logo

4 రోజులు.. రూ.4.29 కోట్లు

సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు.

Updated : 19 May 2024 04:15 IST

ఆర్టీసీకి లాభాలు కురిపించిన ఎన్నికలు

మెదక్‌ కొత్త బస్టాండ్‌లో ప్రయాణికుల సందడి 

న్యూస్‌టుడే, మెదక్‌ అర్బన్‌: సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారంతా ఓటేయాలన్న ఉద్దేశంతో స్వగ్రామాలకు తరలివచ్చారు. మరోవైపు వేసవి సెలవులు కావడంతో వేరే ప్రాంతాల్లో ఉండే వారి పిల్లలు సొంతూర్లకు పయనమయ్యారు. ఎన్నికలు, వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని మెదక్‌ రీజియన్‌ పరిధిలో అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను నడిపించారు. దూరప్రాంతాలకు సైతం అదనపు సర్వీసులను నడిపించారు. ఇలా ఎన్నికలకు ముందు, తర్వాత అత్యధికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడంతో సంస్థకు ఆదాయం సమకూరడం విశేషం.

8 డిపోల పరిధిలో..: మెదక్‌ రీజియన్‌ పరిధిలో 8 డిపోలు ఉన్నాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, జహీరాబాద్, నారాయణఖేడ్, నర్సాపూర్‌లలో డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలో పోలింగ్‌ సందర్భంగా ఈ నెల 11 నుంచి 14 వరకు ఆర్టీసీ రెగ్యులర్‌గా నడుపుతున్న సర్వీసులకు తోడు అదనపు బస్సులను సైతం నడిపించారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌ ఇతర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉంటున్న వారంతా ఓటేయడానికి ఉమ్మడి జిల్లాలోని వారి స్వస్థలాలకు వచ్చి వెళ్లారు. దీనికితోడు జిన్నారం, పటాన్‌చెరు, చేగుంట, చిన్నశంకరంపేట, మనోహరాబాద్, జహీరాబాద్‌ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఇతర ప్రాంతాలకు చెందిన వారూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామాలకు వెళ్లారు.

887 సర్వీసులు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మే 11 నుంచి 14 వరకు వివిధ ప్రాంతాలకు 887 బస్సు సర్వీసులను నడిపించారు. వీటిలో 333 అదనపు బస్సులు ఉండటం గమనార్హం. ఈ నాలుగు రోజుల్లో 10,36,200 మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఈ లెక్కన రూ.4.29 కోట్ల ఆదాయం సమకూరింది. రోజుకు 2,50,000 మంది ప్రయాణించగా రూ.కోటికి పైగా రాబడి వచ్చింది. ఆదాయపరంగా సిద్దిపేట డిపో రూ.89.59 లక్షలు, మెదక్‌ డిపో రూ.75.48 లక్షలతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. నర్సాపూర్‌ డిపో రూ.12.27 లక్షలతో చివరి స్థానంలో నిలిచింది.


గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి స్వస్థలాలకు ఓటు వేయడానికి వచ్చే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిత్యం నడిపే బస్సులపాటు అదనంగా సర్వీసులను నడిపించాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాం. లక్ష్యాన్ని నిర్దేశించుకొని శ్రమించాం.

-ప్రభులత, ఆర్టీసీ మెదక్‌ రీజియన్‌ మేనేజర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని