logo

మోదీతోనే దేశం బలోపేతం

నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు.

Published : 23 Apr 2024 03:49 IST

భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

ప్రసంగిస్తున్న డీకే అరుణ, వేదికపై సీనియర్‌ నేత నాగురావు, మహిళా నేతలు

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన నారీ శక్తివందన్‌ కార్యక్రమంలో డీకే అరుణ పాల్గొని మాట్లాడారు. భారత్‌ వైపు శత్రుదేశాలు కన్నెత్తి చూడొద్దంటే, ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగాలంటే, దేశంలో పేదరికం పోవాలంటే కేంద్రంలో భాజపా ప్రభుత్వమే ఏర్పాటు కావాలని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేసిందన్నారు. మహిళా మోర్చాలోని ప్రతి నాయకురాలు ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలు, చేసిన మంచి పనులు మహిళలకు వివరించాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను ముఖ్యంగా మహిళలను ఓటు అడిగే నైతిక హక్కును కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయిందని డీకే అరుణ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మహిళలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళలకు నెలకు రూ.2,500 జీవన భృతి ఇస్తామని, రూ.500లకే వంటగ్యాస్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా అమలు చేయలేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలు చేసి అంతా చేశామని చెబుతున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక ఆడబిడ్డ పోటీ చేస్తుంటే తట్టుకోలేక సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నోటికొచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మహిళలు ఆలోచించాలన్నారు. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌ కూడా అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడి ఓటమిపాలయ్యారని, రేవంత్‌రెడ్డికి రాబోవు రోజుల్లో అదే గతి పడుతుందని డీకే అరుణ హెచ్చరించారు. సమావేశంలో భాజపా సీనియర్‌ నాయకులు నాగూరావు నామాజీ, విజయలక్ష్మి, నిరంజనమ్మ, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల మహిళా మోర్చా అధ్యక్షురాళ్లు సాహితీరెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని