేదు.

ఏడాదిన్నరగా..: ఏడాదిన్నర కిందటి నుంచి నిర్మాణ పనులు చేస్తూనే ఉన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ముందు హడావిడిగా వర్చువల్‌ ద్వారా కింది అంతస్తును ప్రారంభించారు. కానీ వినియోగంలోకి తేలేదు. అలాంటప్పుడు హడావుడిగా ప్రారంభించడం ఎందుకని భక్తులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పథకం కింద నిర్మిస్తున్న ఈ భవనం దీర్ఘకాలంపాటు భక్తులు, పర్యాటకులకు సేవలు అందించాల్సి ఉండగా పగుళ్లుబారడంపై విమర్శలున్నాయి. తుంగభద్ర నదికి అతి సమీపంలోనే ప్రసాద్‌ పథకం భవన నిర్మాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి భవనం దీర్ఘకాలంపాటు సేవలందించేలా నాణ్యంగా నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. పనులను తరచూ గతంలో మంత్రులు, ఎంపీ రాములు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పర్యాటక ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌ చూసి వెళ్తున్నా వేగం పుంజుకోవడంలేదు. కాగా చిన్న చిన్న పగుళ్లు వచ్చాయని వాటిని సరిచేయిస్తామని మేనేజర్‌ రామకృష్ణ అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు