logo

మాటల వంతెన.. చేతల వంచన!

ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్‌ హామీలు ఇచ్చారు.  ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు.

Published : 19 Apr 2024 04:16 IST

ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్‌ హామీలు ఇచ్చారు.  ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చినుకు పడితే వాగులు పొంగుతున్నాయి. రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఎన్నో గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. అయిదేళ్లలో ఇలాంటి వాగులపై ఒక్క వంతెన కూడా నిర్మించలేదు. దీంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పడే ఇబ్బందులు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు

ఊరికెళ్లాలంటే ప్రాణాంతకం

సంగం :  భారీ వర్షాలు వస్తే మండలంలోని వీర్లగుడిపాడు వద్ద పెన్నా నది, పిల్లి వాగు, బీరాపేరు, పెరమన వద్ద బీరాపేరు వాగు, కుక్కల గుంట, చెన్నవరప్పాడు వద్ద చవిటి వాగు, చెర్లోవంగల్లు వద్ద దువ్వూరు చెరువు నుంచి వరద ప్రవాహాలు పోటెత్తుతాయి. ఫలితంగా ఆయా గ్రామాలకు ప్రజలు రాకపోకలు సాగించాలంటే ప్రాణాంతకమే. నీటి ఉద్ధృతితో ఆ గ్రామాలకే కాకుండా జంగాలదొరువు, జంగాలకండ్రిక, మర్రిపాడు గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వరద ప్రవాహాలను అధిగమించేందుకు హైలెవల్‌ వంతెనలు నిర్మించాలనే ప్రజల కోరిక తీరడం లేదు. ఎంతమందికి చెప్పినా ఎవరూ ఆలకించడం లేదు.


జలదిగ్బంధం

చేజర్ల : ఏటా వర్షాకాలంలో మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఈగ్రామాల పరిధిలో ఎత్తు వంతెనలు లేకపోవడంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. చేజర్ల- కలువాయి మధ్య నల్లవాగుపై చేజర్ల- సంగం మార్గంలో పందల వాగుపై కండాపురం- కాకివాయి మధ్య దక్షిణపు వాగుపై లోలెవెల్‌ చప్టాలు ఉన్నాయి. పెద్ద వర్షం కురిస్తే వాగులు పొంగి మండల కేంద్రం, ప్రధాన రహదారులకు ఆయా గ్రామాల నుంచి రాకపోకలు నిలిచిపోతున్నాయి. పొలాలకు వెళ్లిన ప్రజలు, పాఠశాలలు,కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు, పనుల నిమిత్తం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లిన ప్రజలు వాగుల్లో ప్రవాహం తగ్గేంతవరకు నిరిక్షించాల్సిందే. నల్లవాగు కారణంగా ఎనమదల, తూర్పుకంభంపాడు, కోటితీర్థం, బిల్లుపాడు, కాకివాయి గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


రాకపోకలకు అంతరాయం

దుత్తలూరు : కలిగిరి-సంగం రహదారిపై కమ్మవారిపాలెం సమీపంలోని చప్టా భారీ వర్షాల సమయంలో ప్రమాదాలకు నిలయంగా మారింది. సోమశిల ఉత్తర కాలువకు అనుసంధానంగా ఉన్న శ్రీకొలను బ్రాంచి కాలువ గట్లు ఈ వాగు సమీపంలో వర్షాల సమయంతో తెగిపోతున్నాయి. ఆ నీరంతా వాగులోకి రావడం, వర్షపు నీరు తోడవడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. వంతెన ఎత్తు పెంచాలన్న ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు.


చింతగుంట పొంగితే..

వరికుంటపాడు : వర్షాకాలంలో వరికుంటపాడు, వింజమూరు మండలాల మధ్యలో ఉన్న చింతగుంట వాగు పొంగితే 10 రోజుల వరకు రాకపోకలు నిలిచిపోవాల్సిందే. తరువాత రెండు నెలలు నడుము లోతు నీటిలో రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. రామదేవులపాడు నుంచి జనార్ధనపురం వరకు రోడ్డు నిర్మాణంతోపాటు చింతగుంట వాగుపై వంతెన నిర్మించాల్సి ఉంది. దీన్ని నిర్మించకపోవడంతో 30 ఏళ్లుగా పొలాలకు వెళ్లే రైతులతోపాటు జనార్ధనపురం, చాకలికొండ, గోళ్లవారిపల్లి, బత్తినవారిపల్లి, కాటేపల్లి, గొట్టిగుండాల తదితర గ్రామాలకు చెందిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువైపు నుంచి వింజమూరు వెళ్లేందుకు వీలు కావడం లేదు. పాలకుల నోట హామీగా మిగులుతోంది.


పడవలో వెళ్లాల్సిందే!

బిట్రగుంట: ప్రకృతి ప్రకోపాన్ని ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం చూసింది. కష్టాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు గడిచింది. అభివృద్ధికి ఒక్క అడుగు పడిన పరిస్థితి లేదు. వర్షాకాలంలో కావలి డివిజన్‌లోని పిల్లి వాగు, ఉబ్బల వాగు, చిప్పలేరు, అల్లూరు స్వాంపు పొంగుతున్నాయి. దీంతో ఉమామహేశ్వరపురం, ముంగమూరు, తెల్లగుంట, అల్లిమడుగు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. పడవల్లో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న తీరును అప్పటి మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గమనించారు. వరద నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పి గాలికొదిలేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని