logo

నల్గొండ.. నాయకులకు అండ!

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్‌సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే.

Updated : 19 Apr 2024 06:29 IST

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: నల్గొండ లోక్‌సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్‌సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. 1952లో ఇక్కడ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కొన్ని రిజర్వుడు నియోజకవర్గాల్లో ఒక రిజర్వేషన్‌ అభ్యర్థిని సైతం ఎన్నుకునే పద్ధతి ఉండడంతో తొలి ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థులు సుంకం అచ్చాలు, రావి నారాయణరెడ్డి విజయం సాధించగా.. 1957లో పీడీఎఫ్‌ అభ్యర్థి దేవులపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి డి.రాజయ్య(ఎస్సీ)లు ఎన్నికయ్యారు. మే 13న మరోసారి లోక్‌సభ పోరుకు సిద్ధమయ్యారు నల్గొండ నియోజకవర్గ ప్రజలు.

మారిన నియోజకవర్గ స్వరూపం..

 నల్గొండ తర్వాత ఉమ్మడి జిల్లాలో 1962లో మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మిర్యాలగూడ నియోజకవర్గం రద్దయి.. కొత్తగా భువనగిరి నియోజకవర్గం ఏర్పాటైంది. 2008 వరకు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో ఆలేరు, భువనగిరి, మునుగోడు, దేవరకొండ, మలక్‌పేట, నల్గొండ, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాలు ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నాగార్జునసాగర్‌, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలు నల్గొండ లోక్‌సభ పరిధిలోకి వచ్చాయి.

 కాంగ్రెస్‌, సీపీఐ హోరాహోరీ..

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గానికి మొత్తం 17 సార్లు ఎన్నికలు జరుగగా.. కాంగ్రెస్‌ అభ్యర్థులు 8 సార్లు, సీపీఐ అభ్యర్థులు 5 సార్లు విజయం సాధించారు. పీడీఎఫ్‌ అభ్యర్థులు మూడు సార్లు, తెదేపా అభ్యర్థులు రెండు సార్లు,  తెలంగాణ ప్రజాపోరు సమితి అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు. అత్యధికంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మూడు సార్లు (ఒకసారి తెదేపా నుంచి, కాంగ్రెస్‌ నుంచి రెండు సార్లు) ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత సీపీఐ అభ్యర్థులు రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, సురవరం సుధాకర్‌రెడ్డి తలో రెండు సార్లు విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని