logo

సైబర్‌ నేరస్థులకు ‘మ్యూల్‌’ ఖాతాలు

సైబర్‌ నేరస్థుల కోసం ‘మ్యూల్‌’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్, సైబర్‌ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

Updated : 19 May 2024 04:02 IST

సహకరించిన అయిదుగురి అరెస్టు 

నారాయణగూడ, న్యూస్‌టుడే: సైబర్‌ నేరస్థుల కోసం ‘మ్యూల్‌’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్, సైబర్‌ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ ఎస్‌.రష్మీ పెరుమాళ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి రాత్రే ధనవంతులు కావాలనే అత్యాశతో మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాలు తెరిచి సైబర్‌ నేరస్థులకు సరఫరా చేస్తున్నారని, సైబర్‌ నేరాలకు కారణమవుతున్నారని తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు, తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోతో కలిసి ఆపరేషన్‌ మొదలుపెట్టారు. సాంకేతిక ఆధారాలతో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం యూఎస్‌ నగరా జిల్లాకు చెందిన సివిల్‌ వర్కర్‌ ఆరిఫ్‌ సైఫీ(40), పాతబస్తీ డబీర్‌పురకు చెందిన ఎలక్ట్రీషియన్‌ మహ్మద్‌ అబ్దుల్‌ నవీద్‌(30), లిఫ్ట్‌ మెకానిక్‌ సోహెల్‌ ఖాన్‌(20), పాతబస్తీ కాలాడేరాకు చెందిన సేల్స్‌మెన్‌ మహ్మద్‌ దాదే ఖాన్‌(21), చాంద్రాయణగుట్ట ఫూల్‌బాగ్‌కు చెందిన వెల్డర్‌ సోహెల్‌ఖాన్‌(25) మ్యూల్‌ ఖాతాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

దేశవ్యాప్తంగా..: ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ సైఫీ సౌదీకి వెళ్లి భవన నిర్మాణ రంగంలో సివిల్‌ ఫోర్‌మెన్‌గా పని చేశాడు. 2023 ఫిబ్రవరిలో షార్జాలో యూపీ మురాదాబాద్‌కు చెందిన జయీద్, పంజాబ్‌కు చెందిన సందీప్‌సింగ్‌లతో పరిచయం ఏర్పడింది. వారు క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారానికి బ్యాంక్‌ ఖాతాలు అవసరమని, ప్రతీ లావాదేవీకి రూ.1500 ఇస్తామని చెప్పారు. ఈ విషయాన్ని షార్జాలో ఉంటున్న హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌కు చెందిన ఫాతిమా బేగం (ప్రస్తుతం షార్జాలోనే ఉన్నారు) ఆరిఫ్‌ సైఫీ చెప్పిన మాటలకు ఆకర్షితురాలైంది. ఖాతాలు తెరిపించడం, సిమ్‌ కార్డులు ఇస్తే రూ.10 వేలు ఇస్తామని కూడా చెప్పాడు. ఫాతిమా అల్లుడు మహ్మద్‌ అబ్దుల్‌ నవీద్, కుమారుడు సోహెల్‌ ఖాన్, మహ్మద్‌ దాదే ఖాన్, సోహెల్‌ ఖాన్‌లకు విషయం చెప్పింది. వీరంతా బ్యాంక్‌ ఖాతాలు తెరిచి, పాస్‌బుక్, డెబిట్‌ కార్డులు, అలాగే సిమ్‌ కార్డులు దుబాయికి పంపించడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన 125 కేసుల్లో 82 ఖాతాలు గుర్తించారు. వాటిలో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌లో 3, సైబరాబాద్‌లో మూడు, రాచకొండలో ఒకటి, కరీంనగర్‌ ఒకటి, జహీరాబాద్‌ ఒకటి మొత్తం 9 కేసులు ఉన్నట్లు గుర్తించారు. 82 మ్యూల్‌ ఖాతాల్లో సుమారు రూ.5 కోట్లు జమైనట్లు పోలీసులు గుర్తించారు. మోసగాళ్లు ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకున్నారు. నిందితుల నుంచి 65 బ్యాంక్‌ ఖాతా కిట్‌లు, 14 డెబిట్‌ కార్డులు, 31 సిమ్‌కార్డ్‌ పౌచ్‌లు, 6 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని