logo

వానాకాలం సాగుకు సన్నద్ధం

ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు.

Published : 19 May 2024 03:51 IST

ప్రణాళిక రూపొందించిన వ్యవసాయాధికారులు

న్యూస్‌టుడే, మెదక్‌: ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే సీజనల్‌ లేదంటే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరుకు  కేరళకు తాకనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో వానాకాలానికి అవసరమైన ఎరువులు, విత్తనాలకు ప్రణాళిక ఖరారు చేశారు.

వ్యవసాయమే ఆధారం..

జిల్లాలో అధిక శాతం వ్యవసాయమే ఆధారం. ఏటా రెండు పంటలు సాగు చేస్తారు. రైతులు ఘనపూర్, హల్దీ ప్రాజెక్టుల పరిధిలో చెరువులు, కుంటలు, బోరుబావులపై ఆధారపడుతున్నారు. వానాకాలంలో వర్షాలే దిక్కు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కందులు పండిస్తుంటారు. గతేడాది వానాకాలంలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈసారి 3.27 లక్షల ఎకరాల్లో వేస్తారని వ్యవసాయశాఖ అంచనా. గతేడాది కంటే 27 వేల ఎకరాలు పెరగనుందని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 2023లో పత్తి 37,321 ఎకరాల్లో వేశారు. ఈసారి అదనంగా 3వేల ఎకరాలు పెరగనుంది. మొక్కజొన్న గతం కంటే 2,820 ఎకరాల్లో అదనంగా వేస్తారని అంచనా.

అందుబాటులో ఉండేలా...

ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జనుము విత్తనాలు 1,150, జీలుగ 4,080 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. యూరియా 29 వేలు, డీఏపీ 4,015, ఎంవోపీ 3,780, ఎస్‌ఎస్‌పీ 3,600, కాంప్లెక్స్‌ 28వేలు కలిపి మొత్తం 68,895 మెట్రిక్‌ టన్నుల ఎరువులు వచ్చే సీజన్‌కు అవసరమవుతాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్‌ కేంద్రాలు, ప్రైవేట్‌ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. మెదక్‌లో రేక్‌ పాయింట్‌ ఉండడంతో సకాలంలో ఎరువులు జిల్లాకు చేరనున్నాయి.


అవగాహన కల్పిస్తాం..
- గోవింద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

వానాకాలం పంటల సాగుకు ప్రణాళిక రూపొందించాం. సకాలంలో వర్షాలు కురిస్తే వరి, పత్తి, మొక్కజొన్న వేసుకోవాలి. వానలు ఆలస్యమైతే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. దీనిపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తాం.


రైతులకు చల్లని కబురు..

కొద్ది నెలలుగా జిల్లాలో భూగర్భ జల మట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం చెరువుల్లో నీళ్లు పూర్తిగా తగ్గిపోయి, ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. దీంతో రైతులు వరుణ దేవుడిపైనే భారం వేశారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈనెల 31 వరకు నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని తెలిపింది. దీంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొన్ని రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబరు నెలల మధ్య సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలనుబట్టి రైతులు దుక్కులు దున్నే అవకాశముంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని