logo

లెక్కలు తేలుస్తారు

సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి.

Published : 19 May 2024 02:58 IST

 గ్రామైక్య సంఘాల వారీగా ఆడిట్‌
 21 నుంచి నిర్వహణకు ఏర్పాట్లు

గొల్లపల్లిలో గ్రామైక్య సంఘం సమావేశం  
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. మహిళా పొదుపు సంఘాలు ఇందుకు మినహాయింపేమీ కాదు. గ్రామైక్య సంఘం(వీవో)లో లెక్కల విషయంలో తేడాలకు తావు లేకుండా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వీవోల వారీగా ఈ నెల 21 నుంచి ఆడిట్‌ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే కథనం.

పుస్తకాలు.. అంతర్జాలంలో పరిశీలన 

గ్రామంలోని పొదుపు సంఘాలన్నీ  కలిపి గ్రామైక్య సంఘంగా ఏర్పాటుచేస్తారు. పొదుపు సంఘాల ఎక్కువగా ఉంటే అందుకు అనుగుణంగా వీటి సంఖ్య కూడా పెంచుతారు. ఒక్కో సంఘానికి అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి ఉంటారు. వీరితో పాటు వీవోఏ(విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌) ఉంటారు. ఈ సంఘం పరిధిలోని మహిళా సంఘాల లెక్కలన్నీ ప్రస్తుతం వీవోఏలు ఆన్‌లైన్‌లో నమోదుచేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో పుస్తకాల్లోనూ నమోదు చేస్తున్నారు. ఆడిట్‌లో భాగంగా ఆన్‌లైన్, పుస్తకాలు పరిశీలిస్తూ ఏమైనా తేడాలు ఉన్నాయా అని ఆరా తీయనున్నారు. తేడా ఉంటే కారణాలు తెలుసుకుంటారు. పుస్తకాల్లో నమోదైన వాటిలో కొన్ని ఆన్‌లైన్‌లోకి ఎక్కించకపోవడం, నిధులు ఏమైనా పక్కదారి పట్టాయా లేదా అని పరిశీలిస్తారు. గ్రామైక్య సంఘం పుస్తకాల్లో రుణాలు, వాయిదాల చెల్లింపుల వివరాలన్నీ సరిచూసి అంతర్జాలంలో నిక్షిప్తం చేయనున్నారు. 

ఆర్థిక పరిస్థితుల మెరుగుకు ప్రణాళికలు

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో మహిళా గ్రామైక్య సంఘం ద్వారా పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాలు, వసూళ్లు, తదితరాలతో బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికలు తయారుచేస్తారు. దీనివల్ల సంఘం సభ్యులకు తమ పరిస్థితి ఏమిటో తెలియజేయనున్నారు. ఆడిట్‌ ఆధారంగా వెనుకబడ్డ సంఘాల ఆర్థిక ప్రగతికి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించనున్నారు.

పారదర్శకత పెరుగుతుంది: జంగారెడ్డి, అదనపు డీఆర్డీవో

గ్రామైక్య సంఘాల వారీగా ఆడిట్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా జూన్‌ 30వ తేదీలోగా పూర్తిచేస్తాం. ఇందుకు అనుగుణంగా ఆడిట్‌ బృందాలకు ఇప్పటికే సూచనలు చేశాం. వివరాలన్నీ అంతర్జాలంలో నిక్షిప్తం చేయడంతో పాటు పుస్తకాల్లోనూ నమోదు చేయించనున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని