logo

పచ్చటి బతుకులపై ఫ్లోరైడ్‌

బతికుండగానే మనిషిని నిలువునా కుంగదీసి జీవచ్ఛవంలా మార్చే ఫ్లోరైడ్‌ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైకాపా అధికారంలోకి వస్తే ఎక్కడికక్కడ శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించిన ప్రజాప్రతినిధులు.. సమస్య పరిష్కారం దిశగా గత ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసిన వాటినీ పట్టించుకోలేదు.

Updated : 23 Apr 2024 06:18 IST

27 పీహెచ్‌సీల పరిధిలోని 199 గ్రామాల్లో ప్రభావం

జగన్‌ జమానాలో పరిష్కారం దిశగా కానరాని చర్యలు

 ప్లాంట్‌ మూతపడటంతో..అల్లాడుతున్న మెట్టవాసులు

గండిపాళెం జలాశయం వద్ద తుప్పుపడుతున్న సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు యంత్రాలు

బతికుండగానే మనిషిని నిలువునా కుంగదీసి జీవచ్ఛవంలా మార్చే ఫ్లోరైడ్‌ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైకాపా అధికారంలోకి వస్తే ఎక్కడికక్కడ శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించిన ప్రజాప్రతినిధులు.. సమస్య పరిష్కారం దిశగా గత ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసిన వాటినీ పట్టించుకోలేదు. దీంతో అవగాహన లేక కొందరు.. స్వచ్ఛమైన నీరు దొరక్క భూగర్భ గరళం తాగి మరికొందరు వ్యాధుల బారిన పడుతున్నారు. మూడు పదుల వయసుకే.. వృద్ధులుగా మారుతున్నారు. పాడి పంటలు, పిల్లా పాపలతో కళకళలాడాల్సిన గ్రామాలు ఫ్లోరైడ్‌ బాధితులు, వలసలతో కళా విహీనంగా తయారవుతున్నాయి.

ఈనాడు, నెల్లూరు, వరికుంటపాడు: జిల్లాలో మొత్తం 52 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా- సుమారు 27 పీహెచ్‌సీల పరిధిలో ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. సాధారణంగా నీటిలో ఫ్లోరిన్‌ 0.5 పీపీఎం(పార్ట్‌ ఫర్‌ మిలియన్‌) ఉండాల్సి ఉండగా- కొన్ని గ్రామాల్లో 4.15 వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వే ప్రకారం మొత్తం 199 గ్రామాలు ప్రభావితమైనట్లు గుర్తించి.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండేళ్ల కిందట పది వేల ఇళ్లలోని 18,275 మందిని పరిశీలించగా.. సుమారు 921 మంది అనుమానితులు తేలారు. తుది పరీక్షల అనంతరం 214 మంది ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. 126 మందికి రిహాబిలిటేషన్‌ పరికరాలు అందజేశారు. దీంతో పాటు ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాల్లోని 530 పాఠశాలలను సర్వే నిర్వహించారు. సుమారు 8,123 మందికి మూడు రకాల పరీక్షలు నిర్వహించారు. తొలుత 334 మందిలో అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించినా.. తుది పరీక్షల అనంతరం 76 మంది దంత సంబంధిత ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. వీరికి కేవలం విటమిన్‌ మాత్రలు పంపిణీ చేసి.. చేతులు దులుపుకోవడం గమనార్హం.

పాలకుల నిర్లక్ష్యం.. యంత్రాలు నిరుపయోగం!

పదేళ్ల కిందట వరికుంటపాడు మండలంలోని 44 గ్రామాలకు రాజీవ్‌ టెక్నాలజీ మిషన్‌ కింద శుద్ధి నీటిని అందించేందుకు చర్యలు చేపట్టారు. గండిపాళెం నుంచి రూ. 7కోట్ల వ్యయంతో ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. రెండు, మూడేళ్ల తర్వాత.. దాని నిర్వహణను గాలికి వదిలేయడంతో మూలనపడింది. అప్పుడప్పుడూ మరమ్మతులు చేసినా... పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టకపోవడంతో.. మూడేళ్లుగా పూర్తిగా ఆగిపోయింది. స్లోశాండ్‌ ఫిల్టర్లు అలంకారప్రాయంగా మారగా.. రూ. లక్షలు వెచ్చించి తెచ్చిన మైక్రో ఫిల్టర్‌ తుప్పుపట్టిపోతోంది. మోటార్లు, ఇతర సామగ్రి పనికి రాకుండా పోయే పరిస్థితి తలెత్తింది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ట్యాంకులు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నేరుగా బోర్ల నుంచి సరఫరా చేస్తుండగా.. ఆ నీటిలో ఫ్లోరైడ్‌ ఉందో, లేదో తమకు తెలియదని చెబుతుండటం గమనార్హం. ఇప్పటికే చాలా గ్రామాల్లో క్యాన్‌ నీళ్లు వినియోగిస్తున్నారు. నలుగురు ఉండే ఓ ఇంట్లో రోజుకు రెండు క్యాన్లు(20 లీటర్లు) పడుతున్నాయి. అంటే.. రూ. 20. దీని ప్రకారం ఒక్కో కుటుంబంపై తాగునీటి కోసం రూ.600 భారం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘మెట్ట ప్రాంతవాసులకు తిప్పలు తప్పడం లేదు. ఓ వైపు ఫ్లోరైడ్‌ రక్కసి వణికిస్తుండగా.. మరోవైపు తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. పళ్లు రంగు మారడం, ఎముకలు బలహీనపడటం, వయసుండగానే వంగిపోవడం వంటి ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించి.. ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా.. పరిష్కార దిశగా కనీస చర్యలు కొరవడ్డాయి. కొన్ని గ్రామాల్లో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాలు పనిచేయడం లేదు. ఫ్లోరైడ్‌ బాధితులకు అవసరమైన పరికరాలను ఉచితంగా ఇవ్వడంతో పాటు శస్త్రచికిత్సలు అవసరమని నిర్ధారించిన వారికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేస్తామని పలుమార్లు ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలు పత్రాలు దాటి ముందుకు కదల్లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.’

ఇదీ పరిస్థితి..

  • బాధితులు - 185
  • అనుమానితులు - 621
  • వైద్య పరీక్షలు జరిపింది - 18,275
  • సర్వే చేసిన ఇళ్లు - 10 వేలు
  • ఫ్లోరైడ్‌ ప్రభావిత ఆవాస గ్రామాలు - 389

20 ఏళ్లకే మోకాళ్ల నొప్పులు

ఫ్లోరైడ్‌ నీటిని తాగడం వల్ల 20 ఏళ్ల వయసు నుంచే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఏ పని చేయలేక అల్లాడిపోతున్నారు. గ్రామాల్లోకి వచ్చే శుద్ధజలాన్ని క్యాన్‌ రూ. పది పెట్టి కొనుగోలు చేసినా ఏ మాత్రం ప్రయోజనం ఉండటం లేదు. గతంలో గండిపాలెం ప్రాజెక్టు నుంచి శుద్ధి నీటిని సరఫరా చేసేవారు. అప్పట్లో కొంత మేర ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు ఆ నీటిని అందించడం లేదు.

- బాలిబోయిన నాగయ్య, జి.కొత్తపల్లి

దిష్టిబొమ్మల్లా ట్యాంకులు

ఫ్లోరైడ్‌ సమస్యను అధిగమించేందుకు గండిపాళెం జలాశయం వద్ద రాజీవ్‌ టెక్నాలజీ మిషన్‌ పథకం ద్వారా శుద్ధజలాన్ని అందించేందుకు రూ. కోట్లు ఖర్చు చేశారు. ఉదాసీనతతో.. ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చింది. గ్రామాల్లో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో.. ఫ్లోరైడ్‌ నీటిని తాగి.. కిడ్నీ సంబంధిత వ్యాధులతో కొందరు మృత్యువాత పడగా- మరికొందరు యువకులే చికిత్స పొందుతూ బాధపడుతున్నారు. పాలకుల దృష్టికి తీసుకువెళ్లడం.. వారు హామీలు ఇవ్వడం.. వాటిని గాలికి వదిలేయడం పరిపాటిగా మారింది.  
మాగంటి రవి, టి.బోయమడుగుల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు