AP News: పథకం ప్రకారమే తల్లీకూతుళ్ల హత్య.!
హైదరాబాద్ వ్యక్తుల ప్రమేయంపై ఆరా
వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు
హుస్నాబాద్ ఆసుపత్రికి తరలివచ్చిన బాధితుల బంధువులు
న్యూస్‌టుడే, హుస్నాబాద్, హుస్నాబాద్ గ్రామీణం: హుస్నాబాద్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలోని మడద గ్రామ పొలాల్లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న తల్లీకూతుళ్ల హత్య.. పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఏళ్లుగా భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో అదికాస్తా మనస్పర్ధలు పెరిగేందుకు కారణమైంది. దీంతో తల్లి గుగ్గిళ్లపు స్వరూప, కూతురు ఉసికె నిర్మలను హతమార్చినట్లు పోలీసులు అంటున్నారు. హత్యోదంతాన్ని తీవ్రంగా భావిస్తున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడు గుగ్గిళ్లపు శ్రీనివాస్‌కు ఇద్దరు, ముగ్గురు సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వారిని హైదరాబాద్ నుంచి పిలిపించుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇతరుల ప్రమేయంపై ఆరా..
శ్రీనివాస్ ఒకడే హత్య చేశాడా? ఇంకా ఎవరి ప్రమేయంనా ఉంది? హైదరాబాద్ నుంచి ఎవరైనా వచ్చి పాల్గొన్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితులతో పాటు నిందితుడు సైతం హుస్నాబాద్‌లోనే నివాసం ఉంటుండగా అతన్ని కలిసేందుకు ఎవరెవరు వచ్చారు? వచ్చిన వారు పట్టణంలో ఎక్కడైనా తిరిగారా అనే కోణంలో పోలీసులు ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. మరోవైపు పట్టణంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లా కేంద్రంలో శవపరీక్ష : బుధవారం హత్యకు గురైన స్వరూప, నిర్మల మృతదేహాలను రాత్రే హుస్నాబాద్ ఆసుపత్రి శవాగారానికి తరలించారు. ఆస్పత్రి వద్దకు పెద్దఎత్తున మృతుల బంధువులు, గ్రామస్థులు తరలివచ్చారు. ఇక్కడ పంచనామా అనంతరం.. మృతదేహాలను పోలీసులు సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ శవపరీక్షల నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించగా మడదలో అంత్యక్రియలు నిర్వహించారు.
హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ : తన భార్య, అత్తను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నిర్మల భర్త ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. పథకం ప్రకారమే వారిని హత్య చేశారని, ఇందులో శ్రీనివాస్‌తో పాటు మరికొందరు పాల్గొన్నారని ఆయన ఆరోపించారు. ఘాతుకానికి పాల్పడిన వారి పక్షాన న్యాయస్థానంలో ఏ న్యాయవాదీ వాదించవద్దన్నారు.
పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం.. - మహేందర్, ఏఎస్పీ, హుస్నాబాద్
మడద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. హత్యకు పాల్పడింది ఒకరేనా, మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశాం. హత్యకు పాల్పడినట్లుగా చెబుతున్న శ్రీనివాస్‌కు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. నిందితులను ఎంతమంది ఉన్నా వదలిపెట్ట్టేది లేదు.