logo

బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?

కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్‌ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి.

Published : 19 Apr 2024 04:11 IST

అయిదేళ్లలో అంగుళం కదలని వైనం
మనుబోలు, న్యూస్‌టుడే

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డేగపూడి-బండేపల్లి లింకు కాలువ పనులు పూర్తి చేసి.. 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం

- కాకాణి గోవర్ధన్‌రెడ్డి

మరి అయిదేళ్ల వైకాపా పాలనలో ఆ వాగ్దానం నెరవేరిందా? అంటే.. లేదనే అక్కడి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.

సమస్య ఇది

నుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్‌ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ కాలువ నిర్మాణం జరుగుతుందని, బండేపల్లి బ్రాంచి కాలువ ఆయకట్టు కింద బీడు భూములు సాగులోకి వస్తాయని రైతులు పాతికేళ్లుగా ఎదురు చూస్తుండగా.. ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది. కాలువ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం 2003, మే 10 బండేపల్లి బ్రాంచి కాలువ ఆయకట్టు రైతు సంఘం ఏర్పాటు చేసి.. నాటి నుంచి శ్రమిస్తూనే ఉన్నారు.

సాధన దిశగా

2014 ఎన్నికల్లో సోమిరెడ్డి కాలువకు కండలేరు నుంచి నీటిని అందించి.. పంటలు కాపాడుతామని వాగ్దానం చేశారు. అన్నట్లుగానే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. జీవో జారీ చేయడంతో పాటు భూసేకరణకు సుమారు రూ. 10.30 కోట్లు మంజూరు చేయించారు. దాదాపు రూ. 30 కోట్ల అంచనాలతో కాలువ నిర్మాణానికి 2019, జనవరిలో రాజవోలుపాడు వద్ద శంకుస్థాపన చేశారు. సుమారు 2 కి.మీ. మేర పనులూ జరిగాయి.

సాకారమైతే...

ఆయకట్టు పరిధిలోని గొట్లపాలెం, రాజవోలుపాడు, వీరంపల్లి, అక్కంపేట, మడమనూరు, పర్లపాడు, బండేపల్లి, జట్లకొండూరు, కొండూరుసత్రం తదితర గ్రామాల్లోని చెరువులు జలకళ సంతరించుకుంటాయి. మనుబోలు మండలంతో పాటు వెంకటాచలం, సైదాపురం, పొదలకూరు మండలాల్లోని పలు గ్రామాలు సస్యశ్యామలమవుతాయి.

ఆశ.. నిరాశ

సాగునీరు సక్రమంగా రాక.. వేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అన్నదాతలకు ఈ పనులు ఎంతో సంతోషం కలిగించాయి. అంతలోనే.. ఆ ఆనందం ఆవిరైంది. కారణం.. 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో.. ఈ పనులు నిలిచిపోయాయి. వైకాపా ప్రభుత్వంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు.


అడ్డకోవడంతో ఆగిపోయాయి

- వద్దినేని మస్తాన్‌నాయుడు, కనుపూరు కాలువ ప్రాజెక్టు కమిటీ మాజీ ఛైర్మన్‌

డేగపూడి-బండేపల్లి లింకు కాలువ పనులను రెండు కి.మీ. మేర చేయించాం. ప్రభుత్వం మారడం, ఎమ్మెల్యే కాకాణి కారణంగానే అవి నిలిచిపోయాయి. ఆ తర్వాత తిరిగి మొదలు కాలేదు. ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  


నీరందిస్తే ప్రయోజనం

- లక్ష్మయ్య, అఖిలపక్ష రైతు పోరాట సమితి నాయకుడు

డేగపూడి-బండేపల్లి లింకు కాలువ పూర్తయితే పాతికేళ్ల నాటి రైతుల కల నెరవేరుతుంది. ఈ బ్రాంచి కాలువకు సాగునీరందక.. ఏటా వేలాది ఎకరాలు బీడు భూములుగా వదిలేసే పరిస్థితి ఉంది. రైతుల కష్టాలు తీర్చే దిశగా ఒక్క అడుగూ పడకపోవడం బాధాకరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని