logo

‘నగరాభివృద్ధిపై భారాస ప్రభుత్వం వివక్ష’

భారాస ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధిపై పూర్తి వివక్ష చూపారని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 06:51 IST

మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, చిత్రంలో షబ్బీర్‌ అలీ, మహేష్‌ కుమార్‌గౌడ్‌, సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, కేశ వేణు, మానాల, గడుగు తదితరులు
నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: భారాస ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధిపై పూర్తి వివక్ష చూపారని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని లక్ష్మి కల్యాణ మండపంలో అర్బన్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ నగర అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షతన శుక్రవారం రాత్రి నిర్వహించారు. జీవన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. కేసీఆర్‌ కూతురుగా కవిత ఐదేళ్లు ఎంపీగా చేసింది శూన్యమన్నారు. కరీంనగర్‌ విస్తీర్ణంలో తక్కువగా ఉన్నా స్మార్ట్‌ సిటీగా ఎంపికైందని, నిజామాబాద్‌ ఎంపిక కాకపోవడానికి అర్వింద్‌ వైఫల్యమే కారణమన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆర్టీసీ ఛైర్మన్‌గా ఉండి సిటీ బస్సులు నడిపించలేకపోయారని ఎద్దేవా చేశారు. మహిళా డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. మచ్చలేని నేత జీవన్‌రెడ్డిని గెలిపించేందుకు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, పాత వారిని పట్టించుకోవడం లేదని మైనార్టీ నాయకుడు జావిద్‌ అక్రం వ్యాఖ్యానించడంపై షబ్బీర్‌ స్పందించారు. కష్టకాలంలో తోడున్న కార్యకర్తలు తమ గుండెల్లో ఉన్నారని పేర్కొన్నారు. కవితను విడుదల చేయించేందుకు కేసీఆర్‌ భాజపాతో కుమ్మక్కయారని ఆరోపించారు. ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. దేవుడి పేరుతో ఓట్లడిగే భాజపాకు బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. బోధన్‌, నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌ ప్రసంగించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు లలిత, రాజేశ్వర్‌, నాయకులు గడుగు, నగేష్‌రెడ్డి, ముప్ప గంగారెడ్డి, శేఖర్‌గౌడ్‌, రత్నాకర్‌, మాజీ మేయర్‌ సుజాత పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని