logo

ఇక ప్రచార హోరు

లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు.

Published : 19 Apr 2024 05:43 IST

 నేడు భాజపా, భారాస, 22న కాంగ్రెస్‌
అభ్యర్థుల నామినేషన్లు

పాత కలెక్టరేట్‌ మైదానంలో బహిరంగ సభ వేదిక ఏర్పాట్లు

ఈనాడు, నిజామాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. నిన్నటి వరకు పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలకే పరిమితమయ్యారు. ఇక నుంచి సభలు, ర్యాలీలు మొదలుకానున్నాయి. భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ సంద]ర్భంగా పాత కలెక్టరేట్‌ మైదానంలో ఉదయం 10 గంటలకు బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. సభ అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొని నామినేషన్‌ వేయనున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ సైతం శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ధరావత్తు రుసుమును ఆయనకు రైతులు విరాళంగా అందించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 25న మరోమారు నామినేషన్‌ వేయనున్నారు. ఆ రోజు నిర్వహించే బహిరంగ సభకు రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ హాజరవుతారని చెబుతున్నారు. శుక్ర, శనివారాల్లో కాంగ్రెస్‌ సన్నాహక సమావేశాలు, 22న జీవన్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా నిర్వహించే కార్నర్‌ మీటింగ్‌కు శ్రేణుల సమాయత్తంపై సమీక్షించనున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యే అవకాశాలున్నాయి.

ముఖ్య నేతలు వస్తేనే సందడి..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకోనుంది. పార్టీలు తమ విధానాలు వివరించి ఓటర్లను తిప్పుకోవాలంటే ముఖ్య నేతల ప్రసంగాలు తప్పనిసరి. వారి సభలతోనే అసలైన రాజకీయ సందడి నెలకొంటుంది. ముఖ్య నేతల పర్యటనలతో నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ వచ్చి అభ్యర్థికి బలం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల బడా నేతల ప్రచార సభలకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ప్రధాన నేతల్లో ఎవరు తన నియోజకవర్గానికి సమయం ఇస్తారో తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిజామాబాద్‌, ఆర్మూర్‌, కోరుట్లలో పర్యటిస్తారని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. భాజపా నేతలు ఉత్తరాదిలో బిజీగా ఉన్న తరుణంలో వచ్చేనెల మొదటి వారంలో బహిరంగ సభలకు అవకాశం ఉందంటున్నారు.భారాస అధినేత కేసీఆర్‌ బస్సు యాత్రలో రూట్‌ మ్యాప్‌ ఖరారు కావాల్సి ఉంది. కేటీఆర్‌ సైతం ఒక దఫా వస్తారని అంటున్నారు.

కలెక్టరేట్‌లోకి ఉద్యోగులను తనిఖీ చేసి పంపుతున్న పోలీసులు

తొలి రోజు ఇద్దరే..

నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలానికి చెందిన భుక్యా నందు నాయక్‌ విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి సత్యనారాయణ నామపత్రం దాఖలు చేశారు. నోటిఫికేషన్‌ విడుదలై..నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆరంభమైన క్రమంలో కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. కార్యాలయ ఉద్యోగులను సైతం తనిఖీ చేసి గుర్తింపు కార్డు ఉంటేనే లోనికి అనుమతిస్తున్నారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి 200 మీటర్లలోపు గుమిగూడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని