logo

వేస్తున్నారు నామినేషన్లు..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది.

Updated : 24 Apr 2024 06:14 IST

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, భువనగిరి  : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం నల్గొండ లోక్‌సభకు సంబంధించి ఎనిమిది మంది అభ్యర్థులు నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) దాసరి హరిచందనకు అందజేశారు. స్వతంత్ర అభ్యర్థి కిన్నెర యాదయ్య రెండో సెట్‌ నామినేషన్‌ వేయగా..కొత్తగా ఏడుగురు అభ్యర్థులు నామినేషన్‌ వేసినట్లైంది. దీంతో లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ వేసిన వారి సంఖ్య 29కి చేరింది. భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, మల్లయ్యయాదవ్‌, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య, చకిలం అనిల్‌కుమార్‌లతో కలిసి రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జేపీ) తరఫున సుంకర లింగయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా అఖిల్‌ సంపంగి, రేళ్ల నరసింహారావు, సుంకరి రమేశ్‌, అబ్దుల్‌ మాలిక్‌, పొలిశెట్టి వెంకటేశ్వర్లు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. భాజపా, భారాస అభ్యర్థులు సైదిరెడ్డి, కృష్ణారెడ్డి ఇప్పటికే నామినేషన్‌ వేయగా..అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి నేడు నామినేషన్‌ వేయనున్నారు.

భువనగిరిలో... భువనగిరిలో మంగళవారం మొత్తం 18 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయగా..ఇందులో భాజపా, సీపీఎం అభ్యర్థులు బూర నర్సయ్యగౌడ్‌, ఎండీ జహంగీర్‌తో పాటూ బహుజన ముక్తి పార్టీ తరఫున పెంట రమేశ్‌, స్వతంత్ర అభ్యర్థులు ఊదరి మల్లేష్‌, రేకల సైదులు, వింద్యాల సదానందరెడ్డి గతంలోనే ఒక సెట్‌ నామినేషన్‌ వేయగా..తాజాగా మంగళవారం మరో సెట్‌ దాఖలు చేశారు. దీంతో 12 మంది కొత్తగా నామినేషన్‌ వేసినట్లైంది. ఇప్పటి వరకు నామినేషన్‌ వేసిన అభ్యర్థుల సంఖ్య 35కి చేరింది. బహుజన లెఫ్ట్‌ పార్టీ నుంచి నూనె వెంకటస్వామి, బ్లూ ఇండియా పార్టీ నుంచి డప్పు వీరస్వామి, అలయన్స్‌ ఆల్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ పార్టీ అభ్యర్థిగా తాళ్లపల్లి రమేశ్‌, విడుతలై చిరుతైగల్‌ కచ్‌ (వీసీకే) పార్టీ అభ్యర్థిగా ఎర్ర సూర్యం, సీపీఎం పార్టీ నుంచి అనురాధ, స్వతంత్ర అభ్యర్థులు జంగా సుజాత, పోతుల యాదగిరి, బుషిపాక వెంకటయ్య, ఆరూరి వెంకటేశం, బొల్లారం బాలరాజు, కారింగుల యాదగిరి, సంజీవులు తదితరులు తమ నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి హనుమంత్‌ కే.జండగేకు సమర్పించారు. ప్రధాన పార్టీలయిన భాజపా, భారాస, సీపీఎం పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేయగా అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు నామినేషన్‌ వేయనున్నారు.


తొలిసారి బరిలో ఉన్న పార్టీలు

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: 1952లో తొలిసారి నిజాం రాష్ట్ర పరిధిలో ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ, రాయచూర్‌, గుల్బర్గా, బీదర్‌, ఉస్మానాబాద్‌, బీడ్‌, ఔరంగాబాద్‌, పర్బని, నాంథేడ్‌ జిల్లాలు కలిపి నిజాం రాష్ట్రంగా ఉండేది. అప్పటి ఎన్నికల్లో ఏడు జాతీయ పార్టీలు, ఏడు రాష్ట్ర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలివే...

జాతీయ స్థాయిలో..

1. ఆలిండియా భారతీయ జనసంఘ్‌
2. అఖిల భారత హిందూ మహాసభ
3. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌
4. కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ
5. అఖిల భారతీయ రామరాజ్య పరిషద్‌
6. అఖిల భారత షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫెడరేషన్‌
7. సోషలిస్ట్‌ పార్టీ


రాష్ట్ర పరిధిలో..

1. హైదరాబాద్‌ స్టేట్‌ డిప్రెస్డ్‌ క్లాసెస్‌ అసోసియేషన్‌
2. హైదరాబాద్‌ స్టేట్‌ ప్రజా పార్టీ (హెచ్‌ఎస్‌పీపీ)
3. ఇండిపెండెంట్‌ లీగ్‌
4. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌)
5. పెజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ
6. ఆలిండియా రిపబ్లికన్‌ పార్టీ
7. యునైటెడ్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫెడరేషన్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని